భారీ వర్షాలకు పత్తి రైతుల ఆవిరవుతున్న ఆశలు

భారీ వర్షాలకు పత్తి రైతుల ఆవిరవుతున్న ఆశలు

ఆసిఫాబాద్, వెలుగు : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. పంట చేతికొచ్చే దశలో  వర్షాలు తెరపివ్వకుండా   పడుతుండడంతో దిగుబడి వస్తదో రాదోనని రైతులు దిగులు చెందుతున్నారు. చేన్లలో రోజుల తరబడి వర్షపునీరు  నిలుస్తుండడంతో పత్తి  చేన్లు ఎర్రబారి, పూత, కాయలు రాలిపోతున్నాయి.  లక్షల రూపాయల పెట్టుబడితో సాగుచేసిన పంట కండ్ల ముందే మురిగిపోతుండడంతో డంతో ఏమీ చేయలేకపోతున్నామని రైతులు  ఆవేదన చెందుతున్నారు.  కనీసం సగం దిగుబడి అయినా వస్తదో.. రాదోనని  ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెసర, మినుములు వంటి చిరు పంటలు వర్షాల దెబ్బకు పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తి కూడా అదే పరిస్థితిలో ఉండడంతో పూర్తిగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. 

ఎక్కువగా పత్తి సాగు..

జిల్లాలో రైతులు ఈ యేడు  పత్తి పంటను ఎక్కువగా సాగుచేశారు. అత్యధికంగా 3,15, 559 ఎకరాల్లో వేశారు.  గతేడాది పత్తికి మద్దతు ధర బాగానే ఉండడంతో.. ఈ యేడు దిగుబడి వస్తే అప్పుల బాధలు తీరుతాయని రైతులు అనుకున్నారు. కానీ తీరా  పంట చేతికందే దశలోనే వర్షాలు దెబ్బకొడ్తున్నాయి. పంట చేలు ఎర్రబారి చనిపోతుండడంతో పెట్టిన పెట్టుబడితో పాటు చేసిన కష్టం వృథా అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికే జిల్లాలోని 35 శాతం మంది చేసేదేమి లేక పత్తి చేన్లను వదిలేసి రబీ సాగు కు రెడీ అవుతున్నారు.

పూత రాలింది.. దిగుబడి కష్టమే..

ఈ సీజన్​ అంతా వానలు పడుతుండడంతో పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నది.  2 ఎకరాల్లో పత్తి సాగు చేస్తే.. లక్షా ఇరవై వేల పెట్టుబడి వచ్చింది.  తీరా చూస్తే పెట్టుబడి వచ్చేలా కూడా కనిపిస్తలేదు. పంట ఎర్రబడి చెట్లు చనిపోతుండడంతో ఏం చేయాలో అర్థం అయితలేదు. తీవ్రంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.

- అర్కా మాధవ్ రావు , రైతు , జామ్ని , జైనూర్

దిగుబడి వచ్చేలా లేదు..

ఈ యేడు పత్తి దిగుబడి అంతగా వచ్చేలా లేదు. తెరపివ్వకుండా వానలకు చేనంతా దెబ్బతిన్నది. పెట్టుబడి మోపెడయ్యింది. ఎకరానికి రూ. 70 వేల వరకు పెట్టిన. పెట్టుబడి కూడా ఎల్లేటట్లు కనిపిస్తలేదు.  ప్రభుత్వమే ఏదోరకంగా  ఆదుకోవాలి. 

- సిడం హనుమంతరావు, రైతు , మార్కగూడ పంగిడి మదర, తిర్యాణి