చైనాకు ‘అప్పగింత’ ఆగింది

చైనాకు ‘అప్పగింత’ ఆగింది

హాంకాంగ్:నేరస్థులను చైనాకు అప్పగించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘నేరస్థుల అప్పగింత చట్టం(ఎక్స్ ట్రాడిషన్ లా)’ సవరణ బిల్లును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కారీ లామ్ ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చిన తీవ్ర నిరసనల కారణంగా బిల్లును నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు శనివారం మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో బిల్లుపై మరింత లోతుగా చర్చించేందుకు కొంత సమయం కావాలని, ప్రజల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. బిల్లు సస్పెన్షన్ కు ఎలాంటి డెడ్​లైన్ లేదని, దీనిపై లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామన్నారు. అంతకుముందు ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును ప్రవేశపెట్టి తీరుతామని కారీ లామ్ ప్రకటించారు. ఎక్కడెక్కడో నేరాలు చేసిన వాళ్లు హాంకాంగ్ లో తలదాచుకుంటున్నారని ఆరోపించారు. నిరసనల కంటే ముందు దేశ ప్రయోజనాలు ముఖ్యమని,  ఈ బిల్లు ప్రవేశపెట్టకపోతే దేశ భద్రతకే ముప్పు అని కరాఖండీగా చెప్పిన కారీ లామ్.. హాంకాంగ్ లో లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడంతో వెనక్కి తగ్గారు. తమ నిర్ణయంలో లోపాలను సవరించుకుంటామని, ప్రజలకు కలిగించిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. ‘కేంద్ర ప్రభుత్వం(బీజింగ్) ఎటువంటి సూచనలు ఇవ్వలేదు, సవరణ బిల్లు గురించి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు’ అని బ్రిటన్‌‌‌‌‌‌‌‌లోని చైనా రాయబారి జియామింగ్  చెప్పారు.

ఇదీ హాంకాంగ్ నేపథ్యం

150 ఏండ్ల పాటు బ్రిటన్ ఆధీనంలో ఉన్న హాంకాంగ్ 1997లో చైనా ఆధిపత్యం కిందకువచ్చింది. హాంకాంగ్ కు ప్రత్యేక ప్రతిపత్తి (బేసిక్ లా)ని 2047 వరకు కొనసాగిస్తామని బీజింగ్ హామీ ఇచ్చింది. అయితే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ హాంకాంగ్ వ్యవహారాల్లో చైనా మితిమీరిన
జోక్యం కొనసాగుతోంది. తాజాగా ఎక్స్ ట్రాడిషన్ లా చట్టానికి హాంకాంగ్ పాలకులు చేపట్టిన సవరణలు బిల్లుపై ప్రజల్లో నిరసనలు వెల్లువెత్తాయి.