నిజామాబాద్ జిల్లాలో లోకల్ లీడర్లు డీలా.. ఎన్నికల బంద్తో ఆశావహుల ఆశలు ఆవిరి

నిజామాబాద్ జిల్లాలో లోకల్ లీడర్లు డీలా.. ఎన్నికల బంద్తో ఆశావహుల ఆశలు ఆవిరి
  • ఉమ్మడి జిల్లాలో గురువారం 11 నామినేషన్లు దాఖలు
  • సందిగ్ధంలో ప్రధాన పార్టీలు

నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : స్థానిక ఎన్నికల నిర్వహణకు బ్రేక్​ పడింది.గురువారం ఉదయం రిటర్నింగ్​ అధికారులు నోటిఫికేషన జారీ చేయగా, సాయంత్రం రిజర్వేషన్ జీవోపైహైకోర్టు స్టే విధించింది. దీంతో పోటీకి సిద్ధపడుతున్న ఉమ్మడి జిల్లాలోని ఆశావహుల ఆశలు ఆవిరయ్యాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్​ ప్రకారం ఫస్ట్ ఫేజ్ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గురువారం10.30 గంటల నుంచి నామినేషన్లు షురూ చేయగా ఉమ్మడి జిల్లాలో 11 నామినేషన్లు దాఖలయ్యాయి.  

వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేస్తూ మరుసటి రోజు కోసం ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో హైకోర్టు ఇచ్చిన స్టేతో అధికారులు సైలెంట్ అయిపోయారు. అభ్యర్థుల ఎంపికలో తలమునకలైన ప్రధాన పార్టీలు ఊసురుమన్నాయి.

చల్లబడ్డ హడావుడి..

తొలి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో కలెక్టర్ సహ అధికారులు, రాజకీయ పార్టీల నేతలు గురువారం బిజీగా గడిపారు. నిజామాబాద్ జిల్లాలో 18 జడ్పీటీసీ స్థానాల నామినేషన్లు తీసుకునేందుకు 18 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 177 ఎంపీటీసీ స్థానాల నామినేషన్లు తీసుకోవడానికి 58 మంది ఆర్వోలను నియమించారు. కామారెడ్డి జిల్లాలో 14 జడ్పీటీసీ స్థానాలకు 14 మంది ఆర్వోలు,136 ఎంపీటీసీ స్థానాల నామినేషన్లు స్వీకరించేందుకు 45 సెంటర్లు ప్రారంభించారు.  అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేసేందుకు హెల్ప్​​ డెస్క్​సైతం పెట్టారు. రెండు జిల్లాల కలెక్టర్​లు వినయ్​కృష్ణారెడ్డి, అశిష్​ సంగ్వాన్​ ఉదయం నుంచి నామినేషన్ సెంటర్లను విజిట్​ చేస్తూ  ఏర్పాట్లను పరిశీలించారు. 

శుక్రవారం తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సూచనలు ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్​పల్లి జడ్పీటీసీ స్థానానికి ఒక నామినేషన్, డిచ్ పల్లి మండలంలో ఎంపీటీసీ స్థానాలకు 2, కోటగిరిలో 4, మాక్లూర్​లో 1​, మోపాల్​ మండలంలో ఒక నామినేషన్ దాఖలయ్యాయి. కామారెడ్డి జిల్లా ఎంపీటీసీ స్థానాల్లో భిక్కనూర్​ మండలం బస్వాపూర్​ నుంచి ఒకటి, గాంధారి మండలం సీతాయిపల్లిలో మరో  నామినేషన్ దాఖలైంది. ఆ వివరాలు స్టేట్ ఎలక్షన్​ కమిషన్​కు పంపడానికి ఆర్వోలు ఆన్​లైన్​లో అప్​లోడ్​చేసి, శుక్రవారం జరిగే ప్రక్రియ కోసం ఏర్పాట్లు చూసుకుంటున్నారు. బరిలో నిలిచే అభ్యర్థులు ఇంటి టాక్స్​ క్లియరెన్స్​, కులం సర్టిఫికెట్లు, ప్రతిపాదకులతో పాటు ఇతర అవసరాలను సమకూర్చుకుంటున్నారు. అభ్యర్థులకు ఎలక్షన్​ సంబంధ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు రెవెన్యూ, పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  రోజంతా ఎన్నికల హడావుడి చేసిన రాజకీయ పార్టీలు, అధికారులు సాయంత్రం హైకోర్టు ఇచ్చిన స్టేతో ఒక్కసారిగా చల్లబడ్డారు.  

సందిగ్ధంలో పొలిటికల్​ పార్టీలు..

‘స్థానిక’ ఎన్నికల బరిలో అభ్యర్థులను నిలిపేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు గురువారం ఉదయం నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారుపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై  సీఎం రేవంత్​రెడ్డి, టీపీపీసీ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్​గౌడ్, స్టేట్ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్​, మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ ప్రెసిడెంట్లతో జూమ్ మీటింగ్ కూడా నిర్వహించారు.  బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక షురూ చేసింది. ఫస్ట్​ ఫేజ్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక శుక్రవారానికి క్లియర్​ అవుతుందని భావించింది. సాయంత్రం హైకోర్టు స్టేతో పొలిటికల్ పార్టీలన్నీ సందిగ్ధంలో పడ్డాయి.