గణేశ్​ ఆగయా!.. నవరాత్రులకు విగ్రహాలు రెడీ 

గణేశ్​ ఆగయా!.. నవరాత్రులకు విగ్రహాలు రెడీ 
  • సిటీలో ఊపందుకున్న కొనుగోళ్లు
  • రాజస్థాన్​, మహారాష్ట్ర  కార్మికులతో విగ్రహాల తయారీ 
  • ఎన్నికల వస్తుండగా భారీగా పెరగనున్న మండపాలు​
  • ఈసారి వందల కోట్లలో నడవనున్న బిజినెస్​

పద్మారావునగర్, వెలుగు: వినాయక నవరాత్రుల నేపథ్యంలో  సిటీలో గణపతి విగ్రహాల తయారీ, కొనుగోలు ఊపందుకుంది. అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తుండగా ఈఏడాది వినాయక మండపాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటినుంచే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీల నేతలు గణపతి విగ్రహాల కొనుగోలుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బస్తీలు, గల్లీల్లో  గణేశ్​మండప ఖర్చులు భరించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ఈసారి వినాయక నవరాత్రోత్సవాల బిజినెస్​ భారీగానే కొనసాగనుంది. ఇప్పటికే మండపాల నిర్వాహకులు విగ్రహాలకు అడ్వాన్స్​ ఇచ్చి రిజర్వు చేసుకోగా, మరికొందరు తీసుకెల్లే పనిలో ఉన్నారు. 

విదేశాలకు కూడా ఎగుమతి

గ్రేటర్​హైదరాబాద్​లో దాదాపు 3 లక్షల పెద్ద విగ్రహాలు, కోటి 50 లక్షల వరకు చిన్న విగ్రహాలు తయారు చేస్తున్నారు. ధూల్​పేట, ఉప్పల్, నాగోల్​, పెద్ద అంబర్​పేట, మియాపూర్​తదితర ప్రాంతాల్లో విగ్రహాల తయారీ కార్ఖానాలు దాదాపు 500 వరకు ఉంటాయి. అమ్మకాలతో వేల సంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల్లో ఉపాధి పొందుతుంటారు. కరోనా కారణంగా రెండేళ్లు  విగ్రహాల తయారీ దెబ్బతినగా.. గతేడాది నుంచి పుంజుకుంది. పెద్ద విగ్రహాలను స్థానికంగా  చేస్తుండగా, చిన్నవి షోలాపూర్ నుంచి బల్క్​ తీసుకొచ్చి హోల్​సేల్​ అమ్మకాలు షురూ అయ్యాయి. సిటీలో తయారయ్యే విగ్రహాలు రాష్ర్టంలోని పలు జిల్లాలకు తీసుకెళ్తుండగా, ఇతర రాష్ర్టాల వాళ్లు కూడా ఆర్డర్​ చేసి కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. ప్రత్యేక డిజైన్లతో తయారు చేసే విగ్రహాలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నట్టు చెప్పారు.  

 పీవోపీతోనే ఇంకా తయారీ..

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్​ఆఫ్​ప్యారిస్ (పీవోపీ)తో తయారుచేసే విగ్రహాలతో పోల్చితే మట్టితో చేసినవి ఎంతో మేలని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్నేండ్లుగా మట్టి గణపతులపైనా జనాల్లో  అవగాహ న పెరిగింది. అయితే.. వీటి తయారీలో ఇబ్బందులు ఉన్నాయని నిర్వాహకులు చెప్పారు.  ఎక్కువ సమయం పట్టడంతో పాటు డ్యామేజీకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం నిల్వ ఉంచడం కూడా సాధ్యం కాదు. ప్లాస్టర్​ప్యారిస్ తో అయితే మోల్డ్(డై), కర్రలను వాడి సులభంగా తయారు చేయొచ్చు. అదే మట్టి అయితే చేతులతో నొక్కుతూ చేయాల్సి ఉంటుంది. దీంతో మట్టి విగ్రహాల తయారీకి కార్మికులు ఇష్టపడటం లేదంటూ పేర్కొంటున్నారు.  దీంతో  వీటి ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎనిమిది ఫీట్ల ప్లాస్టర్​ప్యారిస్​గణేశుడి విగ్రహం ధర రూ. 20 వేలు ఉంటే, మట్టి విగ్రహం ధర రూ. 30 వేల వరకు ఉంటుంది. 

ఎకో ఫ్రెండ్లీ సీడ్ గణపతి.. కొత్తట్రెండ్ 

ఇటీవల నిమజ్జనం అవసరం లేని ఎకో ఫ్రెండ్లీ సీడ్​గణపతి కొత్త ట్రెండ్​ వచ్చింది. మట్టితో తయారు చేసే చిన్నసైజ్​ విగ్రహాలను చేసే సమయంలోనే పలు రకాల మొక్కలకు సంబంధించిన  విత్తనాలు పెడతారు. తొమ్మిది రోజులు ఇంట్లో పూజలు చేశాక నిమజ్జనం చేయకుండా, ఆ విగ్రహాన్ని  పూలకుండీలో పెడితే , కొద్ది రోజుల్లో  కరిగి విత్తనాలు  మొలకెత్తి మొక్కలుగా పెరుగుతాయి.  

పెరిగిన ముడిసరుకు ధరలు 

ఓ వైపు ప్లాస్టర్​ఆఫ్​ ప్యారిస్​లాంటి ముడిసరుకు ధరలతో పాటు కూలీల రేట్లు పెరగడంతో విగ్రహాల రేట్లు పెంచక తప్పలేదని తయారీదారులు చెబుతున్నారు. గతేడాది 25 కిలోల బ్యాగ్​రూ 125 ఉంటే ఇప్పుడు డబుల్​అయి రూ. 250 కి చేరుకుందని ఉప్పల్​కార్ఖాన నిర్వాహకుడు బస్వరాజ్​తెలిపారు. విగ్రహాల తయారీ ధరలు గతంతో పోల్చితే ఈసారి 20 శాతం పెరిగాయి. 

 ఎందరికో ఉపాధి 

ప్రతి ఏడాది వినాయక ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతారు. విగ్రహాలను తయారు చేసే కార్మికులు, కార్ఖానాల నిర్వాహకులు, పెయింటర్స్​, ఆటో, ట్రాలీ డ్రైవర్లు, లోడిండ్​, అన్​లోడింగ్​లేబర్లు, పెయింట్ షాపులు, మండపాల అలంకరణ చేసే ఎలక్ట్రీషియన్లు, డెకరేషన్ సిబ్బంది.. ఇలా చాలా మంది ఉపాధి పొందే అవకాశం ఉంది. విగ్ర హాల తయారీ, స్ర్పే పెయింటింగ్​చేసే కార్మికులు రాజస్థాన్​, మహారాష్ర్ట నుంచి వస్తుండగా, స్థానికుల సంఖ్య తక్కువగానే ఉంది. 

ఐదేండ్లుగా మండపం పెడుతున్నాం..

మా కాలనీలో  ఐదేండ్లుగా వినాయకుడి మండపం పెడుతున్నాం. ఈసారి కూడా నవరాత్రోత్సవాలు ఘనంగా చేయడానికి నిర్ణయించాం. ఫ్రెండ్స్ తో కలిసి గణేషుడిని కొనడానికి ఉప్పల్​వచ్చాం. రూ 40 వేల విగ్రహం కొంటున్నాం. 9 రోజుల వేడుకలకు ఒక లక్షా 50 వేల దాకా ఖర్చు అవుతుంది.  - 
భరత్, దుర్గానగర్​యంగ్ స్టార్ అసోసియేషన్, నాచారం

 ఈసారి బిజినెస్ పెరగొచ్చు 

 ఈ ఏడాది ఎన్నికల కారణంగా విగ్రహాల బిజినెస్​పెరిగే అవకాశముంది. ముడిసరుకు తదితర ధరలు పెరగడంతో కొంత ఇబ్బందిగా ఉంది. విగ్రహాల తయారీతో ఏ ఒక్కరికో కాకుండా ప్రత్యక్షం గా, పరోక్షంగా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. విద్యార్థుల కూడా పేరెంట్స్​ తో వచ్చి విగ్రహాలను తీసుకెళ్లి రిటైల్ గా అమ్ముతూ ఆదాయం పొందుతున్నారు. 
- జీవనె బస్వరాజు, విగ్రహాల కార్ఖాన నిర్వాహకుడు, నాగోల్ మెట్రో వద్ద

రోజుకు రూ. 800 ఇస్తరు

15 రోజుల నుంచి విగ్రహాలకు స్ర్పే పెయింటింగ్​చేస్తున్నాను. రోజుకి రూ.800 ఇస్తారు. గణేష్​ ఉత్సవాలు ముగిసిన తర్వాత వేరే పనులు చేసుకుంటాం. అందంగా, ఆకర్శణీయంగా కనిపించేందుకు ఒక్కో విగ్రహానికి చాలా రంగులు వాడుతాం.

పరంజ్యోతి, స్ర్పే పెయింటింగ్ కార్మికుడు, జీడిమెట్ల