వెలుగు ఓపెన్ పేజీ: చారిత్రాత్మక కట్టడాలపై నీలి నీడలు!

వెలుగు ఓపెన్ పేజీ:  చారిత్రాత్మక కట్టడాలపై నీలి నీడలు!

వారసత్వ సంపదకు హైదరాబాద్ పెట్టింది పేరు.  ఐదు శతాబ్దాల నగరం నిండా అబ్బురపరిచే అద్భుతమైన చారిత్రక, కళాత్మక, సృజనాత్మక వారసత్వ కట్టడాలు కాలగమనానికి తార్కాణాలుగా నిలుస్తున్నాయి.  ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన  ఇండో అరబిక్, ఇండో యూరోపియన్, ఇండో సార్సెనిక్ శిల్ప రీతుల్లో గొప్ప భవనాలు వెలిశాయి. నిజాం నవాబులు కట్టించిన ప్యాలెస్​ల నుంచి మసీదులు,  దేవాలయాలు,  చర్చిలు, ఆసుపత్రులు, గ్రంథాలయాలు తదితరమైనవి అద్భుత  కళాఖండాలుగా  విరాజిల్లుతున్నాయి.  ఘన చరిత్రకు  నిదర్శనమైన  సౌధాలపై  ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి.  శతాబ్ద కాలానికి చేరువైన ఉస్మానియా ఆసుపత్రి దశాబ్దాలుగా  పటిష్ట మరమ్మతులకు నోచుకోక శిథిలావస్థకు చేరుకుంది.  ఇలాంటివి అనేక వారసత్వ భవనాలు జీర్ణస్థితికి చేరుకున్నాయి.

హైదరాబాద్ సంస్థానం 1948లో భారత యూనియన్​లో విలీనంకాగా,  కొంతభాగం ప్రస్తుత మూడు రాష్ట్రాలు  తెలంగాణ,  కర్ణాటకలోని కల్యాణ కర్ణాటక ప్రాంతం,  మహారాష్ట్రలోని  మరఠ్వాడా ప్రాంతాల మధ్య విభజితమైంది. 1724 నుంచి 1948 వరకు నిజాం వంశీయులు ఈ రాజ్యాన్ని  పరిపాలించగా తొలినాళ్లలో  దక్కన్  మొఘల్ సామ్రాజ్య వైస్రాయ్ ఉండేవారు.  కాలక్రమంలో హైదరాబాద్ రాజ్యం అనుబంధ కూటమి ఒప్పందం ద్వారా బ్రిటిష్ సార్వభౌమాధికారాన్ని అంగీకరించిన  తొలి సంస్థానంగా మారింది.  ఈ రాజ్యంలోని  ఆనాటి  కట్టడాలు ఎక్కువగా  ఐరోపా మూలాలతో కూడిన ఇండో సార్సెనిక్ వాస్తు లక్షణాలతో  నిర్మితమయ్యాయి. దీని ఫలితంగా  భిన్న శైలి సమ్మేళన వాస్తుకళగా ఈ నిర్మాణ రీతికి ప్రత్యేక ప్రాచుర్యం లభించింది.   గోల్కొండ సుల్తానులు లేదా కుతుబ్ షాహీ  రాజ వంశీయుల పాలనలో రూపుదిద్దుకున్న ఇండో ఇస్లామిక్  వాస్తుకళను 'కుతుబ్​షాహీ వాస్తుశిల్పం'గా వ్యవహరిస్తారు.  ఇందుకు గోల్కొండ కోటను ఉదాహరణగా పేర్కొనవచ్చు. 1591లో   హైదరాబాద్  నగరానికి  పునాదులు వేసి చార్మినార్  కేంద్రంగా  రూపురేఖలు దిద్దిన మహమ్మద్ కులీ కుతుబ్​షా  హయాంలో ఈ శైలి అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఇది బహుమనీ సుల్తానులు, ఇతర దక్కన్ సుల్తానుల రాజ్యాల్లోని వాస్తుకళ  తరహాలోనే  ఉంటుంది.

గోథిక్, నియో గోథిక్ శైలి

గుల్బర్గా, బీజాపూర్, బీదర్​లలోని  వీరి  స్మారక చిహ్నాల  కట్టడాలను  గమనిస్తే  పర్షియన్ వాస్తుశిల్పం  కనిపిస్తుంది. అసఫ్ జాహీ  రాజవంశంతో అంటకాగిన  బ్రిటిష్ పాలకులతో కలసి నిర్మించిన పలు విలాసవంతమైన భవనాలు, మసీదులు,  దేవిడీలు, భారీ ముఖద్వారాలు, సభా ప్రాంగణాలు, కొయ్య రాతి చెక్కడాలు తదితరమైనవి అసఫ్ జాహీ శైలీలో  నిర్మితమయ్యాయి.  ఐరోపా వాస్తుతో భారతీయ ఇస్లామిక్ అంశాలను కలగలిపి కట్టిన హైకోర్టు, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, స్టేట్ సెంట్రల్  లైబ్రరీ,  ఉస్మానియా ఆర్ట్స్ కాలేజి తదితరమైనవి. ఇస్లామిక్, రాజస్తానీ, ఐరోపా  వాస్తుకళా నైపుణ్యాలతో  చౌమల్లా ప్యాలెస్,  ఫలక్ నుమా ప్యాలెస్ తదితర రాజసౌధాలు నిజాం రాజులు నిర్మించారు.  బ్రిటిష్ కాలంలో ఎక్కువగా గోథిక్, నియో గోథిక్ శైలిని  ప్రతిబింబిస్తూ చర్చిలు, ఇస్లామిక్ సంప్రదాయ శైలితో మసీదుల నిర్మాణం జరిగింది.  కొన్నింటిలో ఇండో సార్సెనిక్ శైలి కూడా కనిపిస్తుంటుంది. 

సర్దార్ మహల్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా  ఉన్న అనేక చారిత్రక, వారసత్వ కట్టడాల్లో  చాలావరకు  ప్రభుత్వ నిర్లక్ష్యంతో శిథిలావస్థలోకి  జారిపోతున్నాయి.  పెరిగిపోతున్న భూ విలువల ఎదుట ఈ పురాతన వారసత్వ విలువలు నిలవలేకపోతున్నాయి.  ఈ నేపథ్యంలో  వారసత్వ చట్టం -2017ను  తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.  అయినప్పటికీ  వారసత్వ  కట్టడాలను  కాపాడలేకపోతుండడం పట్ల పలువురు చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కేంద్ర, రాష్ట్ర  పురావస్తు శాఖలు భాగ్యనగరంలో  గుర్తించిన  చారిత్రక కట్టడాలతోపాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ సుమారు 170 భవనాలను చారిత్రక, వారసత్వ నిర్మాణాలుగా గుర్తించింది.  ఉస్మాన్ అలీఖాన్ 1919 నుంచి 1925 మధ్యకాలంలో మూసీనది ఒడ్డున  పటిష్టవంతమైన భవనాలు నిర్మించాడు.  పెద్దపెద్ద మినార్లు, అందమైన అనియన్ డోమ్​లు,  గుమ్మటాలు, గోడలపై అందంగా చెక్కిన లతలు హైదరాబాద్ అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. 1930 వరకు మంచి నీటిని అందించిన హుస్సేన్​ సాగర్ కాలుష్య కాసారంగా మారింది.  నాంపల్లి సరాయి వెక్కిరిస్తూనే ఉంది.  6వ నిజాం మహబూబ్ అలీ పాషా సతీమణి సర్దార్ బేగం 1911 వరకు నివసించిన భవనాన్ని 'సర్దార్ మహల్'గా పిలిచేవారు. ఇదే భవనంలో 1969 నుంచి బల్దియా కార్యాలయం కొనసాగింది. 

తెలంగాణ వారసత్వాన్ని పరిరక్షించాలి

ఎంతోమంది మేధావులు, రాజకీయవేత్తలను  తీర్చిదిద్దిన చారిత్రాత్మకమైన 'సిటీ కళాశాల' భవనం కూడా  శిథిలావస్థకు చేరుకుంది. ఈ భవనాన్ని 1916లో 7వ నిజాం నిర్మించాడు. అప్పట్లో ఉర్దూ మీడియం కొనసాగిన ఈ భవనంలో 1929 నుంచి సిటీ కాలేజీగా మారింది.  చార్మినార్ కట్టడానికి ఉత్తరం వైపున గుల్జార్​హౌస్​ నలువైపులా నాలుగు కమాన్లు నిర్మించారు. ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇలాంటి ఎన్నో కట్టడాలను పరిరక్షించలేకపోతుండడంతో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.  హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు ప్రస్తుత ముఖ్యమంత్రి  రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునివ్వడంతో కట్టడాల  పరిరక్షణలో కొంత కదిలిక వచ్చింది. పురాతన మెట్ల బావులను పునరుద్ధరించేందుకు కొన్ని పారిశ్రామిక సంస్థలు ముందుకు వచ్చాయి. సాలార్ జంగ్, అమ్మపల్లి మెట్లబావులను  భారత్  బయోటెక్, ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్లబావిని ఇన్ఫోసిస్,  మంచిరేవుల మెట్లబావిని సాయిలైఫ్ సంస్థ, అడికెమెట్ మెట్లబావిని దొడ్ల డెయిరీ, ఫలక్​నుమా మెట్లబావిని ఆర్టీసీ, రెసిడెన్సీ మెట్లబావిని కోఠీ ఉమెన్స్ కాలేజీ పునరుద్ధరించేందుకు ఒప్పందాలు జరిగాయి.  గత ప్రభుత్వం చట్టం తెచ్చినప్పటికీ అడుగు ముందుకుపడలేదు. 'తెలంగాణ' అనే పదమే వారసత్వంలోంచి వచ్చింది. అలాంటి వారసత్వాన్ని పరిరక్షించేలాగా ప్రభుత్వం పనితీరు ఉండాలి. 

- కోడం 
పవన్​ కుమార్, 
సీనియర్ జర్నలిస్ట్​