- ఎన్నికను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
- అధికారులను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు
ఖమ్మం రూరల్, వెలుగు : తల్లంపాడు గ్రామ ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామ ఉప సర్పంచ్ ఎన్నిక సోమవారం నిర్వహించాల్సి ఉండగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధికారులు వంతపాడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నిక నిర్వహించకుండా అడ్డుకున్నారు. తల్లంపాడు గ్రామంలో 12 వార్డులకు గాను బీఆర్ఎస్, సీపీఎం పొత్తులో భాగంగా ఏడు వార్డులు, కాంగ్రెస్ పార్టీ 5 వార్డులు గెలుచుకున్నారు.
ఏడు వార్డులు గెలిచిన కూటమికి ఉప సర్పంచ్ పదవి దక్కకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ వార్డు మెంబర్ కందుల చక్రవర్తిని పార్టీలో ఉప సర్పంచ్ పదవి ఇస్తామని అతని కనిపించకుండా దాచారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు 200 మందితో వార్డు మెంబర్ చక్రవర్తి ఇంటికి వెళ్లగా అతను ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులను నిలదీశారు. వారికి కూడా తెలియదని సమాధానం చెప్పడంతో వారు చక్రవర్తిని వెతికి పట్టుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప సర్పంచ్ పదవి ఇవ్వలేమని అందుకు సమానంగా రూ.5 లక్షలు ఇస్తామని మాట మార్చడంతో అది నచ్చని చక్రవర్తి మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరాడు. తల్లంపాడులో ఏడు వార్డులు గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి ఉప సర్పంచ్ పదవి వరిస్తుందని భయంతో ఎన్నిక నిర్వహించకుండా బీఆర్ఎస్ వార్డు మెంబర్ను కనిపించకుండా దాచారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారని ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించేందుకు వచ్చిన ఆర్టీవో కారును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్త ఏర్పడింది. ఉద్రిక్తల నేపథ్యంలో పోలీసు బలగాలు బందోబస్తు ఏర్పాటు చేశారు.
