జీవో ఇచ్చి ఆరేండ్లయినా.. రైతులకు పరిహారం ఇయ్యరా

జీవో ఇచ్చి ఆరేండ్లయినా.. రైతులకు పరిహారం ఇయ్యరా

హైదరాబాద్, వెలుగు: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జరిగిన జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారం చెల్లిస్తామని జీవో ఇచ్చిన రాష్ట్ర సర్కారు, దాని అమలును గాలికొదిలేసిందని మండిపడింది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు కూడా ప్రతిరోజూ ఇబ్బందులు పడుతూనే ఉండాలా అని ప్రశ్నించింది. జోవో ఇచ్చి ఆరేండ్లైనా ఇప్పటివరకు పరిహారం ఎందుకు చెల్లించలేదో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి తదుపరి విచారణకు హాజరై వివరించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్‌‌ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌‌కుమార్ షావిలి డివిజన్ బెంచ్‌‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆత్మహత్య చేసుకున్న 133 మంది రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షల ఎక్స్‌‌గ్రేషియా చెల్లిస్తామని 2015 సెప్టెంబర్‌‌లో జీవో 173 ఇచ్చింది. అయితే ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని ఆరోపిస్తూ సిద్దిపేటకు చెందిన సోషల్‌‌‌‌ వర్కర్‌‌‌‌ కొండల్‌‌‌‌రెడ్డి హైకోర్టులో పిల్‌‌‌‌ వేశారు. ఈ పిల్‌‌‌‌ను డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ గురువారం మరోసారి విచారించింది. పిటిషనర్‌‌‌‌ తరఫున లాయర్‌‌‌‌‌‌‌‌ వసుధా నాగరాజ్‌‌‌‌ వాదనలు వినిపిస్తూ.. జీవో ఇచ్చి ఆరేండ్లవుతున్నా, అది అమలు కాలేదన్నారు.వికారాబాద్‌‌‌‌లో 13 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 23 మంది సహా ఇతర జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న 133 మంది రైతులకు చెందిన కుటుంబాలు పరిహారం కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు. గడువు ఇస్తే వివరాలు తెలియజేస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన బెంచ్.. ఏప్రిల్‌‌‌‌ 6న జరిగే విచారణకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి హాజరుకావాలని ఆదేశించింది.

For more news..

 

పాత ట్యాంకులకు భగీరథ కలర్​

పార్టీ చీఫ్ ఓటేయకుండా ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?