షాపింగ్​ మాల్​లో మంటలు 9 మంది మృతి

షాపింగ్​ మాల్​లో మంటలు 9 మంది మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌‌ కరాచీలోని ఓ షాపింగ్ మాల్‌‌లో ఫైర్​యాక్సిడెంట్​ జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం తొమ్మిది మంది మరణించగా, ఒకరిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కరాచీలోని ఆర్​జే షాపింగ్ ​మాల్​ చాలా పెద్దది. ఇందులో షాపింగ్ సెంటర్లు, కాల్ సెంటర్లు, సాఫ్ట్‌‌వేర్ హౌస్‌‌లు ఉన్నాయి. ఉన్నట్టుండి శనివారం ఉదయం 6:30 గంటలకు మాల్​లో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

దాదాపు 50 మందిని కాపాడగా, తొమ్మిది మంది మంటల్లోనే చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. అగ్నిప్రమాదం తర్వాత మాల్ నుంచి 22 మందిని రక్షించి జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్​కు తరలించగా, వారిలో ఒకరు మార్గమధ్యంలో మరణించారని జిల్లా డిప్యూటీ కమిషనర్ అల్తాఫ్ షేక్ తెలిపారు. కాగా కరాచీలోని 90 శాతం భవనాల్లో ఎలాంటి ఫైర్​ సేఫ్టీ జాగ్రత్తలు లేవని స్థానిక మీడియా పేర్కొంది.