హోంగార్డు రవీందర్ మృతిపై హైకోర్టులో పిటిషన్

హోంగార్డు రవీందర్ మృతిపై హైకోర్టులో పిటిషన్

హోంగార్డు రవీందర్ మృతిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ.. హోమ్ గార్డు జేఏసీ పిటిషన్ దాఖలు చేసింది. రవీందర్ మృతికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని హోం గార్డ్ జేఏసీ ప్రధాన కార్యదర్శి పాకాల రాజశేఖర్ పిటిషన్ దాఖలు చేశారు. కానిస్టేబుల్ చందు, ఏఎస్ఐ నర్సింగరావు, కమాండెంట్ భాస్కర్ పై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో  కోరారు. 

సెప్టెంబర్ 5న ఒంటిపై పెట్రోల్ పోసుకుని రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే..ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో రవీందర్ ఆరోగ్యం విషమించింది. అపోలో డీఆర్ డీఓలో చికిత్స పొందుతూ రవీందర్ మృతిచెందాడు. సరైన సమయానికి జీతాలు ఇవ్వడం లేదంటూ రవీందర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 

ALSO READ :దళితబంధు కోసం రోడ్డెక్కిన దళితులు..భారీగా ట్రాఫిక్ జామ్

తన భర్త 17 ఏళ్లుగా నిబద్ధతతో విధులు నిర్వహించారని మృతిచెందిన హోంగార్డు రవీందర్‌ భార్య సంధ్య అన్నారు. రవీందర్‌పై ఏఎస్సై నర్సింగ్‌రావు, కానిస్టేబుల్‌ చందు పెట్రోల్‌ పోసి తగులబెట్టారని ఆరోపించారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. రవీందర్‌ ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి డేటా డిలీట్‌ చేశారని.. ఇప్పటి వరకూ వాళ్లిద్దరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదని సంధ్య నిలదీశారు. తన భర్తతో తాను మాట్లాడిన తర్వాతే చంపేశారని ఆరోపించారు. రవీందర్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

రవీందర్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. అతడిని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంధ్యతో పాటు కుటుంబ సభ్యులు ఉదయం 9 గంటల నుంచి ఉస్మానియా ఆస్పత్రి ఓపీ విభాగం వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రవీందర్‌ భార్య ఆందోళనకు మరికొందరు హోంగార్డులు మద్దతు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సంధ్యతో చర్చించారు. ఉస్మానియాలో అత్యవసర వైద్య సేవలకు వచ్చేవారికి ఇబ్బంది ఎదురవుతోందని.. ఆందోళన విరమించాలని సీఐ కోరినా ఆమె వెనక్కి తగ్గలేదు. రవీందర్‌పై పెట్రోల్‌ పోసి తగులబెట్టారని.. ఆ సీసీ ఫుటేజీ బయటపెట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు. 

హోంగార్డు మృతి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోంగార్డుల విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హోంగార్డులెవరూ రవీందర్ కుటుంబానికి మద్దతుగా వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. హోంగార్డులు డ్యూటీలో ఉండేలా చూసుకోవాలని సీఐలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీలో లేని హోంగార్డులు తప్పనిసరిగా పీఎస్‌లో ఉండాలని సూచించారు. ఎవరైనా విధులకు రాకపోతే వాళ్లను తొలగించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం.