చరిత్ర సృష్టించిన జింబాబ్వే

చరిత్ర సృష్టించిన జింబాబ్వే

క్రికెట్ మ్యాచ్ లో ఎప్పుడు ఏ టీమ్ గెలుస్తుందో చెప్పలేం. లాస్ట్ బాల్ వరకు థ్రిల్లింగ్ విక్టరీలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. అలాంటి విక్టరీనే అందుకుంది జింబాబ్వే. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లో రికార్డు ఛేజింగ్ తో విక్టరీ కొట్టగా.. ఇవాళ ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై జింబాబ్వే చరిత్ర సృష్టించింది.  ఆస్ట్రేలియా గడ్డ మీద ఆ దేశంపై జింబాబ్వేకు ఏ ఫార్మాట్లోనైనా ఇదే తొలి విజయం కావడం విశేషం. జింబాబ్వే జట్టును గాయాలు వేధిస్తుండగా.. పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగిన బలమైన ఆసీస్‌ను ఆఫ్రికన్ జట్టు ఓడించడం గమనార్హం. చివరి వన్డేలో జింబాబ్వే గెలిచినప్పటికీ.. ఇంతకు ముందు రెండు వన్డేల్లోనూ గెలుపొందిన ఆస్ట్రేలియా సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది.

టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను వణికించింది. ర్యాన్ బర్ల్ కేవలం 3 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్ 31 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్ తడివనషే మరుమని 47 బాల్స్ లో 35 రన్స్ చేసి జింబాబ్వేకు శుభారంభాన్ని అందించాడు. కానీ స్వల్ప వ్యవధిలోనే పర్యాటక జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే విజయం సాధించడం కష్టమే అనిపించింది.  రెజిస్ చకబవ (72 బంతుల్లో 37 నాటౌట్) చివరి వరకూ క్రీజ్‌లో నిలవడంతో జింబాబ్వే గెలుపొందింది.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. ఆసీస్ చేసిన 141 పరుగుల్లో వార్నర్ చేసినవే 94 రన్స్ కావడం గమనార్హం. వార్నర్ కాకుండా గ్లేన్ మ్యాక్స్‌వెల్ (19) మాత్రమే రెండంకెల స్కోరు నమోదు చేశాడు.