మత్తెక్కించే వార్త: మరోసారి ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు

మత్తెక్కించే వార్త: మరోసారి ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు

మందుబాబులకు గుడ్‌న్యూస్. లాక్‌డౌన్, కర్ఫ్యూ, కరోనా కేసుల వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు మూతపడ్డాయి. దాంతో మందు ప్రియుల బాధలు అన్నీఇన్నీ కావు. అలాంటి వారికి ఛత్తీస్‌గర్ ప్రభుత్వం మత్తెక్కించే వార్త చెప్పింది. ఆన్‌లైన్ వేదికగా మద్యం సరఫరా చేస్తామని ప్రకటించింది.

ఛత్తీస్‌గర్‌‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో మద్యానికి బానిసై.. మద్యం దొరకకపోవడంతో ప్రత్యామ్నాయంగా హోమియోపతి సిరప్ తాగి తొమ్మిది మంది మరణించడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ వల్ల మద్యం షాపులన్నీ మూతపడ్డాయి. దాంతో ఇత‌ర రాష్ట్రాల నుంచి మ‌ద్యం అక్రమ సరఫరా చేస్తున్నారు. వీటన్నింటికి చెక్ పెట్టేందుకుగాను.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా చేయడం అక్కడి ప్రభుత్వానికి కొత్తేమీ కాదు. గ‌త ఏడాది లాక్‌డౌన్ స‌మ‌యంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం శనివారం రాత్రి జారీ చేసింది. దాని ప్రకారం మే 10 సోమవారం మద్యం ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది.

మద్యం హోం డెలివరీ కోసం పబ్లిక్ తమ ఫోన్‌లో CSMCL అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, చిరునామా వివరాలు పొందుపరిస్తే సరిపోతుంది. ఈ యాప్ ద్వారా ఒక వ్య‌క్తి ఐదు లీట‌ర్ల మ‌ద్యం మాత్ర‌మే కొనుగోలు చేయడానికి వీలుంటుంది. అయితే మ‌ద్యం హోం డెలివరీ చేసినందుకు గాను అద‌నంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద‌యం 9 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యాన్ని హోం డెలివ‌రీ చేస్తారు. స్థానిక క‌రోనా ప‌రిస్థితుల‌ను బట్టి డెలివ‌రీ స‌మ‌యాలు మారుతుంటాయి. వినియోగదారుడు తన ఇంటికి 15 కిలోమీట‌ర్ల ప‌రిధిలోపల మ‌ద్యాన్ని బుక్ చేసుకోవలసి ఉంటుంది. CSMCL నిర్ణయం ప్రకారం ఆ పరిధిలోని ఏదో షాపు మద్యాన్ని హోమ్ డెలివ‌రీ చేస్తుంది.