Deepika Padukone: దీపికా పడుకోణెకు అరుదైన గౌరవం.. తొలి 'మానసిక ఆరోగ్య రాయబారి'గా నియామకం!

 Deepika Padukone: దీపికా పడుకోణెకు అరుదైన గౌరవం.. తొలి 'మానసిక ఆరోగ్య రాయబారి'గా నియామకం!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్  దీపికా పడుకోణెకు మరో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  ఆమెను దేశంలోనే మొట్టమొదటి 'మానసిక ఆరోగ్య రాయబారి' (Mental Health Ambassador) గా నియమించింది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ కీలక ప్రకటన చేసింది. ఈ నియామకం ద్వారా దేశంలో మానసిక ఆరోగ్యం పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు తోడ్పడుతుందని  ప్రభుత్వం భావిస్తోంది.

మానసిక ఆరోగ్యం ఇక ప్రజా ఆరోగ్యం..

 ది లైవ్ లవ్ లాఫ్ (LLL) ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా ఉన్న దీపికా పడుకోణె  మధ్యప్రదేశ్ లోని ఛింద్వారా జిల్లాలో తన టీమ్ తో కలిసి పర్యటించారు. ఈసందర్భంగా మానసిక ఆరోగ్యం ప్రాధాన్యతను వివరిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. ప్రజల్లో నెలకొన్న మానసిక ఆందోళనను తొలగించేలా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ భావిస్తోంది.  అటు దీపికా పడుకోణెతో మా భాగస్వామ్యం, దేశంలో మానసిక ఆరోగ్య సమస్యలపై మరింత అవగాహనను పెంచేందుకు తోడ్పడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జే.పీ. నడ్డా ఆశాభావం వ్యక్తం చేశారు.,  మానసిక ఆరోగ్యాన్ని ప్రజా ఆరోగ్యంలోని ఒక అంతర్భాగంగా నొక్కి చెప్పడానికి సహాయపడుతుంది అని తెలిపారు.

ఒక దశాబ్దపు కృషికి గుర్తింపు

తాను స్థాపించిన ది లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్‌కు 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దీపికా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. తన వ్యక్తిగత డిప్రెషన్ పోరాటం పట్ల మొదట్లో నెలకొన్న సందేహాల మధ్య కూడా తన ఫౌండేషన్ నిరంతరం అవగాహన కల్పిస్తూ..  మార్పును తీసుకువచ్చేందుకు కృషి చేసిందని ఆమె పేర్కొన్నారు. తనకు  దక్కిన ఈ గౌరవంపై దీపికా కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తొలి మానసిక ఆరోగ్య రాయబారిగా సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో, భారతదేశం మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంలో అపారమైన పురోగతి సాధించింది. ఈ  ఒరవడిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి , మన దేశ మానసిక ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని తెలిపారు...

►ALSO READ | ఓ వైపు లోయ, మరోవైపు ఎండిన కొమ్మపై కాలు: ప్రాణాలు లెక్కచేయకుండా రిస్కీస్టెప్స్ వేస్తున్న చరణ్.. వీడియో వైరల్

'టెలి మానస్' ప్రచార సారథి.. 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తొలి మానసిక ఆరోగ్య రాయబారిగా  దీపికా పడుకోణె  ప్రజలలో అవగాహన పెంచడం, ఆందోళన తగ్గించడం , సహాయ సహకారాలు వంటి పనులను పర్యవేక్షిస్తారు. 'టెలి మానస్' (టెలి-మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్‌వర్కింగ్ అక్రాస్ స్టేట్స్) వంటి అత్యవసర సేవలను, ఇతర ప్రభుత్వ-ఆమోదిత మానసిక ఆరోగ్య వనరులను ఆమె ప్రచారం చేస్తారు. టెలి-మానస్ యాప్ ఇప్పుడు 10 ప్రాంతీయ భాషలతో అందుబాటులోకి వచ్చింది. దీపికా ప్రచారంతో ఈ సేవ మరింత మందికి చేరుతుందని భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు.

 గత దశాబ్ద కాలంగా దీపికా పదుకొణే తమ ఫౌండేషన్ ద్వారా ఎనిమిది రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లో తమ గ్రామీణ కమ్యూనిటీ మానసిక ఆరోగ్య కార్యక్రమం ద్వారా సేవలు అందిస్తున్నారు. ఇప్పుటివరకు  సుమారు 21,900 మందికి పైగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు , వారి సంరక్షకులకు సహాయం అందించింది.  వినూత్న కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా ఆమె మానసిక ఆరోగ్య సంరక్షణను సమాజంలో ఒక ముఖ్యమైన చర్చగా మార్చడంలో కీలకపాత్ర వహించారు.