
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో సాయి రాజేష్ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఎస్‌కేఎన్ నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ శనివారం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఆనంద్ మాట్లాడుతూ ‘చిన్న సినిమాల్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమాగా ‘బేబీ’ నిలిచిందని విన్నాను.
ఇంత మంచి విజయాన్ని అందించిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్. సంథ్య థియేటర్‌లో రియాక్షన్ ఎలా ఉంటుందా? అని చూశాను. ప్రతీ సీన్‌కు వేరే లెవెల్‌లో రియాక్షన్స్ ఇచ్చారు. ‘బేబీ’ అనేది రియాల్టీ అండ్ బోల్డ్ కంటెంట్. ఇలాంటివి ఎంతో మంది జీవితాల్లో జరిగి ఉంటాయి. ఈ కథ, పాత్ర విన్నప్పుడు నాకు భయం వేయలేదు. ఎక్సయిటింగ్‌గా అనిపించింది’ అని చెప్పాడు. ఈ విజయాన్ని చూస్తే ఎంతో ఆనందంగా, సంతృప్తిగా ఉందన్నాడు విరాజ్ అశ్విన్. ఈ సినిమా తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పింది వైష్ణవి చైతన్య.
‘ప్రేమ వల్ల వచ్చే సంతోషం కన్నా బాధే చాలా ప్రభావం చూపిస్తుందని నమ్ముతాను. అందుకే ఇలాంటి స్ర్కిప్ట్ రాశాను. ప్రేక్షకులు ప్రతీ సీన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు’ అని చెప్పాడు సాయి రాజేష్. ఎస్‌కేఎన్ మాట్లాడుతూ ‘ఆడియెన్స్ ఇందులో లెంగ్త్‌ను చూడలేదు.. స్ట్రెంత్‌ను చూశారు. ‘బేబీ’ నిర్మాతగా గర్వపడుతున్నా. సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ స్పెషల్ థ్యాంక్స్’ అని చెప్పాడు. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్, కెమెరామెన్ బాల్ రెడ్డి, కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని పాల్గొన్నారు.