బ్రీత్ అనలైజర్ టెస్ట్ ద్వారా జాబ్ నుంచి తొలగించడం చెల్లదు

బ్రీత్ అనలైజర్ టెస్ట్ ద్వారా జాబ్ నుంచి తొలగించడం చెల్లదు
  • మద్యం తాగారని వైద్య పరీక్షలతోనే నిర్ధారించుకోవాలి 
  • ఆర్టీసీని తప్పుపట్టిన హైకోర్టు 
  •  డ్రైవర్​ను తొలగిస్తూ మేనేజర్ జారీ చేసిన ఉత్తర్వులు కొట్టివేత  

హైదరాబాద్, వెలుగు: వైద్య పరీక్షలతో నిర్ధారణ చేసుకోకుండా మద్యం సేవించారన్న అభియోగంపై డ్రైవర్‌‌ను ఉద్యోగం నుంచి తొలగించిన ఆర్టీసీ తీరును హైకోర్టు తప్పుపట్టింది. కేవలం బ్రీత్‌‌ అనలైజర్‌‌ పరీక్ష ఆధారంగానే ఉద్యోగం నుంచి తొలగించడం చెల్లదని తేల్చిచెప్పింది. మధిర డిపోకు చెందిన డ్రైవర్ ఎ. వెంకటి మద్యం సేవించడంతోపాటు ధర్నాలో పాల్గొన్నాడన్న అభియోగాలపై ఉద్యోగం నుంచి తొలగిస్తూ డిపో మేనేజర్ గత ఏడాది ఏప్రిల్‌‌ 25న ఉత్వర్వులు జారీ చేశారు.

 ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డ్రైవర్ వెంకటి హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫు లాయర్ వాదిస్తూ.. తనకు మద్యం అలవాటు  లేదని డ్రైవర్ చెప్పినా.. పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగం నుంచి తొలగించారన్నారు. అంతేగాకుండా అప్పీళ్లను దాఖలు చేస్తే రీజినల్‌‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌‌ డైరెక్టర్ కూడా డిపో మేనేజర్ ఉత్తర్వులను సమర్థించారని తెలిపారు. 

మద్యం సేవించలేదని రుజువు చేసుకోవడానికి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ధర్నా ఉదయం 5.30 నుంచి మొదలైనప్పటికీ పిటిషనర్‌‌11.30కు పాల్గొన్నారని, పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ధర్నాలో పాల్గొన్న13 మందిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం పిటిషనర్‌‌పై మాత్రమే చర్యలు తీసుకోవడం వివక్షాపూరిత నిర్ణయమన్నారు. 

వాదనలను విన్న న్యాయమూర్తి బ్రీత్‌‌ అనలైజర్‌‌ టెస్ట్‌‌ కేవలం ప్రాథమిక ఆధారమేనని, రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించి దాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ అధికారులు ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండా కేవలం బ్రీత్‌‌ అనలైజర్‌‌ టెస్ట్‌‌ను ప్రాతిపదికగా తీసుకుని ఉద్యోగం నుంచి తొలగించడం చట్టవిరుద్ధమన్నారు. ధర్నాలో పాల్గొన్న 13 మందిని వదిలేసి కేవలం పిటిషనర్‌‌పై చర్యలు తీసుకోవడం ఏకపక్షమని స్పష్టం చేశారు. పిటిషనర్‌‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ డిపో మేనేజర్‌‌ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ, డ్రైవర్‌‌ను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.