
హౌతీ : టర్కీ నుంచి మన దేశానికి బయల్దేరిన కార్గో షిప్‌ను ఎర్ర సముద్రంలో యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు ఆదివారం హైజాక్ చేశారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ట్వీట్ చేసింది. అయితే, తాము ఇజ్రాయెలీ కార్గో షిప్‌ను యెమెన్ తీరానికి తరలించామంటూ హౌతీ ప్రతినిధులు తెలిపినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ఇజ్రాయెల్ ఖండించింది. ఆ నౌక తమ దేశానికి చెందినది కాదని, అందులో వివిధ దేశాలకు చెందిన 25 మంది నావికులు ఉన్నారని, ఇజ్రాయిలీలు మాత్రం లేరని డిఫెన్స్ ఫోర్స్ స్పష్టం చేసింది.
‘‘గెలాక్సీ లీడర్‌గా పిలిచే ఈ నౌకను సౌత్ రెడ్ సీలో యెమెన్ దగ్గరలో హైజాక్ చేశారు. ఇది ఘోరమైన పరిణామం. ఇంటర్నేషనల్‌లో వాణిజ్యానికి తీవ్ర నష్టం కలిగించే విషయమిది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం”అని ట్వీట్లో పేర్కొంది. గేలాక్సీ లీడర్‌ను ఇరాన్ సాయంతోనే హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ట్విట్టర్లో మండిపడింది.
కాగా, ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ మిలిటెంట్లు హమాస్ టెర్రరిస్టులకు సపోర్టు చేస్తున్నారు. హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ఆపేదాకా తాము ఇజ్రాయెల్‌కు చెందిన నౌకల్ని టార్గెట్ చేస్తామని ఇదివరకే హౌతీలు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇండియాకు వస్తున్న కార్గో షిప్‌ను హైజాక్ చేశారు.