వెంటనే పనులు ఆపాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌కే తలమానికంగా ఉన్న గోల్కొండ కోట వద్ద పైపులైన్ల నిర్మాణ పనులు చేయడం ఆశ్చర్యంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తక్షణమే పనుల్ని ఆపేయాలని ఆదేశాలిచ్చింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అనుమతులు లేకుండా పనులు ఎలా చేస్తున్నారని మండిపడింది. గోల్కొండ కోట వద్ద పైపు లైన్ల నిర్మాణం జరుగుతోందని పత్రికలో వచ్చిన కథనాన్ని పిల్‌గా తీసుకుని చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. “500 ఏండ్ల నాటి కట్టడం. అక్కడ ఎలా నిర్మాణాలు చేయాలనిపించింది. అనుమతులు లేకుండా అలాంటి కట్టడాల వద్ద పనులు చేయకూడదని కూడా తెలియదా? నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న హిస్టారికల్ భవనాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియదా? తెలిసే ఈ పనులు చేస్తున్నారా? రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తించింది. మనం మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాం. చార్మినార్, గోల్కొండ వంటి కట్టడాల్ని జాతీయ హెరిటేజ్ లిస్ట్‌లో పెట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారు?.
నిధులు లేవని చెప్పి ఇలాంటి వాటిని నిర్లక్ష్యం చేస్తే చరిత్ర క్షమించదు. చరిత్ర ఉంటేనే మనం ఉంటాం. గతం ఏమిటో లేకుండా భవిష్యత్ గురించి చెప్పకుంటే దానిని ఎవరూ క్షమించలేదు. ఈ తరహా కట్టడాన్ని జాతీయ రక్షిత స్మారక కట్టడాల జాబితాలో చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే మార్గదర్శలకు ఏవిధంగా ఉన్నాయో చెప్పాలి” అని ఆదేశించింది. హైదరాబాద్‌లోని హిస్టారికల్ కట్టడాల లిస్ట్‌లో ఏ భవనాలు ఉన్నాయి.. కొత్త వాటిని చేర్చేందుకు ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదని ప్రశ్నించింది. తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ –2017 ప్రకారం హెరిటేజ్ మాన్యుమెంట్స్ కమిటీ వేయాలని ఎర్రమంజిల్ బిల్డింగ్ జడ్జిమెంట్‌లో చెప్పిన మేరకు కమిటీని ఎందుకు వేయలేదని ప్రశ్నించింది. అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తర్వాతి విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది. ఈ కేసులో అమికస్‌క్యూరీగా సీనియర్ లాయర్ నిరంజన్‌రెడ్డిని డివిజన్ బెంచ్ నియమించింది.
