
వాషింగ్టన్ వీధులు డిసెంబర్ 16 రామ నామముతో హోరెత్తాయి. ఆంగ్లో ఇండియన్స్ హిందూ జండాలను పట్టుకొని ర్యాలీ చేశారు. వచ్చేఏడాది జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభం కానుంది. అత్యద్భుతంగా కళాఖండగా తీర్చిదిద్దిన ఆలయంలో రాములవారికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మేరీలాండ్‌లో ఉన్న భక్త ఆంజనేయ ఆలయం వద్ద అమెరికన్ హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో పదేండ్ల చిన్నారుల నుంచి 70 ఏండ్ల వయస్సున్న పెద్దల వరకు పెద్దసంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. అయోధ్య వేగా నామకరణం చేసిన రోడ్డులో చేతుల్లో కాషాయ జెండాలు పట్టుకుని కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు.
రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ తీశామని అమెరికా డీసీ చాప్టర్ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు మహేంద్ర సాపా అన్నారు. రామ మందిర నిర్మాణం కోసం 500 ఏండ్లుగా పోరాడుతున్న హిందువుల కల త్వరలో నెరవేరబోతున్నది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్ డీలో జనవరి 20న తాము కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రామ్ లీలా, శ్రీరాముని చరిత్ర, రామ భజనల వంటివి ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి అమెరికన్ హిందూ కుటుంబాలు పాల్గొంటున్నాయని తెలిపారు. చిన్నారులతో 45 నిమిషాలపాటు శ్రీరాముని జీవిత చరిత్రను చెప్పించబోతున్నామని వెల్లడించారు.