జోన్ల పెంపుపై హెచ్ఎండీఏ కసరత్తు

జోన్ల పెంపుపై హెచ్ఎండీఏ కసరత్తు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ పరిధిలో పుంజుకుంటున్న రియల్​ ఎస్టేట్ ను దృష్టిలో పెట్టుకుని హెచ్ఎండీఏ అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతున్న రియల్​జోరును సద్వినియోగం చేసుకుని ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోని జోన్ల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రపోజల్​ను ప్రభుత్వానికి అధికారులు పంపించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. 

తెరపైకి కొత్త జోన్లు..

హెచ్ఎండీఏ పరిధిలో పెరిగిన రియల్​ ఎస్టేట్​ జోరుతో భవిష్యత్​లో భారీగా దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటేనే సంస్థకు భారీగా ఆదాయం వస్తుందని అంటున్నారు. సాధారణంగా పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు 5 ఫ్లోర్ల వరకే  అనుమతులు ఇచ్చే అధికారం ఉంటుంది. జీహెచ్ఎంసీకి 10 అంతస్తుల వరకు పర్మిషన్​ ఇస్తోంది. 

అయితే హైరైస్​ భవనాల నిర్మాణాలకు హెచ్ఎండీఏ అనుమతులు తప్పని సరి. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో శంకర్​పల్లి, శంషాబాద్, ఘట్​కేసర్, మేడ్చల్​ జోన్లు ఉన్నాయి. ఆయా జోన్ల పరిధిలో నిర్మించే భారీ భవనాల నిర్మాణాలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. వీటిలో హైరైస్​భవనాలు, వెంచర్లు, లే అవుట్లు ఉన్నట్టు తెలిపారు. 

ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్ల స్థానంలో 8 జోన్లు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్ల పరిధిలో 20 నుంచి 25 మంది ప్లానింగ్​ ఆఫీసర్లు, అసిస్టెంట్​ ప్లానింగ్​ ఆఫీసర్లు ఉన్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న దరఖాస్తులను పరిశీలించడం, మంజూరు చేసే విషయంలో ఆలస్యం అవుతోంది. ప్రతి దరఖాస్తును పరిశీలించేప్పుడు అవసరమైతే ఫీల్డ్​ విజిట్​చేయాలి. దీంతో దరఖాస్తులు పరిశీలించి, పర్మిషన్లు ఇవ్వడంఆలస్యమవుతోంది. 

ఈ నేపథ్యంలో జోన్ల సంఖ్యను పెంచడం వల్ల అధికారులపై పని ఒత్తడి తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రతి జోన్​ పరిధిలో పారిశ్రామిక, నివాస, వ్యవసాయ, ఉత్పత్తి రంగాల అభివృద్ధికి మాస్టర్​ప్లాన్​లో భూ కేటాయింపులు జరుగుతాయి. వాటికి అనుగుణంగానే అక్కడ లే అవుట్లు, ఇతర నిర్మాణాలకు అనుమతులు ఇస్తుంటారు. కాబట్టి కొత్త జోన్లను ఏర్పాటు చేసి పెరుగుతున్న రియల్​ఎస్టేట్ అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దాలని అధికారులు భావిస్తున్నారు.

పరిధి ఎక్కువగా ఉండడంతో..

హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్​తో కలుపుకుని మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. 849 గ్రామాలు, 7,228 చ. కి.మీలో విస్తరించి వుంది. త్వరలో రీజినల్​ రింగ్​ రోడ్(ఆర్ఆర్ఆర్)ను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిని మరింత విస్తరించాలని నిర్ణయించింది. దీంతో మరో 75 చ.కి.మీ. పరిధి పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. 

భారీ భవనాలు, వివిధ వెంచర్లతో పాటు లేవుట్​లకు హెచ్ఎండీఏ అనుమతి తప్పని సరి. ప్రస్తుతం గ్రేటర్​ పరిధిలో రియల్​ఎస్టేట్​ భారీగా పుంజుకుంటున్న నేపథ్యంలో హెచ్ఎండీఏ పాత్ర కీలకం కానుంది. హెచ్ఎండీఏ పట్టణ ప్రణాళిక సంస్థ కావడంతో, రియల్​ ఎస్టేట్​రంగంలో వచ్చే మార్పులను కూడా నిశితంగా గమనిస్తూ మార్పులు చేసుకుంటూ ముందుకు పోతోంది.

 ఇటీవల భారీ నిర్మాణాల కోసం అనుమతులు కోరుతూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో ప్రతి రెండు నుంచి మూడు నెలలకోసారి జరిగే మల్టీస్టోరీడ్​ బిల్డింగ్​ కమిటీ సమావేశాన్ని కూడా ఇప్పుడు వారానికోసారి నిర్వహిస్తున్నారు. గత మూడేండ్లలో లక్షకు పైగానే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా, వెంచర్లు, లే అవుట్లకు కూడా భారీగా పర్మిషన్లు ఇచ్చినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.