
సినీ అభిమానులకు ఈ ఏడాది సెప్టెంబర్ మాసం అద్భుతమైన వినోదాన్ని పంచింది. శివకార్తికేయన్ 'మధరాసి', అనుష్క శెట్టి 'ఘాటి', తేజ సజ్జ 'మిరాయి' , పవన్ కల్యాణ్ 'ఓజీ' వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాయి. ఈ పెద్ద చిత్రాలతో పాటు, 'కిస్', 'లిటిల్ హార్ట్స్', 'బ్యాడ్ గర్ల్' వంటి చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. ఆ విజయ ఉత్సాహంతో, సినీ ప్రేమికులను థియేటర్లకు రప్పించేందుకు అక్టోబర్ మాసం సిద్ధమైంది. ఈ నెలలో దసరా, దీపావళి పండుగలను టార్గెట్ చేస్తూ వస్తున్న సినిమాల వివరాలు ఇక్కడ చూద్దాం..
దసరాకు పోటాపోటీగా..
తమిళస్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కించిన చిత్రం 'ఇడ్లీ కడై'. ఈ మూవీ అక్టోబర్ 1న థియేటర్లలోకి రానుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నిత్యా మేనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సీనియర్ నటులు సత్యరాజ్, ఆర్ పార్థిబన్, పి సముద్రఖని , రాజ్‌కిరణ్ వంటి భారీ తారాగణం నటించింది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ధనుష్ కావడం విశేషం.
అక్టోబర్ 2: కాంతార: చాప్టర్ 1
దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'కాంతార: చాప్టర్ 1'. 2022 బ్లాక్‌బస్టర్ 'కాంతార'కు ప్రీక్వెల్‌గా వస్తున్న ఈ పౌరాణిక యాక్షన్ డ్రామా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఋషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబళే ఫిలిమ్స్ నిర్మించింది. వలసరాజ్యాల పూర్వపు తీరప్రాంత కర్ణాటక నేపథ్యాన్ని, భూతకోల ఆచారాల మూలాలను, దైవత్వం, పూర్వీకుల మధ్య సంఘర్షణలను ఈ కథ మరింత లోతుగా అన్వేషించనుంది. ఇందులో గుల్షన్ దేవయ్య, రుక్మిణి వసంత్, జయరాం కీలక పాత్రలు పోషించారు. యాక్షన్, ఆధ్యాత్మికత, ప్రాంతీయ జానపదం కలగలిసిన అద్భుతమైన అనుభూతిని ఈ చిత్రం ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
దీపావళి ధమాకా!
దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 16, 2025 న వృషభ అనే పీరియడ్ ఫాంటసీ యాక్షన్ డ్రామా విడుదల కానుంది. నంద కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మోహన్‌లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
'డ్రాగన్' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటించిన కామెడీ డ్రామా 'డూడ్' అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తిశ్వరన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ప్రదీప్ రంగనాథన్ సరసన మమితా బైజు నటిస్తున్న ఈ చిత్రంలో ఆర్ శరత్‌కుమార్, హ్రిధు హారూన్ , రోహిణి ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఇది కీర్తిశ్వరన్‌కు తొలి చిత్రం
నీరజ కోన దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ 'తెలుసు కదా' చిత్రం కూడా సెప్టెంబర్ 17న విడుదల కానుంది.. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK): ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ ఇది. ఈ మూవీని సెప్టెంబర్ 18న రిలీజ్ కానుంది. 2040 నేపథ్యంలో సాగే ఈ ఫ్యూచరిస్టిక్ కథలో ఎస్ జె సూర్య, కృతి శెట్టి కీలక పాత్రలు పోషిస్తుండగా, యోగి బాబు, సీమాన్, మిస్కిన్ వంటి ప్రముఖ నటులు సహాయక పాత్రల్లో కనిపిస్తారు.
విష్ణు విశాల్ నటించి, నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్ 'ఆర్యన్' అక్టోబర్ 31న విడుదల కానుంది. ప్రవీణ్ కె దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్ 34 నెలల విరామం తర్వాత ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, వాణి భోజన్ కీలక పాత్రల్లో నటించారు.
అదే రోజు హాలోవీన్ సందర్భంగా అక్టోబర్ 31, 2025న 'డైస్ ఇరా' (Diés Iraé) మూవీ విడుదల కానుంది. ఈ మలయాళ హారర్ థ్రిల్లర్ చిత్రంలో ప్రణవ్ మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాహుల్ సదాశివన్ రచన, దర్శకత్వంలో తెరకెక్కించారు.
మొత్తం మీద, దసరా, దీపావళి పండుగలతో అక్టోబర్ నెల సినీ అభిమానులకు నిజంగా పండగే అని చెప్పవచ్చు!