
ఒకప్పుడు వేసవి సెలవుల్లో వచ్చాయంటే చాలు పిల్లలు వీధుల్లో తిరగడం, ఆటలు ఆడుకోవడం చేస్తుండే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోజురోజుకూ పిల్లలపై చదువుల భారం ఎక్కువైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది విద్యార్థులకు సెలవుల్లో కూడా టీచర్లు హోంవర్క్ ఇస్తున్నారు.
అయితే ఇలా హోంవర్క్ ఇవ్వడంపై వ్యతిరేకంగా ధర్నాకు కూర్చున్న వారిని మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు. రాజస్థాన్‌లోని ఝున్‌జునులో అలాంటి కేసే ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో హెడ్‌లైన్ గా మారిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గానూ మారింది. ప్రాంజల్ అనే బాలుడు సెలవుల్లో వచ్చిన హోంవర్క్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఓ ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నాడు.
ధర్నాలో కూర్చున్న విద్యార్థి
ప్రాంజల్‌కు స్కూల్ సెలవుల కోసం హోమ్‌వర్క్ ఇచ్చారని, అది అతనికి అస్సలు ఇష్టం లేదని స్థానికులు చెబుతున్నారు. 14 ఏళ్ల ఈ బాలుడు 9వ తరగతి చదువుతుండగా.. పిల్లలు ఆడుకోవడానికి సెలవులు ఉన్నాయని ప్రాంజల్ చెబుతున్నాడు. అందరికీ సెలవులు ఉంటాయి, కానీ పిల్లలకు సెలవుల్లో కూడా హోంవర్క్ ఉంటుంది, అంటే వారికి 365 రోజులు సెలవు లేదన్న మాట.. అంటూ ఆ బాలుడు దీనికి నిరసనగా కలెక్టరేట్ ఎదుట కుర్చీ వేసుకుని ధర్నాకు కూర్చున్నాడు.
కలెక్టరేట్ ముందు కుర్చీ-టేబుల్‌తో కూర్చున్న ఈ బాలుడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బాలుడు అక్కడే కూర్చుని హోంవర్క్ చేస్తుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తమాషా ఏంటంటే.. ఇందులో బాలుడి తల్లి కూడా సపోర్టుగా నిలుస్తోంది. ప్రతి ఆదివారం బాలుడు తన హోంవర్క్ చేయడానికి ఇక్కడికి వస్తున్నాడు.