ఈ ఏడాది సిటీలో ఇండ్ల ధరలు 4% పైకి

ఈ ఏడాది సిటీలో ఇండ్ల ధరలు 4% పైకి

హైదరాబాద్‌‌: ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీతో సహా మరో మూడు సిటీలలో  ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో ఇండ్ల ధరలు సగటున 5 శాతం పెరిగాయని ప్రాపర్టీ బ్రోకరేజ్ కంపెనీ ప్రాప్‌‌టైగర్‌‌‌‌ డాట్ కామ్‌‌ పేర్కొంది. ముడిసరుకుల ధరలు ఎక్కువవ్వడం, డిమాండ్  పెరగడంతో ఇండ్ల రేట్లు పెరిగాయని వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఎనిమిది సిటీలలోని ప్రైమరీ మార్కెట్‌‌లలో చదరపు అడుగు ధర సగటున రూ. 6,600– 6,800 రేంజ్‌‌లో ఉంది. కిందటేడాది డిసెంబర్  నాటికి  చదరపు అడుగు ధర రూ.6,300– 6,500  గా పలికిందని ఈ సంస్థ పేర్కొంది. ‘ప్రైమరీ హౌసింగ్ మార్కెట్‌‌లో ఇండ్ల ధరలు కొద్దిగా పెరగడాన్ని చూశాం. సిమెంట్‌‌, స్టీల్ వంటి  కీలకమైన ముడిసరుకుల ధరలు పెరగడంతో ఇండ్ల ధరలు ఎక్కువయ్యాయి’ అని రే ఇండియా సీఎఫ్‌‌ఓ వికాశ్‌‌ వాధావన్ అన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన  రే గ్రూప్‌‌, యూఎస్ కంపెనీ న్యూస్‌‌ కార్ప్‌‌లకు చెందిన జాయింట్ వెంచర్ కంపెనీ  రే ఇండియా. హౌసింగ్ డాట్ కామ్‌‌, ప్రాప్‌‌టైగర్‌‌‌‌, మకాన్‌‌ డాట్ కామ్‌‌లు  ఈ కంపెనీకి చెందినవే. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత హౌసింగ్ మార్కెట్‌‌లో డిమాండ్ ఊపందుకుందని, ఇండ్ల ధరలు పెరగడానికి ఇదొక కారణమని వాధావన్ చెప్పారు. ‘డిమాండ్ బాగుండడంతో రానున్న కాలంలో ఇండ్ల ధరలు మరింత పెరుగుతాయి. వడ్డీ రేట్లను ఆర్‌‌‌‌బీఐ పెంచుతున్నా హౌసింగ్ సెక్టార్‌‌‌‌లో డిమాండ్ కొనసాగుతోంది. కన్‌‌స్ట్రక్షన్ సెక్టార్‌‌‌‌లో వాడే కొన్ని మెటీరియల్స్ ధరలు దిగొచ్చాయి. అయినప్పటికీ కిందటేడాదితో పోలిస్తే ఇంకా గరిష్ట స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి’ అని ఆయన వివరించారు. 

తక్కువ రేటు అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లోనే..

ప్రాప్‌‌‌‌టైగర్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, హైదరాబాద్‌‌‌‌లో ఇండ్ల ధరలు సగటున 4 శాతం పెరిగాయి. కిందటేడాది డిసెంబర్ నాటికి ఈ సిటీలో  చదరపు అడుగు ధర రూ.5,900 – 6,100  ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ.6,100 – 6,300 కి పెరిగింది. అహ్మదాబాద్‌‌‌‌లో ఇండ్ల ధరలు 5 శాతం పెరిగాయి. ఈ సిటీలో చదరపు అడుగు ధర  రూ. 3,400 – 3,600 రేంజ్ నుంచి రూ.3,600 – 3,800 రేంజ్‌‌‌‌కు పెరిగింది. బెంగళూరులో చదరపు అడుగు ధర  రూ.5,500 – 5,700 నుంచి 6 శాతం పెరిగి రూ. 5,900– 6,100 కి ఎగిసింది. చెన్నైలో చదరపు అడుగు ధర 2 శాతం పెరిగి  రూ.5,400 – 5,600 నుంచి రూ.5,500– 5,700 కి చేరుకుంది. ఢిల్లీ–ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌లో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో ఇండ్ల ధరలు 5 శాతం పెరిగాయి. ఈ సిటీలో చదరపు అడుగు ధరలు కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోని రూ.4,400 – 4,600 నుంచి రూ. 4,700– 4,900 కి పెరిగాయి. కోల్‌‌‌‌కతాలో చదరపు అడుగు ధర 3 శాతం పెరిగి రూ.4,300 – 4,500 నుంచి  రూ.4,4‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌00– 4,600 కు, ముంబైలో చదరపు అడుగు ధర 3 శాతం పెరిగి రూ.9,700– 9,900 నుంచి రూ.9,900– 10,100 కి చేరుకున్నాయి. అదే పూణే విషయానికొస్తే ఈ సిటీలో చదరపు అడుగు ధర ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో రూ.5,100–5,300 నుంచి రూ.5,500–5,700 కి పెరిగింది. ఇది 7 శాతం పెరుగుదలకు సమానం.