మత్తుమందు లేకుండానే ఆపరేషన్లు.. గాజాలో పెయిన్ కిల్లర్లకూ తీవ్ర కొరత

మత్తుమందు లేకుండానే ఆపరేషన్లు.. గాజాలో పెయిన్ కిల్లర్లకూ తీవ్ర కొరత

గాజా/జెరూసలెం: ఇజ్రాయెల్ నిర్బంధం, బాంబుదాడులతో తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిన గాజా స్ట్రిప్ లో తిండి, నీళ్లు, మందులు లేక జనం గోస పడుతున్నారు. దవాఖాన్లలో మత్తుమందులు, పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ అయిపోవడంతో గాయాలతో వచ్చిన పేషెంట్లకు డాక్టర్లు మత్తుమందులు ఇవ్వకుండానే ఆపరేషన్లు చేస్తూ, కుట్లు వేస్తున్నారు. దీంతో నొప్పిని తట్టుకోలేక చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా గాజా సిటీలోని అల్ షిఫా ఆస్పత్రి వద్ద పరిస్థితి చాలా దయనీయంగా మారింది. 

గాజాలోకి మరిన్ని ట్రక్కుల సాయాన్ని అనుమతిస్తే తప్ప తమకు అత్యవసర మందులు అందే అవకాశంలేదని డాక్టర్లు చెప్తున్నారు. మరోవైపు ఈ ఆస్పత్రి కింద అండర్ గ్రౌండ్ లో హమాస్ మిలిటెంట్ల హెడ్ క్వార్టర్స్ ఉందంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ ఆస్పత్రి పరిసరాల్లో మిలిటెంట్లతో పోరాటం చేస్తున్నట్లు వెల్లడించింది. గాజాలో కాల్పులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురువారం మరోసారి తేల్చిచెప్పారు. 

అయితే, గాజాను మళ్లీ ఆక్రమించుకోవాలని గానీ, ఆ ప్రాంతాన్ని పరిపాలించాలని గానీ తమకు లేదన్నారు. హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే తమ లక్ష్యమని, ఆ పని పూర్తయ్యేదాకా దాడులు మాత్రం ఆగవన్నారు.