హాంకాంగ్ స్వేచ్ఛ హాంఫట్​?

హాంకాంగ్ స్వేచ్ఛ హాంఫట్​?

వందేళ్లపాటు స్వేచ్ఛననుభవించిన జనాలు… కమ్యూనిస్టుల పాలనలోకి వెళ్లాలంటే పడే ఇబ్బందినే హాంకాంగ్‌‌‌‌ జనాలుకూడా పడుతున్నారు. లీజు ఒప్పందం ప్రకారం హాంకాంగ్‌‌‌‌ని బ్రిటన్‌‌‌‌ వదులుకుంది. ఈ దీవిని స్వాధీనం చేసుకున్నప్పుడు ‘ఒన్‌‌‌‌ కంట్రీ–టూ సిస్టమ్స్‌‌‌‌’ పాటిస్తామని ఇచ్చిన హామీని చైనా పక్కన పారెయ్యాలని చూస్తోంది.
ఫారిన్‌‌‌‌ అఫైర్స్‌‌‌‌, డిఫెన్స్‌‌‌‌ మినహా మిగతా వ్యవహారాలన్నీ హాంకాంగ్‌‌‌‌ స్వయంగా చూసుకోవాలన్న నియమానికి తూట్లు పొడుస్తోంది. 2047 వరకు బ్రిటన్‌‌‌‌ చట్టాలు అమలు చేయాలనే రూల్​ను సవరించబోతోంది. హాంకాంగ్‌‌‌‌లో నిందితులైనవాళ్లను మెయిన్‌‌‌‌లాండ్‌‌‌‌ చైనాలో విచారించేలా ‘ఎక్స్‌‌‌‌ట్రాడిషన్‌‌‌‌ యాక్ట్‌‌‌‌’ తీసుకురాబోతోంది.  దీనికి హాంకాంగ్‌‌‌‌ జనాలతోపాటు ఇంటర్నేషనల్‌‌‌‌గానూ ఆందోళన పెల్లుబుకుతోంది.

ఎప్పుడూ  ప్రశాంతంగా ఉండే హాంకాంగ్ లో అలజడి మొదలైంది. హాంకాంగ్‌‌‌‌లోని 74 లక్షల జనాభాలోనూ ఆందోళన పెరిగిపోతోంది.  పది లక్షల మంది వీధుల్లోకి వచ్చి గొంతెత్తారంటే వారి మనసులు ఎంతగా కలవరపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనికంతటికీ కారణం  ప్రభుత్వం తీసుకురాబోతున్న  ఓ బిల్లు. హాంకాంగ్ లో ఎవరిపైన అయినా నేరారోపణలు వస్తే  వారిపై విచారణ హాంకాంగ్ గడ్డపై కాకుండా చైనాలో జరిపించాలని కమ్యూనిస్టు సర్కార్ తీసుకురాబోతున్న బిల్లు.

మొన్న ఆదివారం నాడు  ఈ బిల్లుకు వ్యతిరేకంగా హాంకాంగ్‌‌‌‌లో ఊరూ వాడ ఏకమైంది. ప్రజలందరూ వీథుల్లోకి వచ్చి  ప్రదర్శనలు చేశారు. హాంకాంగ్‌‌‌‌లో మరోసారి హింస చెలరేగింది. బిల్లుకు వ్యతిరేకంగా నిరసనకారులు మళ్లీ బుధవారం ఉద్యమించారు. లెజిస్లేటివ్  కౌన్సిల్ ను ముట్టడించడానికి  నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులు టియర్ గ్యాస్  ప్రయోగించారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు ఒక దశలో పెప్పర్ స్ప్రే చేశారు. లాఠీచార్జ్ చేశారు.  అయినా జనం వెనక్కి తగ్గడం లేదు.
ఈ బిల్లు వస్తే  హాంకాంగ్ న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందన్నది బిల్లు వ్యతిరేకుల వాదన.  బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన  నిరసన ప్రదర్శనల్లో స్టూడెంట్లు, వ్యాపారులు, లాయర్లు, డాక్టర్లు, ప్రజా సంఘాల కార్యకర్తలతో పాటు అన్ని వర్గాలకు చెందిన వారు పాల్గొనడం విశేషం.

నేరస్తుల అప్పగింత బిల్లు ఏంటి ?

హాంకాంగ్‌‌‌‌లో బ్రిటన్‌‌‌‌ ఆధారిత న్యాయవ్యవస్థ అమలవుతుంది. తాజాగా దీని స్థానంలో చైనా తమ న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే నేరారోపణలు ఎదుర్కొనేవారంతా ఇకపై విచారణ కోసం మెయిన్‌‌‌‌లాండ్‌‌‌‌ చైనా కోర్టులకు వెళ్లాలని ప్రభుత్వం ఓ ముసాయిదా చట్టాన్ని రూపొందించింది.  పరిపాలనపరంగా హాంకాంగ్ ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉంది. అయినప్పటికీ ‘ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్’గా  హాంకాంగ్‌‌‌‌కి కొన్ని ప్రత్యేక హక్కులున్నాయి. సర్కార్ రూపొందించిన ముసాయిదా చట్టం వల్ల హాంకాంగ్ తన  ప్రత్యేక హక్కులను కోల్పోతుందని నిరసనకారులు వాదిస్తున్నారు. హాంకాంగ్‌‌‌‌ని పూర్తిగా  కలిపేసుకోవడానికి చైనా చేసిన కుటిల యత్నంగా ఈ బిల్లును వర్ణిస్తున్నారు. బిల్లును పూర్తిగా ఎత్తేయాలన్నది హాంకాంగ్‌‌‌‌ ప్రజల డిమాండ్.

బిల్లు ఎందుకు వివాదాస్పదమైంది?

బిల్లు, చట్టంగా మారితే అనుమానితుల పేరుతో ఎవరినైనా ఏకపక్షంగా నిర్బంధించే అవకాశం ఉంటుందని నిరసనకారులు వాదిస్తున్నారు. విచారణ పేరుతో చైనాకు తీసుకెళ్లి హింసకు గురిచేస్తారని భయపడుతున్నారు. చైనాలో కమ్యూనిస్టుల పరిపాలన సాగుతుండగా, హాంకాంగ్‌‌‌‌లో ‘చీఫ్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌’ పాలన సాగుతోంది. 1997లో బ్రిటన్‌‌‌‌ చేతి నుంచి చైనా ఆధీనంలోకి హాంకాంగ్‌‌‌‌ వచ్చినప్పటికీ… అప్పట్లో కుదిరిన ఒప్పందం ప్రకారం 50 ఏళ్ల వరకు ‘స్పెషల్‌‌‌‌ అడ్మినిస్టేటివ్‌‌‌‌ రీజియన్‌‌‌‌’గా ఉంటుంది. అలాగే,అక్కడి న్యాయవ్యవస్థకూడా  బ్రిటిష్‌‌‌‌ చట్టాలకనుగుణంగా అమలువుతోంది.  తాజాపరిణామాల్లో నేరస్తుల అప్పగింత బిల్లు గనుక అమల్లోకి వస్తే… హాంకాంగ్‌‌‌‌లో ఎవరికీ భద్రత ఉండదన్నారు హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రతినిధి సోఫీ రిచర్డ్ సన్. ప్రజల భద్రతకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వలేదన్నారు.

అంతర్జాతీయంగానూ ఆందోళన

హాంకాంగ్ ప్రతిపాదిత చట్టానికి వ్యతిరేకంగా  అంతర్జాతీయంగానూ ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే  హాంకాంగ్ పై చైనా పెత్తనం మరింత పెరుగుతుందని వ్యతిరేకులు వాదిస్తున్నారు. హాంకాంగ్ స్వయం ప్రతిపత్తి  నామ్ కే వాస్తే లా తయారవుతుందన్నారు. అమెరికా, బ్రిటన్, కెనడాలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కేవలం హాంకాంగ్ వాసులపైనే కాకుండా అక్కడ నివసిస్తున్న బ్రిటన్, కెనడా పౌరుల పై కూడా  బిల్లు  ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తం చేశాయి.

ఆందోళనలన్నీ రాజకీయమే: చైనా

ముసాయిదా చట్టంపై  వచ్చిన ఆందోళనలను చైనా ప్రభుత్వం కొట్టి వేసింది. హాంకాంగ్ ప్రభుత్వ ప్రతిపాదనను రాజకీయం చేయడానికే కొన్ని దేశాలు పనిగట్టుకుని వివాదం చేస్తున్నాయని  ఆరోపించింది. హాంకాంగ్ ప్రభుత్వం రూపొందించిన బిల్లుకు మద్దతు కొనసాగిస్తామని చైనా విదేశీ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.

బిల్లుపై వెనక్కి వెళ్లేది లేదు: క్యారీ లామ్

ఎన్ని ఆందోళనలు, నిరసనలు వచ్చినా  బిల్లుపై వెనక్కి వెళ్లేది లేదని హాంకాంగ్ నాయకురాలు క్యారీ లామ్ స్పష్టం చేశారు. బిల్లుకు సంబంధించి జులైలో సవరణలు ఆమోదిస్తామన్నారు. బిల్లులో నిందితులను అప్పగించడంతో పాటు అనేక కీలక అంశాలు ఉన్నాయన్నారు. బిల్లు వల్ల హాంకాంగ్ ప్రజలకు ఎలాంటి నష్టం కలగదని ఆమె భరోసా ఇచ్చారు. సవరణల తర్వాత బిల్లుకు చట్ట రూపం తీసుకువస్తామని క్యారీ లామ్ చెప్పారు. బిల్లు రూపొందించడంలో చైనా తనను ఒత్తిడి చేయలేదని ఆమె స్పష్టం చేశారు. బిల్లుపై  ప్రజల్లో వ్యతిరేకత ఉవ్వెత్తున ఎగసిన నేపథ్యంలో వారికి భరోసా ఇవ్వడానికి హాంకాంగ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ చైనాకు అప్పగించబోమని, కనీసం ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని అలాగే పరారీలో ఉన్న వారిని మాత్రమే చైనాకు అప్పగిస్తామని హామీ ఇచ్చింది.  ఏమైనా హాంకాంగ్ లో నిరసనలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేవు.

జనాలు మహా రిచ్‌‌‌‌!

హాంకాంగ్ జనాభా కోటి దాటదు. కరెక్ట్‌‌‌‌గా చెప్పాలంటే 74 లక్షలే.  వీరంతా అనేక దేశాల జాతీయులు. మొత్తం 1,100  చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హాంకాంగ్ ఉంటుంది. హాంకాంగ్ లో కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ. కావడంతో ‘కమర్షియల్ హబ్’గా పాపులరైంది. ప్రపంచంలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న దేశాల్లో హాంకాంగ్ ఒకటి.  హాంకాంగ్‌‌‌‌కి ‘సర్వీస్ హబ్’ అనే పేరుకూడా ఉంది. చైనాలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పుడు అక్కడి మార్కెట్‌‌‌‌లోకి ప్రవేశించడానికి మల్టీ నేషనల్ కంపెనీలకు హాంకాంగ్ సింహద్వారంలా పనిచేసింది.

చీఫ్ ఎగ్జిక్యూటివే చీఫ్​

హాంకాంగ్‌‌‌‌ ‘చీఫ్ ఎగ్జిక్యూటివ్’ పాలనలో ఉంటుంది. అయినప్పటికీ. చైనా చెప్పుచేతుల్లోనే పనిచేయాలి.  చీఫ్ ఎగ్జిక్యూటివ్ నియామకం కూడా చైనానే చేస్తుంది. పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. హాంకాంగ్‌‌‌‌కి ప్రత్యేకంగా స్థానిక రాజ్యాంగం ఉంటుంది. ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ మాత్రమే ఉంటుంది. కౌన్సిల్ కు సగం మంది ఎన్నికవుతారు. మిగతా సగం మందిని నియమిస్తారు.జ్యుడీషియరీ కి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. కింది కోర్టులు, అప్పిలేట్ కోర్టులు ఉంటాయి. చైనా చెప్పుచేతుల్లోనే  చీఫ్ ఎగ్జిక్యూటివ్ పనిచేయాల్సి ఉంటుంది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ నియామకం కూడా చైనా ప్రధానమంత్రే చేస్తారు.

ఒప్పందంపై వెనక్కి పోతున్న చైనా

హాంకాంగ్ దాదాపు శతాబ్ద కాలానికి పైగా బ్రిటిష్‌‌‌‌ కాలనీగా ఉండేది. నల్లమందు యుద్ధంలో చైనాను ఓడించి ఈ దీవిని బ్రిటన్‌‌‌‌ తన అధీనంలోకి తెచ్చుకుంది.  99 ఏళ్లపాటు తమ లీజులో ఉంటుందని,1997లో అప్పగిస్తామని ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారమే 1984లో సినో–బ్రిటన్‌‌‌‌ తీర్మానంద్వారా చైనాకి హాంకాంగ్‌‌‌‌ని ఇచ్చేయడానికి అంగీకరించింది.  అప్పటి వరకు బ్రిటిష్‌‌‌‌ కాలనీ హోదాలో అనుభవించిన వాణిజ్యం, పరిశ్రమలు, కళా సాంస్కృతిక రంగాల స్వేచ్ఛ ను చైనా హరించేస్తుందన్న ఆందోళన వెలువడింది. అయితే, హాంకాంగ్‌‌‌‌ని ‘స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ రీజియన్’గా కొనసాగిస్తానని ప్రకటించింది.  ‘ఒన్ కంట్రీ–టూ సిస్టమ్స్’ ఫార్ములా కింద అప్పట్లో చైనాకి బ్రిటన్ అప్పగించింది. విదేశీ వ్యవహారాలు, సైనిక రక్షణ వంటివి తప్ప మిగతావన్నింటిలోనూ హాంకాంగ్‌‌‌‌ స్వయం ప్రతిపత్తిని అనుభవిస్తోంది.