V6 News

పొల్యూషన్‌‌తో పెరుగుతున్న మైగ్రేన్.. కాలుష్యం పెరిగిన కొద్దీ తలనొప్పి రిస్క్‌‌ ఎక్కువ !

పొల్యూషన్‌‌తో పెరుగుతున్న మైగ్రేన్.. కాలుష్యం పెరిగిన కొద్దీ తలనొప్పి రిస్క్‌‌ ఎక్కువ !
  • అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ జర్నల్ వెల్లడి 
  • ఇజ్రాయెల్‌‌లో 7 వేల మందిపై పదేండ్లపాటు రీసెర్చ్ 
  • పొల్యూషన్ అధికంగా ఉన్న రోజుల్లో హాస్పిటల్‌‌కు క్యూ కడుతున్న మైగ్రేన్ బాధితులు 

హైదరాబాద్, వెలుగు: వాయు కాలుష్యం ఊపిరితిత్తులనే కాదు.. నేరుగా మెదడును కూడా దెబ్బతీస్తున్నది. గాలిలో పొల్యూషన్ స్థాయిలు పెరిగినప్పుడు మైగ్రేన్ ఎటాక్స్ విపరీతంగా పెరుగుతున్నాయని ఇజ్రాయెల్‌‌లోని బెన్ గురియన్ యూనివర్సిటీ రీసెర్చ్‌‌లో వెల్లడైంది. డాక్టర్ ఇడో పెలెస్ నేతృత్వంలో సుమారు 7,032 మంది బాధితులపై పదేండ్లపాటు సాగిన ఈ రీసెర్చ్ రిపోర్టును అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ జర్నల్ ఇటీవలే ప్రచురించింది. 

కేవలం కాలుష్యమే కాకుండా.. ఎండ తీవ్రత, యూవీ కిరణాలు, గాలిలో తేమ కూడా మైగ్రేన్‌‌ను ప్రేరేపిస్తున్నాయని సైంటిస్టులు గుర్తించారు. పొల్యూషన్‌‌లో కొద్దిసేపు ఉన్నా తలనొప్పి తీవ్రత పెరుగుతుందని, బాధితుల హాస్పిటల్ విజిటింగ్స్, ఫార్మసీ రికార్డులే దీనికి నిదర్శనమని స్టడీ స్పష్టం చేసింది.

వెహికల్స్‌‌ పొగతో.. 41 శాతం రిస్క్ 
వెహికల్స్ నుంచి వచ్చే నైట్రోజన్ డై ఆక్సైడ్ గ్యాస్ స్థాయిలు పెరిగినప్పుడు మైగ్రేన్ ఎటాక్ వచ్చే అవకాశం 41% ఎక్కువగా ఉందని రీసెర్చ్ తేల్చింది. స్టడీలో పాల్గొన్న వారిలో 32 శాతం మంది తీవ్రమైన తలనొప్పి వల్ల హాస్పిటల్ మెట్లెక్కగా, 47 శాతం మంది ట్రిప్టాన్ మందులను వాడారు. 

సాధారణంగా నైట్రోజన్‌‌ డై ఆక్సైడ్​ సగటు 8.7   పార్ట్స్‌‌ పర్‌‌‌‌ బిలియన్‌‌ (పీపీబీ) ఉండగా, ఎటాక్స్ పెరిగిన రోజుల్లో అది 11.2 పీపీబీగా నమోదైంది. అలాగే, ఎండ తీవ్రత పెరిగినప్పుడు తలనొప్పి ముప్పు 23 శాతం పెరిగినట్టు గుర్తించారు. గాలిలో పీఎం 10 ధూళి కణాలు 119.9, పీఎం 2.5 సూక్ష్మ కణాలు 27.3 స్థాయికి చేరినప్పుడు బాధితులు మైగ్రేన్ తో ఇబ్బందులు పడినట్టు స్టడీ పేర్కొంది.

క్లైమేట్ చేంజ్‌‌తో డేంజర్.. 
కాలుష్య కణాలు ఒక్కొక్క వాతావరణంలో ఒక్కొక్కలా మెదడుపై ప్రభావం చూపుతాయని స్టడీ వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రత, తక్కువ తేమ ఉన్నప్పుడు నైట్రోజన్ డై ఆక్సైడ్‌‌ ప్రభావం పెరిగి తలనొప్పికి దారి తీస్తున్నది. అలాగే, చలిగా ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పీఎం 2.5 కణాలు మైగ్రేన్ ఎటాక్స్‌‌ ను తీవ్రం చేస్తున్నాయి. 

దీర్ఘకాలికంగా కాలుష్య ప్రాంతాల్లో ఉండేవారిలో మైగ్రేన్ మందుల వాడకం 10 శాతం ఎక్కువగా ఉన్నట్టు రీసెర్చర్లు గుర్తించారు. క్లైమేట్ చేంజ్ వల్ల ఎండలు, కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో బాధితులు అప్రమత్తంగా ఉండాలని, కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగడం తగ్గించాలని, ఇళ్లలో ఎయిర్ ఫిల్టర్లు వాడాలని డాక్టర్ పెలెస్ సూచించారు.

హైదరాబాద్‌‌లోనూ హైరిస్క్ పొల్యూషన్
ఇజ్రాయెల్ స్టడీలో పేర్కొన్న హై-రిస్క్ కాలుష్యస్థాయిల కంటే మన హైదరాబాద్‌‌లో పొల్యూషన్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. స్టడీలో పీఎం 2.5 స్థాయి 27 నమోదైతేనే బాధితులు హాస్పిటల్స్‌‌కు క్యూ కట్టగా, మన దగ్గర ఇది ఏకంగా 60 వరకు నమోదవుతున్నది. 

పీఎం 10 స్థాయి ఇక్కడ సుమారు 150 మార్కును దాటుతుండగా, జూపార్క్ లాంటి ప్రాంతాల్లో నైట్రోజన్ డై ఆక్సైడ్ 10 పీపీబీపైనే ఉంటోంది. అంటే ఇక్కడి వాతావరణం కూడా మైగ్రేన్ తీవ్రతకు కారణమవుతుండొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్టడీ హెచ్చరిస్తున్న ప్రమాదకర కారకాలు సిటీలో గాలిలో రెట్టింపుస్థాయిలో ఉన్నాయని, మన ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.