కొల్లాపూర్ లో రోజంతా హైడ్రామా

కొల్లాపూర్ లో రోజంతా హైడ్రామా

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో రోజంతా రాజకీయ హైడ్రామా నడిచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు బహిరంగ చర్చకు సిద్ధపడడంతో టెన్షన్ నెలకొంది. అయితే పోలీసులు చర్చకు అనుమతి లేదన్నారు. పోలీసులు జూపల్లి ఇంటికి వెళ్లకుండా ఎమ్మెల్యే బీరంను అడ్డుకున్నారు. దీంతో బస్టాండ్ దగ్గర ఆయన వర్గీయులు ఆందోళన చేశారు. రాజకీయాల కోసం నియోజకవర్గంలో జూపల్లి అనవసరంగా గొడవలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బీరం. ప్రజలు మరిచిపోతారన్న భయంతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ లో ఉంటూ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి విమర్శలు చేస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. జూపల్లి రాజకీయ వేధింపులు, అక్రమదందాలను బయటపెడ్తానన్నారు బీరం. 

అప్పు చేశాను కానీ తప్పు చేయలేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎమ్మెల్యే బీరం అరెస్ట్ అయిన కొద్దిసేపటికే ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాంకుల్లో తీసుకున్న అన్ని అప్పులు క్లియర్ చేశానని చెప్పారు. నియోజకవర్గం ప్రజలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరోపణలు నిరూపించమంటే పారిపోయాడన్నారు జూపల్లి. మధ్యాహ్నం వరకు వేచి చూసినా ఎమ్మెల్యే రాలేదని చెప్పారు. 

ఇంకోసారి చేత కాని చర్చలు పెట్టొద్దని, దమ్ముంటే చర్చకు రావాలని జూపల్లికి సవాల్ చేశారు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. గతంలో కొల్లాపూర్ ప్రాంతంలో జరిగిన అవినీతి అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టు తీర్పులను జూపల్లి అపహాస్యం చేస్తున్నారన్నారు. ప్రజల భూములు తాకట్టుపెట్టి 60 కోట్ల అప్పు తీసుకున్న ఘనత జూపల్లిదని విమర్శించారు. కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు హర్షవర్ధన్ రెడ్డి.
 
అయితే కొల్లాపూర్ టీఆర్ఎస్ వర్గాల్లో విభేదాలు తొలగించడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రయత్నించారు. ఈ మధ్యే జూపల్లి కృష్ణారావుతో మాట్లాడారు. దీంతో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య సయోధ్య కుదురుతుందని పార్టీ కార్యకర్తలు ఆశించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇద్దరు నేతలతో పాటు వారి అనుచరుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.