1000 ఎకరాల్లో హెచ్ఎండీఏ లే అవుట్స్

1000 ఎకరాల్లో హెచ్ఎండీఏ లే అవుట్స్
  •   పెద్ద మొత్తంలో భూములు  సేకరించాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ సిటీ పరిధిలో హెచ్ఎండీఏ భారీ లే అవుట్స్​ ప్లాన్ ​చేస్తోంది. పెద్ద మొత్తంలో ల్యాండ్​పూలింగ్​కు సన్నాహాలు ప్రారంభించింది. ప్రత్యేకించి మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని, ప్లాట్లను విక్రయించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూములన్న రైతులతో మట్లాడుతున్నారు. ఇప్పటివరకు అధికారులు గుర్తించిన భూముల్లో అధిక శాతం సాగులో లేని, అసైన్డ్​ భూములు ఎక్కువగా ఉన్నాయి.

 వారిని ఒప్పించి భూములను సేకరించాలని నిర్ణయించారు. 60 శాతం భూమిని డెవలప్​చేసి రైతులకు ఇచ్చి, మిగిలిన 40 శాతం భూములను హెచ్ఎండీఏ వేలం ద్వారా విక్రయించనుంది. బడ్జెట్​లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏకు రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఆయా ప్రాంతాల్లో సేకరించిన భూములను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు.

 నాలుగు నెలల కింద రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇనుముల్ నర్వ, మేడ్చల్​జిల్లా పరిధిలోని భోగారంతోపాటు, ప్రతాప సింగారం, లేమూరులో దాదాపు 500 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. తాజాగా ఓఆర్ఆర్, ట్రిపుల్​ఆర్​మధ్యన చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మల్కాపూర్​లో 325 ఎకరాలు, నాదర్​గుల్​లో 91 ఎకరాలు, ప్రతాపసింగారంలో 152 ఎకరాలు, భోగారంలో 125 ఎకరాలు కలిపి మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి పరిధిలో మొత్తం 1000 ఎకరాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా 150, 200, 250, 300 స్క్వేర్​యార్డు సైజుల్లో ప్లాట్లను వేసి వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు.