రాజాసింగ్కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న పోలీసులు

రాజాసింగ్కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న పోలీసులు
  • 41 సీఆర్‌‌పీసీ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదన్న డిఫెన్స్ లాయర్
  • రిమాండ్‌ను రిజెక్ట్‌ చేసిన కోర్ట్.. రిలీజ్ చేయాలని ఆర్డర్

హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్టు వ్యవహారంలో హై డ్రామా నడిచింది. వివాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఇవాళ ఉదయమే రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అరెస్ట్ సమయంలో 41 సీఆర్‌‌పీసీ,సుప్రీంకోర్ట్‌ నియమాలు పాటించకపోవడంతో ఎదురు దెబ్బ తగిలింది. రాజాసింగ్ ను రిమాండ్‌ చేయాలన్న ప్రాసిక్యూషన్ అభ్యర్థనను తిరస్కరిస్తూ నాంపల్లి కోర్ట్ ఆదేశాలు జారీచేసింది. పోలీసుల అదుపులో ఉన్న రాజాసింగ్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. కోర్టు తీర్పు అనంతరం రాజాసింగ్‌కి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమౌతున్నారు.

12 పోలీస్ స్టేషన్లలో కేసులు

సైబరాబాద్‌ శిల్ప కళావేదికలో శనివారం కమెడియన్‌ మునావర్‌ ఫారూకి షో జరిగిన విషయం తెలిసిందే. షో నిర్వహిస్తే అడ్డుకుంటామని ప్రకటించిన రాజాసింగ్.. మునావర్ ఒక వర్గం వారి మనోభావాలు దెబ్బతినేలా కామెంట్స్ చేస్తాడని ఆరోపించారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు మధ్య షో నిర్వహించారు. దీంతో రాజాసింగ్‌ ఓ వీడియోను రికార్డ్‌ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ రాజాసింగ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా 12 పోలీస్ స్టేషన్స్‌లో ఫిర్యాదులు వచ్చాయి.మంగళవారం ఉదయం బషీర్‌‌బాగ్‌లోని సీపీ ఆఫీస్‌ ముందు ఎంఐఎం కార్యకర్తలు ధర్నాచేశారు.

డబీర్‌‌పుర్‌లో ఎమ్మెల్యే బలాల కంప్లైంట్‌‌ 

రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని మలక్‌పేట్‌ ఎమ్మెల్యే బలాల డబీర్‌‌పుర పీఎస్‌లో కంప్లైంట్‌ చేశారు. ఈ కేసులో డబీర్‌‌పుర పోలీసులు రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ధూల్‌పేట్‌లోని ఇంటి నుంచి బొల్లారం పోలీసు స్టేషన్ కు తరలించారు. భారీ బందోబస్తు మధ్య మధ్యాహ్నం 3 గంటల  సమయంలో నాంపల్లి కోర్టుకు తరలించారు. 14వ అడిషనల్ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. రాజాసింగ్ తరుపున లాయర్‌‌ కరుణసాగర్‌ పిటిషన్ ఫైల్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారని వాదించారు. 41 సీఆర్‌‌పీసీ నోటిసులు, సుప్రీంకోర్ట్‌ నియమాలు పాటించలేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్ట్‌ రాజాసింగ్ తరపు లాయర్ల వాదనలతో ఏకీభవించింది. రిమాండ్‌ రిపోర్టును రిజెక్ట్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఓల్డ్‌సిటీలో ఆందోళనలు, కోర్టు వద్ద లాఠీచార్జ్‌

రాజాసింగ్‌ వీడియోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ హైదరాబాద్ పాతబస్తీలో నిరసనలు జరిగాయి. ఆందోళనకారులు రాజాసింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. షాపులు క్లోజ్ చేసి నిరసర తెలిపారు. ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టుకు రాజాసింగ్ అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. నినాదాలు చేస్తూ కోర్టు కాంప్లెక్సులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. లా అండ్‌ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కలిసి రాజాసింగ్ అనుచరులను కోర్టు వద్ద నుంచి పంపించేశారు. రాజాసింగ్‌ రిమాండ్‌ను తిరస్కరించిన కోర్టు పోలీసులు అనుసరించిన తీరును తప్పుబట్టింది.