ఈవీఎంల తరలింపులో హైడ్రామా.. అర్ధరాత్రి దాకా పోలింగ్​ బూత్​లలోనే..

ఈవీఎంల తరలింపులో హైడ్రామా..  అర్ధరాత్రి దాకా పోలింగ్​ బూత్​లలోనే..
  • గురువారం సాయంత్రం 6.30 గంటలకు ముగిసిన పోలింగ్
  • శుక్రవారం తెల్లవారుజామున డిస్ట్రిబ్యూషన్​ కేంద్రానికి తరలింపు
  • కేంద్ర బలగాల కొరత వల్లే జాప్యం జరిగిందంటున్న ఎలక్షన్​ ఆఫీసర్లు
  • రాత్రంతా నిద్రలేకుండా గడిపిన కాంగ్రెస్ ​శ్రేణులు

కోల్​బెల్ట్​, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఎన్నికలు ముగిసిన వెంటనే స్ట్రాంగ్​రూంకు తరలించాల్సిన ఈవీఎంలను అర్ధరాత్రి దాకా పోలింగ్​ కేంద్రాల్లోనే ఉంచడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఉదయం నుంచీ ఎమ్మెల్యే బాల్క సుమన్​, ఆయన అనుచరుల ఆగడాలు చూసిన కాంగ్రెస్​ శ్రేణులు ఈవీఎంలను తరలించిన తీరుపై ఒకింత ఆందోళనకు గురయ్యారు. సాయంత్రం 6.30 గంటలకు అన్నిచోట్లా పోలింగ్​ ముగిసినప్పటికీ చెన్నూర్​ మండలం కిష్టంపేటలోని డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ ​సెంటర్​కు  తరలించేసరికి శుక్రవారం తెల్లవారింది. దీనికి తోడు జైపూర్, కోటపల్లి, భీమారం, చెన్నూర్ మండలాల్లోని వివిధ పోలింగ్ సెంటర్ల నుంచి ఈవీ ఎంలను తరలిస్తుండగా మధ్యలో బస్సులను నిలిపి వేశారనే ప్రచారం కాంగ్రెస్​ శ్రేణులను మరింత ఆందోళనకు గురిచేసింది. ఈవీఎంలను కేంద్ర బలగాల పర్యవేక్షణలో  తరలించాల్సి ఉండగా, సిబ్బంది లేకపోవడం వల్లే ఆలస్యమైందని ఆఫీసర్లు చెప్పడం ఎన్నికల అధికారులు, పోలీసుల నిర్లక్ష్యానికి అద్దంపట్టింది.

ఈవీఎంల తరలింపులో తీవ్ర జాప్యం..

చెన్నూరు నియోజకవర్గంలోని  227 పోలింగ్​ కేంద్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే సెంటర్లవారీగా బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్, కంట్రోల్​ యూనిట్లకు సీల్​వేసి వెంటవెంటనే మొదట కిష్టంపేటలోని డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్​ సెంటర్​కు అక్కడి నుంచి ఓట్ల లెక్కింపు కోసం హాజీపూర్​ మండలంలోని ఐజా ఇంజినీరింగ్​ కాలేజీకి తరలించాల్సి ఉంది. నిజానికి చెన్నూర్​ మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గం కావడంతో ఇక్కడ పోలింగ్ గురువారం సాయంత్రం 4 గంటలకే ముగిసింది. అప్పటికీ గేట్లు మూసి క్యూలైన్లలో ఉన్నవారికి అవకాశం ఇవ్వగా, అన్నిచోట్లా  సాయంత్రం 6.30 గంటలకు పోలింగ్ ​పూర్తయింది. తర్వాత గంట, రెండు గంటల వ్యవధిలో ఈవీఎంలన్నింటినీ కిష్టంపేట స్ర్టాంగ్ రూమ్​కు తరలించాల్సి ఉండగా అర్ధరాత్రి వరకు ఈవీఎంలను తరలించాల్సిన వెహికల్స్​పోలింగ్​ కేంద్రాలకే పరిమితమయ్యాయి. గంటల కొద్దీ సెంటర్లలోనే ఈవీఎంలను ఉంచడంపై కాంగ్రెస్​ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉదయం నుంచీ సుమన్, ఆయన అనుచరుల ఆగడాలను స్వయంగా చూసిన కాంగ్రెస్ ​శ్రేణులు ఆఫీసర్ల తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు.  బీఆర్ఎస్​అభ్యర్థికి సహకరించేందుకే ఈవీఎంలను స్ర్టాంగ్​రూమ్​కు తరలించడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇక అర్ధరాత్రి తర్వాత  జైపూర్, కోటపల్లి, భీమారం, చెన్నూర్ మండలాల నుంచి ఈవీఎంలతో బయలుదేరిన బస్సులను మధ్యలో నిలిపివేశారనే ప్రచారం కాంగ్రెస్​ శ్రేణులను మరింత ఆందోళనకు గురిచేసింది. కాగా, దీనిపై చెన్నూరు రిటర్నింగ్ ఆఫీసర్​ సిడాం దత్తు మాట్లాడుతూ.. ఈవీఎంలున్న వెహికల్​కు సెంట్రల్​ ఫోర్స్​ తో సెక్యూరిటీ కల్పించాల్సి ఉందని, కానీ,  సిబ్బంది కొరత కారణంగా ఒక రూట్​ తర్వాత మరో రూట్​28 రూట్లలో బస్సులను తరలించాల్సి వచ్చిందని, అందుకే  ఈవీఎంల తరలింపుతో ఆలస్యమైందని చెప్పారు. అక్కడి నుంచి మంచిర్యాలలోని ఐజా ఇంజినీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించేసరికి శుక్రవారం తెల్లవారింది.

రోజంతా సుమన్​ అనుచరుల ఆగడాలు..

పోలింగ్​ సందర్భంగా గురువారం ఉదయం నుంచే చెన్నూర్​ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాల్కసుమన్​ అనుచరులు నానా హంగామా చేశారు. కాంగ్రెస్​ నేతలను, ఏజెంట్లను అడుగడుగునా అడ్డుకొని దాడులకు యత్నించడం, పోలింగ్​ బూత్​ల వద్ద బీఆర్ఎస్​ కండువాలు వేసుకొని ప్రచారం చేయడం, టైం ముగిశాక పోలింగ్​ కేంద్రాల్లో తిష్టవేయడం లాంటి ఘటనలకు పాల్పడ్డారు. వీరిని అడ్డుకోవాల్సిన పలువురు ఎన్నికల అధికారులు, పోలీసులు అండగా నిలవడంతో ఆగ్రహించిన కాంగ్రెస్ శ్రేణులు పలుచోట్ల ఆందోళనకు దిగారు.  చెన్నూర్ మండలం పొన్నారం, కొమ్మెర, దుగ్నెపల్లి గ్రామాల్లోని  పోలింగ్ బూత్ లలో డోర్లు మూసి ఎన్నికలు నిర్వహించడంపై ఓటర్లు, కాంగ్రెస్​ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసి చెన్నూరు కాంగ్రెస్​ అభ్యర్థి వివేక్​ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ  దుగ్నేపల్లి గ్రామానికి చేరుకోగా, బాల్కసుమన్​ అనుచరులు అడ్డుకొని దాడికి యత్నించారు. ఇది మరచిపోకముందే మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ లోని134 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ​ముగిశాక సుమన్ అనుచరులు తిష్టవేశారు. దీంతో చెన్నూర్​ కాంగ్రెస్​ అభ్యర్థి అక్కడికి చేరుకొని డ్యూటీ ఆఫీసర్లపై, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద సెంట్రల్ ఫోర్స్​తో భద్రత ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఈవీఎంల తరలింపులోనూ ఇదే నిర్లక్ష్యం కొనసాగడంతో కారణమైన ఆఫీసర్లు, లోకల్​ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.