వెలుగు సక్సెస్ .. జైన తీర్థంకరులు

వెలుగు సక్సెస్ ..    జైన తీర్థంకరులు

తీర్థంకర అనే పదానికి అర్థం వారధిని నిర్మించినవాడు లేదా మార్గం చూపువాడు. జైన సాహిత్యం ప్రకారం మొత్తం 24 మంది తీర్థంకరులూ క్షత్రియ కులానికి చెందినవారు. మొదటి 22 మంది తీర్థంకురుల గురించి చారిత్రక ఆధారాలు లేవు. 23వ, 24వ తీర్థంకరుల గురించి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రుగ్వేద మంత్రాల్లో రుషభనాథుడు, అరిస్టనేమి (నేమినాథుడు)లను ప్రస్తావించారు. కాగా, విష్ణు, భాగవత పురాణాల్లో నారాయణుని అవతారంగా రుషభనాథుణ్ని ప్రస్తావించారు. అరిష్టనేమిని కృష్ణునికి బంధువుగా భావించారు. ఒక జైనుడు తీర్థంకరుడు కావాలంటే సాధు (పరిపూర్ణ సన్యాసి), ఉపాధ్యాయ (టీచర్​ స్థాయి), ఆచార్య (ప్రొఫెసర్​ స్థాయి), అరిహంత్​ (నిర్యాణం పొందబోయేవాడు) అనే నాలుగు దశలు దాటాలి.

రుషనాథుడు : జైన సాహిత్యం ప్రకారం రుషభనాథుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు 1. గోమటేశ్వర/ బాహుబలి. ఈయన విగ్రహం శ్రావణబెళగొలలో ఉంది. 2. భరతుడు. ఇతని పేరు మీదనే భారతదేశానికి ఆ పేరు వచ్చిందని జైన సాహిత్యం పేర్కొంటుంది. రుషభనాథుని కుమార్తె పేరు బ్రహ్మి. జైన సాహిత్యం ప్రకారం బ్రహ్మిలిపిని ఈమెనే కనుగొన్నది. రుషభనాథుడు, గోమటేశ్వర్లు అస్మక రాజ్యాన్ని(బోధన్​ను) పాలించారు అని జైన సాహిత్యం పేర్కొంటుంది. ఇతను కైలాస శిఖరం వద్ద నిర్మాణం చెందినట్లు తెలుస్తున్నది.

వర్థమాన మహావీరుడు : ఈయనకు సమకాలినుడైన బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. కాగా, మగధ రాజులు బింబిసారుడు, అజాత శత్రువు. ఈయన 30 సంవత్సరాల వయస్సులో తల్లిదండ్రులు మరణించారు. తల్లిదండ్రుల మరణానంతరం వర్ధమాన మహావీరుడు సన్యాసం స్వీకరించి 12 సంవత్సరాలు సంచార జీవితం గడిపాడు. సత్యాన్ని కనుగొనాలని ప్రయత్నించిన వర్ధమానుడికి అతని సోదరుడైన నందివర్ధనుడు సన్యసించడానికి అనుమతిచ్చాడు. వర్ధమానుడు జృంభిక గ్రామంలో సాల్​ వృక్షం కింద రిజుపాలిక నదీ ఒడ్డున తపస్సు చేసి జ్ఞానోదయం పొందాడు. 

జైన మతం ప్రకారం తపస్సు అంటే కఠిన ఉపవాసం, నగ్నత, శీతవాతాలకు తట్టుకోవడం ఇతను పార్శ్వనాథుడు పెట్టిన నిగ్రంథమ శాఖలోకి వెళ్లి తన 42వ సంవత్సరంలో తీర్థంకురుడు అయ్యాడు. మహావీరుని మొదటి శిష్యుడు జామాలి (కూతురి భర్త) కాగా, అతి ముఖ్య అనుచరులుగా శంభువిజయుడు, భద్రబాహు కొనసాగారు. మహావీరుడి తర్వాత అతని అనుచరులు జైనమత అధిపతులుగా మారారు. వీరిని గణాధారులు అని పేర్కొన్నారు. 

మొత్తం 11 మంది గణాధారులు లేదా ధర్మదూతలు ఉన్నారు. మహావీరుడు 14 పూర్వాలను (పాత పాఠాలు) సుధర్మునికి బోధించాడు. ఈ 14 పూర్వాలను సంభూతవిజయ్​, భద్రబాహులు లిఖితపూర్వం చేశారు. 
జైన మతంలో 2 రకాల మత అనుచరులు ఉన్నారు

1. మహావ్రతాలు : మహావీరుడి ఐదు సూత్రాలను అత్యంత కఠినంగా పాటించేవారు. మహావ్రతాలు, జైన సన్యాసులు కలిసి ఒక సంఘం ఏర్పరుచకున్నారు. దీన్నే గచ్ఛ అంటారు. ఈ గచ్ఛలోని సభ్యులను ఉపాసకులు అంటారు.

2. అనువ్రతాలు : మహావీరుడి ఐదు సూత్రాలను అంత కఠినంగా పాటించరు. కుటుంబం కలిగిన వారు, మిత్రులు, సాధారణ ప్రజలు అనువ్రతాలు పాటిస్తారు. 

పార్శ్వనాథుడు : జాకొబి అనే పండితుడి అభిప్రాయం ప్రకారం జైనమత స్థాపకుడు పార్శ్వనాథుడు. చారిత్రకంగా ఇతనే జైనమత స్థాపకుడు. ఇతను ఇక్ష్వాకుని వంశానికి చెందినవాడు. ఇతని తండ్రి అశ్వసేన (కాశీ లేదా వారణాసి రాజ్యం), కాగా తల్లిరాణివామదేవి. శతాయువుగా(100 సంవత్సరాలు) జీవించిన తీర్థంకరుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇతని శిష్యులు పార్శ్వనాథుడిని పురుషదనియ అనే బిరుదుతో సత్కరించారు. పురుషదనియ అంటే ప్రజల చేత ప్రేమించబడేవాడు అని అర్థం. ఈయన తీర్థంకర దశకు వచ్చి నిగ్రంథులు అనే మతాన్ని తెచ్చాడు. నిగ్రంథులు అంటే ప్రాపంచిక సుఖాలను త్యజించేవాడు. జైనులు వాసుదేవున్ని పార్శ్వనాథునికి దగ్గరి బంధువుగా భావించేవారు. మహావీరుడి కంటే ముందు జైనులను నిగ్రంథులుగా పేర్కొనేవారు. తర్వాత వీరిని జైనులు అని పేర్కొంటున్నారు. అశోకుడు శాసనాల్లో జైనులను నిగ్రంథులు అని పేర్కొన్నారు. హుయాన్​త్సాంగ్​ కూడా జైనులను నిగ్రంథులు అని పేర్కొన్నాడు. 

నిగ్రంథ సూత్రాలు

1. అహింస – హింసని విడనాడటం
2. సత్య – అసత్యం పలకరాదు
3. అస్తేయ – దొంగతనం చేయరాదు
4. అపరిగ్రహ – ఆస్తిని కలిగి ఉండకూడదు

వర్ధమాన మహావీరుడు

జన్మస్థలం : కుంద లేదా బసుకుంద గ్రామం (వైశాలి దగ్గర)
బిరుదులు : కేవలి (అత్యున్నతమైన జ్ఞాని), న్యాయపుత్ర, కేశవ, వెసాలియ, జిన (ఇంద్రియాలను జయించినవాడు, విజేత), జితేంద్ర,
అరిహంత్​ (మోక్షం సాధించినవాడు), దేహదిన్న (దేహాన్ని జయించినవాడు), సన్యాసుల్లో సింహం వంటివాడు .

  •     జైన మతం విపరీతమైన అహింసను బోధించింది. 
  •     క్రిమికీటకాలను చంపకూడదు.
  •     వ్యవసాయం చేయకూడదు.
  •     చెప్పులు వేసుకోకూడదు.
  •     సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయకూడదు.

జైన మత సిద్ధాంతాలు

1. పంచ సూత్రాలు/ వ్రతాలు

1. అహింస 2. సత్యం    3. ఆస్తేయ 4. అపరిగ్రహ 5. బ్రహ్మచర్యం (పైనాలుగింటికి బ్రహ్మచర్యాన్ని కలిపింది వర్ధమాన మహావీరుడు)

2. త్రిరత్నములు

 సమ్యక్​ క్రియ –  సరైన పని
సమ్యక్​ జ్ఞాన – సరైన జ్ఞానం
సమ్యక్​ విశ్వాస్​ – సరైన నమ్మకం

3. జైనతత్వం

స్యాద్వాదం లేదా ఇతిమిద్దంగా ఏ విషయాన్ని తేల్చి చెప్పకూడదు
అనేకాంతరవాదం: జ్ఞానాన్ని సమగ్రంగా గ్రహించాలి. ఈ తత్వం సాంఖ్యావాదానికి దగ్గరగా వస్తుంది.