హోటళ్లకు మస్తు గిరాకీ

హోటళ్లకు మస్తు గిరాకీ

న్యూఢిల్లీ: మనదేశంలోని ఏ టూరిస్ట్​ ప్రాంతంలో చూసినా హోటళ్లు కళకళలాడుతున్నాయి. కశ్మీర్​ లాంటి కొన్ని ప్రాంతాల్లోని హోటళ్లకు, రిసార్టులకు గత పదేళ్లలో ఎన్నడూ లేనంత డిమాండ్​ కనిపిస్తోంది. ఉదాహరణకు గుల్​మార్గ్​లో ఉండే ఖైబర్​ హిమాలయన్​ రిసార్ట్​ ఆక్యుపెన్సీ రేటు 91 శాతం వరకు ఉంది. ఈ వేసవిలో యావరేజ్​ డెయిలీ రూమ్ ​రేటు రూ.40 వేల వరకు పలికింది. ఇక్కడి టూరిస్ట్​ రోప్​లైన్స్​, కాటేజీ రూమ్స్​ ఆక్యుపెన్సీ 95 శాతం ఉంది. రోప్​వేను చూడటానికి ప్రతి నెలా 14 వేల మంది వరకు వస్తున్నారు. విమాన చార్జీలు కూడా విపరీతంగా పెరుగుతున్నా  రద్దీ మాత్రం తగ్గడం లేదని హోటల్​ జీఎం వినీత్​ చాబ్రా అన్నారు. 

ఈ ప్రాంతంలోని హైవేలపై కార్లు ట్రాఫిక్​జామ్​లో ఇరుక్కుపోవడం సర్వసాధారణం. విదేశాలకు విమాన చార్జీలు అడ్డగోలుగా పెరగడం, వీసాల జారీ ఆలస్యం అవుతుండటంతో మనదేశంలోని టూరిస్ట్ లొకేషన్లకు రద్దీ ఎక్కువ అవుతోంది.  హిమాచల్ ప్రదేశ్, దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాలు , అనేక ఇతర టూరిస్టు లొకేషన్లు అంతకుముందు క్వార్టర్​తో పోలిస్తే ఈసారి మూడు రెట్లు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాయి. ముస్సోరీ, కొడైకెనాల్, చిక్కమగళూరు వంటి వాటికి గత క్వార్టర్​లో బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు దాదాపు ఐదు రెట్లు పెరిగాయని ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రిప్ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ధరలు 15శాతం ఎక్కువగా ఉన్నా డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గలేదని పేర్కొంది. వేసవి డిమాండ్​ కారణంగా హోటల్ ​ పరిశ్రమకు బాగా లాభాలు వస్తున్నాయని క్లియర్​ట్రిప్​కు చెందిన మనూ శశి ధరణ్  ​అన్నారు. 

పెరిగిన విమాన ప్రయాణాలు

తమకు దేశీయ హోటల్ బుకింగ్స్​ 30–-35శాతం పెరిగాయని యాత్రా డాట్​కామ్​ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్– జూన్ మధ్య దేశీయ విమాన ప్రయాణాల్లో 20–-25శాతం పెరుగుదల ఉందని పేర్కొంది.   ఏప్రిల్–-జూన్ లో మనాలి, నైనిటాల్, ముస్సోరీ, కాశ్మీర్, లేహ్,  లడఖ్ వంటి పాపులర్​ హిల్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు డిమాండ్ వార్షికంగా 50-–60శాతం మధ్య పెరిగింది. ఈ ప్రాంతాలకు విమాన ఛార్జీలు 40–-50శాతం ఎగిశాయి. విపరీతంగా పెరుగుతున్న హోటల్ రేట్లు రాబోయే సంవత్సరాల్లో డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గించవచ్చని ఆపరేటర్లు అంటున్నారు. హోటల్,  విమాన ఛార్జీల్లో విపరీతమైన పెరుగుదల ఉన్నా ఈ సంవత్సరం వేసవి ప్రయాణాలు తగ్గకపోవడం ఆసక్తికరమైన విషయమని చెబుతున్నారు. ఇంటర్నేషనల్​ బుకింగ్స్ ఈసారి 34శాతం తగ్గాయి. కరోనా వ్యాప్తి తర్వాత దేశీయ బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 2019 స్థాయిల కంటే రెట్టింపు స్థాయికి చేరుకున్నాయి.