బాలింత మృతి కేసులో కార్పొరేట్ హాస్పిటల్ కు రూ.99 లక్షల ఫైన్

బాలింత మృతి కేసులో కార్పొరేట్ హాస్పిటల్ కు రూ.99 లక్షల ఫైన్
  • దశాబ్ద కాలం విచారణ తర్వాత తీర్పు చెప్పిన రాష్ట్ర వినియోగదారుల ఫోరం

హైదరాబాద్, వెలుగు: బాలింత మృతికి కారణమైన దవాఖానకు రూ.99 లక్షల ఫైన్  విధిస్తూ రాష్ట్ర వినియోగదారు ఫోరం తీర్పు చెప్పింది.  సికింద్రాబాద్‌‌‌‌లోని ఈస్ట్‌‌‌‌  మారేడుపల్లిలో ఉన్న తారాపొరెవాలా నర్సింగ్ హోమ్‌‌‌‌కు ఈ ఫైన్  విధించింది. ఈ నర్సింగ్‌‌‌‌  హోమ్‌‌‌‌లో 2013 ఆగస్ట్‌‌‌‌లో ఓ మహిళ డెలివరీ కోసం అడ్మిట్  అయింది. ఆమె గర్భిణి అయినప్పటి నుంచి ఇదే హాస్పిటల్‌‌‌‌లోని డాక్టర్  శిరిన్‌‌‌‌ వద్ద చెకప్స్  చేయించుకుంటున్నది.

డాక్టర్  సూచన మేరకు అంచనా డెలివరీ డేట్  కన్నా ముందే హాస్పిటల్‌‌‌‌లో అడ్మిట్  అయ్యింది. చేరిన మరుసటి రోజు ఆమెకు నార్మల్  డెలివరీ అయింది. డెలివరీ తర్వాత ఆమెకు బ్లీడింగ్ (పోస్ట్‌‌‌‌పార్టమ్ హెమరేజ్‌‌‌‌) అయింది. బాలింత భర్త హరిప్రసాద్‌‌‌‌ ఈ విషయంపై డాక్టర్‌‌‌‌‌‌‌‌ను సంప్రదించగా, ఇలా బ్లీడింగ్  అవడం సహజమేనని, భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్  సమాధానం ఇచ్చారు.

అయినా, హరిప్రసాద్  కంగారు పడి ఇంకేదైనా పెద్ద హాస్పిటల్‌‌‌‌కు తన భార్యను షిఫ్ట్  చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ, డాక్టర్  ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చారు. కాసేపటికే ఆమె పరిస్థితి దిగజారింది. దీంతో సికింద్రాబాద్‌‌‌‌లోని సన్‌‌‌‌షైన్  హాస్పిటల్‌‌‌‌  బ్లడ్‌‌‌‌ బ్యాంకుకు వెళ్లి బ్లడ్‌‌‌‌  తీసుకురావాలని హరిప్రసాద్‌‌‌‌కు డాక్టర్  సూచించారు. ఆయన బ్లడ్  తీసుకువచ్చేసరికి సమయం 11:25 అయింది. డాక్టర్  ఆ బ్లడ్ కూడా ఎక్కీయకుండానే పేషెంట్  పరిస్థితి సీరియస్‌‌‌‌గా ఉందని, ఇక ఆమెను కాపాడలేమని చేతులు ఎత్తేశారు.

ఉదయం 11:45 గంటలకు హరిప్రసాద్  భార్య చనిపోయింది. డాక్టర్  నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం, తన భార్య చనిపోయిందని హరిప్రసాద్‌‌‌‌.. రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. సుమారు 11 సంవత్సరాల విచారణ అనంతరం బాలింత మృతికి హాస్పిటల్‌‌‌‌, డాక్టరే కారణమని తేల్చిన కోర్టు.. బాధితునికి రూ.99 లక్షలు చెల్లించాలని హాస్పిటల్‌‌‌‌ను ఆదేశించింది. ఖర్చుల కింద మరో రూ.50 వేలు చెల్లించాలని పేర్కొంది