
పవన్ తాత, చమిందా వర్మ జంటగా రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ ‘హ్రీం’. శ్రీమతి సుజాత సమర్పణలో శివమ్ మీడియా పతాకంపై శివమల్లాల నిర్మిస్తున్నారు. రాజేశ్ రావూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మార్కస్.యం సంగీతం అందిస్తున్నాడు. గురువారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌కు హీరో సందీప్‌కిషన్ క్లాప్‌నిచ్చారు. రాజీవ్ కనకాల కెమెరా స్విఛాన్ చేశారు. నటులు అలీ, బెనర్జీ, ఆడిటర్ విజయేంద్రరెడ్డి, పర్వతనేని రాంబాబు స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు.
ఈ చిత్ర ఘనవిజయం సాధించాలని అతిథులంతా బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ ‘ఆద్యంతం ఆసక్తి రేపే కథ, కథనాలతో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ అందించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. శుక్రవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. వరంగల్ పరిసరప్రాంతాల్లో పద్నాలుగు రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నాం’ అని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రచయిత జనార్థన మహర్షి, నిర్మాతలు కె.బాబురెడ్డి, జి.సతీష్ కుమార్, దర్శకులు హరీష్ నాగరాజ్, ముకేష్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.