
దేశవ్యాప్తంగా మొత్తం 6 రూట్ల గుర్తింపు
ఏడాదిలోగా డీపీఆర్ రెడీ చేసేందుకు ప్రయత్నాలు
నాలుగైదేళ్లలో పూర్తికి ప్లాన్
గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైళ్లు
ఇప్పటికే హైదరాబాద్–నాగపూర్ సెమీ హైస్పీడ్ రైల్ ప్రపోజల్
రష్యా ప్రతినిధులుతో చర్చలు
హైదరాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వేలో త్వరలో హైస్పీడ్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్–నాగపూర్ సెమీ హైస్పీడ్ రైల్ ప్రపోజల్ దశలో ఉండగా, కొత్తగా హైదరాబాద్–ముంబై మధ్య నడిపేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించి ఏడాదిలోగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే నాలుగైదు ఏళ్లలో సిటీ నుంచి ముంబైకి రైలు పట్టాలెక్కనుంది. హైదరాబాద్–ముంబై రూట్‌కు రూ.20 వేల కోట్లకు పైనే ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెళ్లే హైస్పీడ్ రైలుతో ప్యాసింజర్లకు ప్రయాణ సమయం భారీ తగ్గనుంది.
నాలుగైదేళ్లలో ప్రాజెక్టు పూర్తి..!
ఈమధ్య హైస్పీడ్, సెమీ హైస్పీడ్ రైల్వే కారిడార్ల కోసం దేశంలో ఆరు రూట్లను ప్రభుత్వం గుర్తించింది. ఈ రూట్లలో హైదరాబాద్–ముంబై (711కిలోమీటర్లు) రైలు కూడా ఉందని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. వీటికి ఏడాదిలోగా డీపీఆర్ తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎంపిక చేసుకున్న మార్గాల్లో స్థల లభ్యత, రద్దీ సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని డీపీఆర్‌ను సిద్ధం చేయాలని సూచించారు. డీపీఆర్ రెడీ కాగానే రైల్వే బోర్డు రివ్యూ కోసం అందజేస్తారు. అటునుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. అక్కడ ఆమోదం లభించగానే నిధులు కేటాయించి, పనులు ప్రారంభిస్తారు. ఆమోదం లభిస్తే ఈ ప్రాజెక్టును వచ్చే నాలుగైదేళ్లలో పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
తగ్గనున్న ప్రయాణ సమయం
హైస్పీడ్ రైలు గంటకు 300 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. యావరేజ్‌గా 200 నుంచి 250కి.మీ. వేగంతో వెళ్తుంది. ప్రస్తుతం లోకమాన్య తిలక్ లాంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి ముంబైకు 12 గంటలు పడుతోంది. హైస్పీడ్ రైళ్లలో మాత్రం 5 నుంచి 6 గంటల్లోపే చేరుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్‌కు రాకపోకలు సాగిస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ గంటకు 120 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ, 8 గంటల్లో గమ్యం చేరుతోంది. సెమీ హైస్పీడ్ రైలు గంటకు గరిష్టంగా 200 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇది అందుబాటులోకి వస్తే నాలుగు నుంచి ఐదు గంటల్లోగా గమ్యాన్ని చేరుకోవచ్చు. దీంతో ప్యాసింజర్లకు సమయం ఆదా కావడంతోపాటు, ఎక్కువ సేపు జర్నీ ఇబ్బందులు ఉండవు. ఈ రైళ్లు ఇంటర్నేషన్ స్టాండర్స్‌తో ఉండనున్నాయి.
కొత్త లైన్లు వేయాలె
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్ను తర్వాతే హైస్పీడ్ లేదా సెమీ హైస్పీడ్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తారు. సాధారణ రైళ్లతో పోలిస్తే హైస్పీడ్ రైళ్లు మరింత వేగంగా పయనిస్తాయి. ప్రస్తుతం ఉన్న ట్రాక్స్ 80 నుంచి 120 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే తట్టుకోగలుగుతాయి. దీంతో కొత్త ట్రాక్ నిర్మించాల్సి ఉంటుంది.