పాత ట్యాంకులకు భగీరథ కలర్​

పాత ట్యాంకులకు భగీరథ కలర్​
  • ఆర్​డబ్ల్యూఎస్​ స్కీమ్​కే పైపై పూతలు 
  • రూ.36 వేల కోట్లు ఖర్చు పెట్టి పైపులు వేసిన్రు
  • ఏడేండ్లయినా భరోసా ఇవ్వని భగీరథ నల్లా నీళ్లు
  • అవే నీళ్ల ట్యాంకులు.. అవే ఇంట్రా పైపులు
  • మిషన్​ భగీరథ పేరుతో ప్రచార హంగామా
  • కాంట్రాక్టర్లకే లాభాలు.. జనానికి వాటర్​ క్యాన్లే దిక్కు

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోడూరులో 500 ఇండ్లు ఉండగా, మిషన్​ భగీరథ కింద 460 నల్లా కనెక్షన్లు ఇచ్చారు. స్కీం కొత్తదేగానీ ట్యాంకు, పైపులైన్ సహా అన్నీ పాత ఆర్​డబ్ల్యూఎస్​ స్కీంలోని ఇన్​ఫ్రాస్ట్రక్చర్​నే వాడుకున్నరు. పాత ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుకే ఆస్మాన్ కలర్​ వేసి మిషన్ భగీరథ ట్యాంకుగా మార్చారు. దీనికే మెయిన్ ​పైప్ లైన్ కలిపారు. కానీ  రోజులో రెండుసార్లు నిండాల్సిన ట్యాంకు వాటర్ ప్రెజర్​ సరిగా లేక వారానికోసారి కూడా నిండుతలేదు. నీళ్లు రాక పబ్లిక్​ గొడవ చేయడంతో సర్పంచ్​ పాత బోరుకు మళ్లీ మోటర్​పెట్టించి, ఆ నీళ్లతోనే ట్యాంక్​ నింపిస్తున్నారు. ఇట్లా బోరు నీళ్లు, భగీరథ నీళ్లు కలిపి ఉదయం సగం ఊరికి , సాయంత్రం సగం ఊరికి సప్లై చేస్తున్నరు. బోరునీళ్లు కలవడంతో తాగేందుకు ఇష్టపడని జనం బయట క్యాన్​ వాటర్ కొనుక్కొని తాగుతున్నరు. 

నెట్​వర్క్, వెలుగు: వేల కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు చూపించి.. పాత పైపులు, పాత ట్యాంకులకే కొత్త రంగులేసి ‘మిషన్​ భగీరథ’గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నది. దేశానికే రోల్  మోడల్​ అని పదే పదే ప్రచారం చేసుకుంటున్నా.. ఇంకా చాలా ప్రాంతాలకు రక్షిత మంచినీటిని అందించలేకపోతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అమలైన ఆర్​డబ్ల్యూఎస్​ స్కీమ్​(గ్రామీణ రక్షిత మంచి నీటి పథకం)కు పైపై పూతలు పూయటం తప్ప భగీరథ స్కీమ్​లో డొల్లతనమే కనిపిస్తున్నది. గడిచిన ఏడేండ్లలో  రూ. 36 వేల కోట్ల ఖర్చు చేసి ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చినట్లు ప్రభుత్వం తరచూ చెప్తున్నది. అసలు గుట్టు విప్పితే ‘ఊరు దిబ్బ.. పేరు గొప్ప..’ అన్నట్లుగా ఉంది పరిస్థితి. సగానికిపైగా పాత స్కీమ్ పైపులు, పాత ట్యాంకులు, పాత నల్లాలు, పాత ఇన్​ఫ్రాస్ట్రక్చర్​నే  మిషన్​ భగీరథ స్కీమ్​లో వాడుకున్నారు. పాత వాటర్​ ట్యాంకులకు కొత్తగా బ్లూ కలర్​ వేయించి ‘మిషన్​ భగీరథ’ బ్రాండ్​ అంటున్నారు. 

80 శాతం నిధులు అప్పులే
భగీరథ స్కీమ్​కు ప్రభుత్వం ఇప్పటికే  రూ. 36 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది.  ఓహెచ్‌‌ఎస్‌‌ఆర్‌‌లు, మిగిలిన పెండింగ్‌‌ పనులు పూర్తి చేయడానికి ఇంకో రూ. 3 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఖర్చుకు చేసిన నిధుల్లో బడ్జెట్​ కేటాయింపులకు మించి అప్పులతో సమీకరించినవే 80 శాతం ఉన్నాయి. ఈ స్కీమ్​కు హడ్కో, కమర్షియల్‌‌ బ్యాంకుల నుంచి 80 శాతం నిధులు అప్పుగా.. మిగతా 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌‌ నుంచి నిధులు కేటాయించింది. రాష్ట్రంలోని 96 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 23,890 హ్యాబిటేషన్‌‌లు, 121 మున్సిపాలిటీలకు శుద్ధమైన నీళ్లు సప్లయ్‌‌ చేయడానికి  2016లో మిషన్‌‌ భగీరథ స్కీమ్​ను  ప్రభుత్వం చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 55.95 లక్షల ఇండ్లకు, పట్టణాల్లో 12.83 లక్షల ఇండ్లకు  ట్రీటెడ్‌‌ వాటర్‌‌ సప్లయ్‌‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్​ డబ్ల్యూఎస్​ స్కీమ్​ను మొత్తంగా వాడుకున్నప్పటికీ.. ఏడేండ్లుగా అనుకున్న టార్గెట్​ను సర్కారు చేరుకోలేదు.  భగీరథ ప్లాన్​ ప్రకారం మొత్తం ఇన్‌‌‌‌టేక్‌‌‌‌ స్ట్రక్చర్స్‌‌‌‌ 69 ఉండగా.. ఇందులో ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ఇన్‌‌‌‌టేక్‌‌‌‌ స్ట్రక్చర్స్‌‌‌‌ 50 ఉన్నాయి. వాటర్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్లాంట్స్‌‌‌‌ 156 కాగా.. ఇందులో 106 ఉమ్మడి ఏపీలో నిర్మించినవే ఉన్నాయి. పాత మేజర్‌‌‌‌ స్ట్రక్చర్స్​ను కూడా ఈ స్కీమ్​లోనే కలిపేశారు. మొత్తం లక్షన్నర కిలోమీటర్ల పైపులైన్​ వేయగా పాత ఆర్​డబ్ల్యూఎస్​ స్కీమ్​లో ఉన్న సిమెంట్​, అస్​బెస్టాస్​ పైపులైన్లు పూర్తిగా తొలగించి కొత్త లైన్‌‌‌‌లు వేశారు. ట్రంక్‌‌‌‌, మెయిన్‌‌‌‌ లైన్లు కలిపి 1.05 లక్షల కిలోమీటర్ల పెద్ద పైపులు వేశారు. అప్పటికే ఉన్న 45  వేల కిలోమీటర్ల పైపులైన్‌‌‌‌ను భగీరథకు బదిలీ చేసుకున్నారు. ఇప్పటికీ ఓవర్​హెడ్​ ట్యాంకులు, ఇంట్రాపైపులైన్లు పూర్తి కాకపోవడంతో సగానికి పైగా ఇండ్లకు నల్లా కనెక్షన్లు అందలేదు.

అప్పటి నల్లాలు.. బోర్​ నీళ్లే దిక్కు
రూరల్​ ఏరియాల్లో 80 నుంచి 90%, టౌన్లలో 70 నుంచి 80% ఇంట్రా పైపులైన్ కూడా అప్పటి ఆర్​డబ్ల్యూఎస్​కు చెందినదే. ఎస్సీ కాలనీలు, పాత లైన్​ పూర్తిగా దెబ్బతిన్నచోట్ల కొత్త ఇంట్రా పైపులైన్​ వేశారు. రాష్ట్రంలో దాదాపు ఇరవై శాతానికి మించి ఆవాస ప్రాంతాల్లో పాత ట్యాంకులు, పాత బోర్ల నీళ్లే సరఫరా అవుతున్నాయి. దీంతో పైపుల కాంట్రాకర్లకు లాభాల పంట పండించటం తప్ప.. తమకు కొత్త ప్రయోజనమేమీ లేదని చాలా గ్రామాల్లో ప్రజలు పెదవి విరుస్తున్నారు. లింక్​ చేసిన నీళ్లు అందక.. పాత బోర్​ నీళ్లే వాడుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో పాత బోర్ల నీళ్లు, కొత్త బోర్ల నీళ్లు కలగాపులగం సప్లయ్​ అవుతుండటంతో ఆరోగ్యం కాపాడుకునేందుకు వాటర్ క్యాన్లకే జనం మొగ్గు చూపుతున్నారు.  

పుటుక్కున పగుల్తున్న పైపులు
బడా కాంట్రాక్టు కంపెనీలతో రాష్ట్రమంతటా 1.05 లక్షల కిలోమీటర్ల భారీ పైపులైన్లు​ వేయించిన ప్రభుత్వం.. ఇంటింటికీ నల్లా నీళ్లకు సంబంధించి గ్రామాల్లోని సప్లయ్​  పనులను గాలికొదిలేసింది. ఎక్కడికక్కడ లోకల్ ఏజెన్సీలు,  కాంట్రాక్టర్లకు అప్పగించడంతో పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. లో క్వాలిటీ పైపులను తక్కువ లోతులో వేయడంతో ట్రాక్టర్లు వెళ్లినా, డ్రైన్లు, కేబుల్స్ కోసం ఏ కొంచెం తవ్వినా పైపులు పుటుక్కున పగులుతున్నాయి. కొద్దిపాటి ప్రెజర్​ కూడా తట్టుకోలేక లీకవుతున్నాయి. లీకేజీల భయంతో  ట్రీట్​మెంట్​ ప్లాంట్ల నుంచి తక్కువ ఫోర్స్​తో వాటర్​ వదులుతున్నారు. దీని వల్ల రోజుకు రెండుసార్లు నిండాల్సిన ట్యాంకులు వారానికోసారి కూడా నిండుతలేవు. అటు నీళ్లందక పబ్లిక్ ​గొడవ పెడ్తుండడంతో సర్పంచులు, మున్సిపల్​ ఆఫీసర్లు పాత బోర్లకు మళ్లీ మోటార్లు పెట్టి ట్యాంకుల్లోకి ఎక్కించి సప్లయ్​ చేస్తున్నారు. ఇట్ల ఓసారి బోరు నీళ్లు, మరోసారి భగీరథ నీళ్లు, ఓసారి రెండు కలిసిన నీళ్లు వస్తుండడంతో మిషన్​భగీరథ నీళ్లు తాగేందుకు ఇష్టపడని జనం క్యాన్ ​వాటర్​ కొని తాగుతున్నారు. భగీరథ స్కీం వచ్చాక గ్రామాల్లో పాత బోర్లు బంద్ పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ భగీరథపై నమ్మకం పెట్టుకొని బోర్లు బంద్ చేస్తే గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని సర్పంచులు అంటున్నారు. అందుకే లోకల్​ బోర్ల ద్వారా వాటర్​ ట్యాంకులు నింపి, భగీరథ నీటితో కలిపి సప్లయ్‌‌‌‌ చేస్తూ పరువు కాపాడుకుంటున్నామని చెప్తున్నారు. 

టైమ్​కు రిపేర్లు చేస్తలేరు
మిషన్ భగీరథ ట్రంక్ లైన్లతో పాటు మేజర్ డిస్ట్రిబ్యూటరీ పనులను మేఘా, ఎల్ అండ్ టీ, ఎన్సీసీ, ఐ హెచ్ పీ, మాక్స్ ఇన్ ఫ్రా సహా పలు ఏజెన్సీలు దక్కించుకున్నాయి. పైపులైన్ పనులు చేపట్టిన వర్క్ ఏజెన్సీలే ఐదేండ్ల పాటు ఆపరేషన్, మెయింటనెన్స్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత  ఐదేండ్లలో రిపేర్లకు అయ్యే ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుంది. వర్క్ ఏజెన్సీలు పదేండ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. మెయిన్​ గ్రిడ్ తోపాటు ఇంట్రాపైపులైన్లు పగిలినా, లీకయినా 48  గంటల్లో రిపేర్ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీలపై ఉన్నా రెండు, మూడురోజులకు కానీ రిపేర్లు చేయడం లేదు. దీని వల్ల మళ్లీ వాటర్ ఫ్లో అందుకొని చివరి హ్యాబిటేషన్లకు చేరేందుకు వారం పడుతున్నదని ఆఫీసర్లు చెప్తున్నారు. రాత్రి పంప్​చేసిన వాటర్​ను ఉదయం, మధ్యాహ్నం పంప్​చేసిన వాటర్​ను సాయంత్రం రిలీజ్​ చేసేలా  భగీరథ స్కీం డిజైన్ చేశారు. కానీ ప్రస్తుతం ఫోర్స్​ తక్కువగా ఉండడంతో రోజుకు ఒకసారి కూడా ట్యాంకులు నింపలేకపోతున్నారు.

ఎన్నో ఉదాహరణలు.. 
    సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం గోపాలపురంలో 2వేల ఇండ్లున్నాయి. పాతవి, కొత్తవి కలిపి మూడు ఓవర్​హెడ్​వాటర్​ ట్యాంకులు ఉన్నాయి. 40 కిలోమీటర్ల దూరంలోని అవంతిపురం వాటర్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్​ నుంచి మిషన్​భగీరథ నీళ్లు రావాలి. కానీ ఫోర్స్​ తక్కువగా ఉండడంతో నెలలో వారం రోజులు కూడా నీళ్లు ట్యాంకులకు ఎక్కట్లేదు. దీంతో గ్రామంలోని పాత బోర్లకు ఆరు మోటార్లు పెట్టి కొన్నిసార్లు భగీరథ నీళ్లతో కలిపి , కొన్ని సార్లు నేరుగా  సప్లయ్​ చేస్తున్నారు. 
    మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం పెద్దంపేట పంచాయతీలో 400 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. మిషన్ భగీరథ స్కీం కింద రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. రెండేండ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. పాత పైపులైన్​ వాడుకుంటూ  గ్రామానికి బల్క్ వాటర్ సప్లయ్​ చేసి పాత ట్యాంకును నింపుతున్నారు. గ్రామంలో పైపు లైన్​ పనులు పెండింగ్ ఉండడంతో పాత పైపు లైన్ ద్వారా వాటర్ సప్లై చేస్తున్నారు. భగీరథ నీళ్లు రాకుంటే బోరు వాటర్ ఇస్తున్నారు.
    వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్​ మున్సిపాలిటీలోని  24 వార్డుల్లో 45 వేల మంది నివసిస్తున్నారు. మిషన్​ భగీరథ కింద 120 కిలోమీటర్ల పైప్​ లైన్​ వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 10 కిలోమీటర్ల పైప్​లైన్ ​మాత్రమే పూర్తి చేశారు. పాత పైప్​లైన్​కు మిషన్​ భగీరథ మెయిన్​ పైప్​లైన్​ను లింక్ ​చేసి టౌన్​లో 14 వార్డులకు భగీరథ వాటర్​ సప్లయ్​ చేస్తున్నారు. పాత పైప్​లైన్ కావడంతో తరుచూ లీకై, వాటర్​ కలుషితమవుతున్నదని జనం తాగడం లేదు. మిగిలిన 10 వార్డులకు పాకాల వాగు నుంచి మాటు వీరారం  కెనాల్​కు వచ్చే నీటిని మోటార్ల ద్వారా (ఎలాంటి శుద్ధి చేయకుండానే) పాడైపోయిన ఫిల్టర్​ బెడ్​కు, అక్కడి నుంచి  డైరెక్టుగా ఓవర్​ హెడ్​ ట్యాంక్​కు ఎక్కించి పంపింగ్​ చేస్తున్నారు. దీంతో జనం ఈ నీళ్లను కాలకృత్యాలకు వాడుకుంటూ తాగేందుకు ప్రైవేట్​ వాటర్​ ప్లాంట్ల నుంచి కొనుక్కుంటున్నారు.  
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతలపాలెం మండలం కిష్టాపురం నుంచి భగీరథ నీళ్లు రావాలి. కానీ ఫోర్స్​ తక్కువగా ఉండడంతో నీళ్లు ట్యాంకు ఎక్కడం లేదు. దీంతో హాస్పిటల్ కాంపౌండ్​లో కొత్తగా ఓ బోర్ వెల్ వేసి, ట్యాంకు కు కనెక్షన్ ఇచ్చారు. కొద్ది రోజులు మిషన్​ భగీరథ వాటర్, బోరు వాటర్ కలిపి సప్లై చేశారు‌. నెల రోజులుగా భగీరథ వాటర్ సప్లై పూర్తిగా నిలిచిపోవడంతో బోర్ వాటర్​నే సప్లై చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

సారీ చెప్పిన సరయు.. వివాదం గురించి వివరణ

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా