- ఎలైట్ హోటల్ సిబ్బంది ఘాతుకం
దిల్ సుఖ్ నగర్, వెలుగు: కేవలం రూ.600 తక్కువగా ఇచ్చాడని హోటల్ సిబ్బంది దాడి చేయడంతో.. ఓ టూరిస్ట్ గైడ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇస్లావాత్ శంకర్ అనే వ్యక్తి హైదరాబాద్ టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 21న గుజరాత్ నుంచి కొంతమంది టూరిస్టులు రాగా, వారికి కర్మన్ ఘాట్‌లోని ఎన్7 ఎలైట్ హోటల్ లో రూములు బుక్ చేసి శంకర్ బస కల్పించాడు.
మరుసటి రోజు వారు హోటల్ ఖాళీ చేసి వెళ్లారు. వారు ఇచ్చిన డబ్బుల్లో శంకర్ హోటల్ సిబ్బందికి రూ.600 తక్కువగా ఇచ్చాడు. దీంతో హోటల్ సిబ్బంది నూర్, కమలుద్దీన్, ఇస్లాం జహీదుల్, రహీమ్ అనే నలుగురు వ్యక్తులు ఆయనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. బాధితుడు శంకర్ సమీపంలోని ఫోకస్ హాస్పిటల్లో ప్రథమ చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లాడు.
గాయాలు తగ్గక ఈ నెల 26న అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో కుటుంబసభ్యులు ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ 27న మృతిచెందాడు. మృతుడి కొడుకు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సరూర్ నగర్ సీఐ సైదిరెడ్డి తెలిపారు.
