సోమవారం ఢిల్లీలో మాయమై.. మంగళవారం రాంచీలో ప్రత్యక్షమైన సీఎం

సోమవారం ఢిల్లీలో మాయమై.. మంగళవారం రాంచీలో ప్రత్యక్షమైన సీఎం
  • విమానం ఢిల్లీలోనే వదిలేసి.. రోడ్డుమార్గంలో ప్రయాణం
  • ఢిల్లీలోని సోరెన్ ఇంట్లో రూ. 36 లక్షలు, రెండు బీఎండబ్ల్యూ కార్లు సీజ్ చేసిన ఈడీ  
  • రాంచీలోని సీఎం ఇల్లు, రాజ్ భవన్ వద్ద 144 సెక్షన్
  • సోరెన్ భార్యకు సీఎం పగ్గాలు అప్పగిస్తారంటూ ప్రచారం

న్యూఢిల్లీ/రాంచీ: జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచీకి చేరుకున్నారు. ఢిల్లీలో అదృశ్యమై.. సుమారు 30 గంటల పాటు ఆచూకీ లేని ఆయన.. మంగళవారం రాంచీలో ప్రత్యక్షమయ్యారు. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ఆయన విమానాన్ని ఢిల్లీలోనే వదిలేసి రోడ్డు మార్గంలో సీక్రెట్ గా ప్రయాణించారంటూ బీజేపీ ఆరోపించింది. భూకుంభకోణం కేసులో సోరెన్ ను విచారించేందుకు సోమవారం ఢిల్లీలోని ఆయన నివాసానికి ఈడీ అధికారులు వెళ్లడం, అక్కడ ఆయన అందుబాటులో లేకపోవడం,  సోరెన్ కనిపించడం లేదంటూ బీజేపీ ప్రచారం చేయడంతో రాజకీయంగా అలజడి మొదలైంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం సోరెన్ రాంచీలోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో సోరెన్ భార్య కల్పన కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కల్పనను ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కల్పనను సీఎం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపించారు. ‘‘జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలను లగేజీతో సహా రావాలని హేమంత్ సోరెన్ ఆదేశించారు. కల్పనను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించే అవకాశం ఉందని తెలిసింది” అని ఆయన ట్వీట్ చేశారు.

27న ఢిల్లీ వెళ్లిన సోరెన్..

భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 27న సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న గానీ, 31న గానీ అందుబాటులో ఉండాలని.. దీనిపై స్పందన తెలియజేయాలని కోరింది. అయితే 27వ తేదీ నుంచే సోరెన్ రాంచీలో అందుబాటులో లేరు. ఆయన ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు సోమవారం అక్కడికి వెళ్లగా, సోరెన్ వాళ్లను కలవలేదు. సోరెన్ ఇంట్లో లేరని సిబ్బంది తెలిపారు. దాదాపు 13 గంటల పాటు ఈడీ అధికారులు వేచిచూసినా సోరెన్ అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో అక్కడ సోదాలు చేపట్టిన ఈడీ ఆఫీసర్లు.. రూ.36 లక్షల క్యాష్, రెండు బీఎండబ్ల్యూ కార్లు, కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ నెల 31న విచారణకు అందుబాటులో ఉంటానని ఈడీకి సోరెన్ మెయిల్ పంపారు. దీంతో ఆయనను విచారించేందుకు ఈడీ ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాంచీలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు వస్తామని ఈడీ అధికారులు సమాచారమిచ్చారు.

సీఎం స్పందన కోసం చూస్తున్న: గవర్నర్

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అలర్ట్ అయ్యారు. సెక్యూరిటీపై సీఎస్, డీజీపీ, ఇతర ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ సూచన మేరకు ముఖ్యమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించామని అధికారులు తెలిపారు. సీఎం నివాసం, రాజ్ భవన్, ఈడీ ఆఫీస్ వద్ద 144 సెక్షన్ విధించామని చెప్పారు. కాగా, తాజా పరిణామాలపై సీఎం సోరెన్ స్పందన కోసం అందరిలాగే తానూ ఎదురుచూస్తున్నానని గవర్నర్ తెలిపారు. బాపూ వాటిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చట్టానికి ఎవరూ అతీతులు కాదు. మనమంతా రాజ్యాంగానికి లోబడి పని చేయాలి. రాజకీయ విభేదాలతో నాకు సంబంధం లేదు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూస్తాను” అని పేర్కొన్నారు.