మరో 9 మంది ఎమ్మెల్యేలు టచ్​లో ఉన్నరు: రెబెల్ ఎమ్మెల్యే రాజిందర్ రానా

మరో 9 మంది ఎమ్మెల్యేలు టచ్​లో ఉన్నరు: రెబెల్ ఎమ్మెల్యే రాజిందర్ రానా

సిమ్లా/చండీగఢ్: హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రాజిందర్ రానా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 9 మంది పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారని ఆయన చెప్పారు. శనివారం పీటీఐతో రానా మాట్లాడారు. సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పనితీరు పార్టీలో ఎవరికీ నచ్చడం లేదని అన్నారు. ‘‘సుఖు దోస్తులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ఆయన అవమానిస్తున్నారు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదు. ఇట్లయితే ఇచ్చిన హామీల అమలు ఎట్ల సాధ్యమవుతుంది” అని ప్రశ్నించారు. ‘‘మాతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా క్రాస్ ఓటింగ్ చేశారు. 

మరో 9 మంది పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్​లో ఉన్నారు” అని పేర్కొన్నారు. ‘‘సీఎం సుఖు అన్ని అబద్ధాలు చెబుతున్నారు. మేం తిరిగి వస్తామని విక్రమాదిత్య సింగ్​తో చెప్పలేదు. విక్రమాదిత్య ఢిల్లీకి వెళ్తూ, దారిలో మమ్మల్ని కలిశారు. సుఖునే సీఎంగా కొనసాగుతారని పార్టీ అబ్జర్వర్లు మాతో చెప్పారు. కాబట్టి మేం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు. ‘‘సీఎం సుఖుకు మెజార్టీ లేదు. ఆయనకు నిజంగా మెజార్టీ ఉంటే, కొందరు ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఎందుకు పెంచారు? ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. కాగా, రాజ్యసభ అభ్యర్థిగా స్థానికేతరుడిని నిలబెట్టడంతోనే క్రాస్ ఓటింగ్ చేశామని రానా తెలిపారు.  స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని రెబెల్ ఎమ్మెల్యేలు తెలిపారు.