
- ప్రమాద సమయంలో బస్సులో 30 నుంచి 35 మంది
- పైకప్పు ధ్వంసం.. బస్సును కప్పేసిన మట్టి, రాళ్లు
- ముగ్గురి రెస్క్యూ.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
బిలాస్పూర్: హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోరం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సుపై అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో 18 మంది మృతి చెందారు. సోమవారం నుంచి ఏకధాటిగా కురిసిన భారీ వర్షం కారణంగా దాదాపుగా పెద్ద కొండ అంతా విరిగిపడటంతో భారీగా మట్టి, రాళ్లు వచ్చి బస్సుపై పడ్డాయి. దీంతో బస్సు పై సగ భాగం పూర్తిగా విరిగిపోగా.. మిగతా బస్సు మొత్తాన్ని కూడా మట్టి, రాళ్లు కప్పేశాయి. హర్యానాలోని రోహ్తక్ నుంచి బిలాస్ పూర్ సమీపంలోని ఘుమార్విన్ కు వెళ్తుండగా.. భాలుఘాట్ వద్ద మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీంలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రమాద సమయంలో ఈ బస్సులో 30 నుంచి 35 మంది ప్రయాణిస్తున్నారని బిలాస్ పూర్ డిప్యూటీ కమిషనర్ రాహుల్ కుమార్ వెల్లడించారు.
పోలీస్, ఫైర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలు జేసీబీ సాయంతో మట్టి, రాళ్లను తొలగిస్తూ, ప్రయాణికులను వెలుపలికి తీసుకొస్తున్నాయని.. ఇప్పటివరకూ ముగ్గురిని ప్రాణాలతో కాపాడగలిగారని తెలిపారు. అయితే, బస్సు మొత్తాన్ని మట్టి కప్పేయడంతో మిగతావారిలో ఎంత మంది ప్రాణాలతో ఉన్నారన్నది చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. మరోతాన్ నుంచి కలోల్ కు వెళ్తున్న బస్సు ఓ కొండ పక్కనున్న రోడ్డు గుండా ప్రయాణిస్తుండగా, అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయన్నారు.
సీఎం సుఖూ దిగ్భ్రాంతి
బిలాస్పూర్లో బస్సు ప్రమాదంపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించానని ఆయన ట్వీట్ చేశారు. సహాయక చర్యలను నిరంతరం మానిటర్ చేస్తూ, సమాచారం తెలుసుకుంటున్నానని వెల్లడించారు. కాగా, కులూలో ఉన్న డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి హుటాహుటిన బిలాస్ పూర్కు వెళ్లారని అధికారులు చెప్పారు.
రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని
బస్సుపై కొండచరియలు విరిగిపడి 18 మంది మృతిచెందడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించినవారికి సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని ఈ మేరకు పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. గాయపడినవారికి రూ. 50 వేల చొప్పున అందజేయనున్నట్టు తెలిపింది.