అప్పు కావాలంటే రిజిస్ట్రేషన్ చేయాల్సిందే..!

 అప్పు కావాలంటే రిజిస్ట్రేషన్ చేయాల్సిందే..!
  • యాదాద్రి జిల్లాలో భూమి, ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్ చేస్తేనే అప్పు ఇస్తున్న వ్యాపారులు 
  • అధిక వడ్డీతో అప్పులు చెల్లిస్తున్న బాధితులు
  • అసలు, వడ్డీ పెరిగిపోవడంతో కట్టలేక నానా తిప్పలు

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో భూమి లేదా ఖాళీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తేనే అప్పులు ఇచ్చే పరిస్థితి నెలకొంది. గతంలో మార్టిగేజ్ చేసి అప్పులు తీసుకునే పద్ధతి ఉండేది. ప్రస్తుతం అప్పు కావాలంటే భూమిని కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే ఇస్తున్నారు. రూ. 50 లక్షల విలువ ఉన్న ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తే గరిష్టంగా రూ. 25 నుంచి 30 లక్షల వరకు అప్పు ఇస్తున్నారు. 

అంతేకాకుండా రూ. 5 వడ్డీతో ఏడాదిలో అసలుతో పాటు వడ్డీ కలిపి మొత్తం తిరిగి చెల్లించాలి. అలా అయితేనే మళ్లీ అప్పు తీసుకున్న వ్యక్తి పేరుపై తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అగ్రిమెంట్ చేస్తున్నారు. దీంతో సాధారణ ప్రజల్లో తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. 

ఒక్కో చోట ఒక్కోలా.. 

జిల్లాలో రిజిస్ట్రేషన్ విలువలు ప్రాంతానికీ, సర్వే నెంబర్‌కి భారీగా మారుతున్నాయి.  గజం ధర రూ. 700 నుంచి రూ. 32,200 వరకూ ఉండగా, ఎకరం విలువ రూ. 3.50 లక్షల నుంచి రూ. 30 లక్షలు పైగా ఉంది. రాయగిరిలో కొన్ని సర్వే నెంబర్లలో ఎకరం విలువ రూ. 95 లక్షలు దాటగా, చౌటుప్పల్‌లో రూ. 50 లక్షలు పైగానే ఉంది. బహిరంగ మార్కెట్లో మాత్రం ఈ ధరలు మరింతగా పెరిగి రూ. 20 లక్షల నుంచి రూ. 3 కోట్లు దాకా ఉండటంతో, రిజిస్ట్రేషన్ విలువతో పోలిస్తే మార్కెట్ రేటు ఎక్కువగా ఉంటోంది. దీంతో అప్పు ఇచ్చే వారి నియంత్రణలోకి వెళ్లిపోతున్నారు 

భారీ వడ్డీలతో కోల్పోతున్న ఆశలు 

ఈ కొత్త విధానంలో అప్పు తీసుకున్న వారు  వడ్డీ భారం తట్టుకోలేక తమ ఆస్తులను తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు. నెల నెలా భారీ వడ్డీ, సంవత్సరంలో మొత్తం చెల్లించాల్సిన అసలు, రిజిస్ట్రేషన్ ఖర్చులు కలిపి అప్పు తీసుకున్న వారి పరిస్థితి మరింత క్లిష్టమవుతోంది. వడ్డీ భారం పెరిగే కొద్దీ ప్రజలు తమ ఆస్తులపై ఆశ కోల్పోతున్నారు.  ఆర్థిక అవసరాల కోసం అప్పు తీసుకున్నవారు ఆస్తులు కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి.