కేబినెట్‌ సిఫార్సులను గవర్నర్‌ ..తిరస్కరించడం సరికాదు

కేబినెట్‌ సిఫార్సులను గవర్నర్‌ ..తిరస్కరించడం సరికాదు
  • గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు
  • కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్​ పిటిషన్లపై విచారణ
  • కోదండరాం, అమీర్​ అలీఖాన్​ నియామకం రద్దు
  • కొత్తగా నియామక ప్రక్రియ చేపట్టాలని సూచన

హైదరాబాద్, వెలుగు : గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామక వివాదంపై హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లను సూచిస్తూ గత ప్రభుత్వ కేబినెట్‌ చేసిన సిఫార్సులను గవర్నర్‌ తిరస్కరించడం సరికాదని పేర్కొంది. అదేవిధంగా.. ప్రస్తుత ప్రభుత్వ కేబినెట్​ సిఫార్సులకు అనుగుణంగా మరో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది.

కొత్తగా గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ చేపట్టాలని, మరోసారి ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని తీర్పులో పేర్కొంది. 

రాజ్యాంగంలోని ఆర్టికల్‌‌‌‌ 171 (5) ప్రకారం కేబినెట్‌‌‌‌ సిఫార్సులకు గవర్నర్  కట్టుబడి ఉండాల్సి ఉంటుందని తెలిపింది. అయితే.. కేబినెట్‌‌‌‌ సిఫార్సు చేసిన వ్యక్తుల అర్హత లేదా అనర్హత అంశాలను పరిశీలించడానికి గవర్నర్‌‌‌‌కు అధికారం ఉంటుందని.. ఇందుకు అవసరమైన డాక్యుమెంట్స్, ఇన్ఫర్మేషన్‌‌‌‌ వంటివి ప్రభుత్వం నుంచి తీసుకోవచ్చని చెప్పింది. సిఫార్సు చేసిన పేర్లను ఆమోదించేందుకు అభ్యంతరాలు ఉంటే వాటిని వివరిస్తూ ఆ రికమండేషన్స్‌‌‌‌ను తిరిగి ప్రభుత్వానికి గవర్నర్​ పంపాలని హైకోర్టు పేర్కొంది.

ఈ విధంగా చేయకుండా పిటిషనర్లు దాసోజు శ్రవణ్‌‌‌‌ కుమార్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్‌‌‌‌ తిరస్కరించడం రాజ్యాంగ  వ్యతిరేకమని తప్పుబట్టింది.  శ్రవణ్​, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ జె.అనిల్‌‌‌‌ కుమార్​తో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ 73 పేజీల తీర్పును గురువారం వెలువరించింది. ‘‘కేబినెట్‌‌‌‌ చేసిన సిఫార్సును పునఃపరిశీలనకు పంపే అధికారం కూడా గవర్నర్‌‌‌‌కు ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌‌‌‌ 361 ప్రకారం కోర్టుకు గవర్నర్​ జవాబుదారీ కాదు.. గవర్నర్‌‌‌‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేయబోవు.

గవర్నర్‌‌‌‌ను ప్రతివాదిగా చేసేందుకు కూడా ఆస్కారం లేదు. కాబట్టి రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా తగిన చర్య తీసుకోవాలని ఈ కోర్టు భావించి తీర్పు చెప్తున్నది” అని అందులో పేర్కొన్నారు. గవర్నర్‌‌‌‌ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌‌‌‌కుమార్, కుర్ర సత్యనారాయణ పేర్ల సిఫార్సును తిరస్కరిస్తూ 2023 సెప్టెంబర్‌‌‌‌ 19న గవర్నర్‌‌‌‌  ఇచ్చిన ఆదేశాలను డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ రద్దు చేసింది. అలాగే గవర్నర్‌‌‌‌ ఆదేశాల మేరకు కోదండరాం, అమీర్‌‌‌‌ అలీఖాన్‌‌‌‌ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ను కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. 

ప్రమాణ స్వీకారం చేయకుండా అప్పట్లో స్టే

2023 జులై 31న అప్పటి కేసీఆర్‌‌‌‌ సర్కార్‌‌‌‌ కేబినెట్‌‌‌‌ గవర్నర్‌‌‌‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్‌‌‌‌కుమార్, కుర్ర సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేసింది. వీటిని గవర్నర్‌‌‌‌ తిరస్కరిస్తూ అదే ఏడాది సెప్టెంబర్‌‌‌‌ 19న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్యను సవాల్‌‌‌‌ చేస్తూ శ్రవణ్​, సత్యనారాయణ హైకోర్టులో విడివిడిగా పిటిషనర్లు వేశారు. ఆర్టికల్‌‌‌‌ 171(5) ప్రకారం గవర్నర్‌‌‌‌కు ఉన్న విస్తృతాధికారాలతో తిరస్కరిస్తున్నట్లు ప్రకటించడాన్ని పిటిషన్లలో సవాల్‌‌‌‌ చేశారు. ఈ కేసు విచారణలో ఉన్నప్పుడు రేవంత్‌‌‌‌ ప్రభుత్వ కేబినెట్‌‌‌‌  గవర్నర్‌‌‌‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌‌‌‌ కోదండరాం

జర్నలిస్ట్‌‌‌‌ అమీర్‌‌‌‌ అలీ ఖాన్‌‌‌‌ను నియమించాలని గవర్నర్‌‌‌‌కు సిఫార్సు చేసింది. వీటికి గవర్నర్‌‌‌‌ ఆమోదం తెలపడంతో గత జనవరి 27న ప్రభుత్వం గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేసింది. వీటిని కూడా శ్రవణ్​, సత్యనారాయణ హైకోర్టులో సవాల్‌‌‌‌ చేశారు. కోదండరాం, అమీర్‌‌‌‌ అలీఖాన్‌‌‌‌ను ప్రధాన పిటిషన్‌‌‌‌లో ఇంప్లీడ్‌‌‌‌ చేశారు. దీంతో కోదండరాం, అమీర్​ అలీఖాన్‌‌‌‌  ప్రమాణ స్వీకారంపై అప్పట్లో కోర్టు స్టే ఇచ్చింది.