
- ప్రతిపాదిత అలైన్‌మెంట్ కోసం ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిన హెచ్ఎండీఏ
- అభ్యంతరాలకు ఈ నెల 15 వరకు గడువు
హైదరాబాద్, వెలుగు: రీజనల్ రింగ్ రోడ్ (నార్త్ పార్ట్) 100 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదిత అలైన్‌మెంట్ కోసం హెచ్ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. హెచ్ఎండీఏ పరిధిలో ఎనిమిది జిల్లాలు (రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్), 33 మండలాలు, 163 రెవెన్యూ గ్రామ పంచాయతీలను కవర్ చేస్తుందని నోటిఫికేషన్ లో పేర్కొంది.
ఈ అలైన్‌మెంట్‌కు సంబంధించిన డిజిటల్ మ్యాప్‌లు, సర్వే నంబర్‌లు హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ అలైన్ మెంట్ పై ప్రజలు, సంస్థలు తమ అభ్యంతరాలు, సూచనలను సెప్టెంబర్ 15 లోపు హెచ్ఎండీఏ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా సమర్పించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన తర్వాత హెచ్ఎండీఏ తుది నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది.
కేంద్రం వద్ద ప్రాజెక్టు పెండింగ్
రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ కు గతేడాది డిసెంబర్ లో ఎన్ హెచ్ఏఐ టెండర్లు పిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకు గడువు విధించారు. అయితే కేంద్రం ఈ ప్రాజెక్టును ఆమోదించకపోవటంతో ఇప్పటి వరకు టెండర్లను ఓపెన్ చేయలేదు. ఉత్తర భాగం రూ.7104.06 కోట్లతో మొత్తం 161.518 కిలోమీటర్లలో నాలుగు లైన్లలో నిర్మించాల్సి ఉండగా తరువాత ఆరు లైన్లకు విస్తరించనున్నారు. నార్త్ పార్ట్ సంగారెడ్డిలోని గిర్మాపూర్ గ్రామం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని తంగడపల్లి వరకు నిర్మించనున్నారు. ఉత్తర భాగం నిర్మాణం ఐదు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు.