ఇండ్లు కట్టకుండనే.. ఊరును ముంచేస్తున్రు

ఇండ్లు కట్టకుండనే.. ఊరును ముంచేస్తున్రు

ఆగమైన అనంతగిరి పల్లె

ఒకటి రెండు రోజుల్లో అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి మిడ్ మానేరు నీరు
గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్న అధికారులు
కిరాయికి ఇండ్లు దొరక్క నిర్వాసితులకు కష్టాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా అన్నపూర్ణ​ రిజర్వాయర్​లో అధికారులు నీరు నింపుతుండటంతో అనంతగిరి పల్లెవాసులు ఊరు ఖాళీ చేస్తున్నారు. పునరావాసం కల్పించాల్సిన సర్కారు​ ఇంకా ఇండ్లు పూర్తి చేయకపోవడంతో నిర్వాసితులు తట్టబుట్టా సర్దుకుని చెట్టుకొకరు.. గుట్టకొకరు చెదిరిపోతున్నారు. అద్దె ఇండ్లు దొరక్క.. ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాక గ్రామం ఖాళీ చేస్తామని చెప్పినా ఎవరూ వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో రూ.2700 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్ట్​ 10 ప్యాకేజీలో భాగంగా అన్నపూర్ణ రిజర్వాయర్​ నిర్మిస్తున్నారు. మూడున్నర టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్​కు 2,800 ఎకరాల భూమి సేకరించారు. ప్రాజెక్ట్​లో అనంతగిరి గ్రామానికి చెందిన 830 కుటుంబాలు సర్వం కోల్పోతున్నాయి. 2,860 మంది నిర్వాసితులవుతున్నారు. వీరికి రిజర్వాయర్​ కట్ట పక్కనే పునరావాసం కాలనీ ఏర్పాటు చేస్తున్నారు. రిజర్వాయర్​పనులు దాదాపు పూర్తయ్యాయి. గురు లేదా శుక్రవారం రిజర్వాయర్​లో మిడ్​మానేర్​నీళ్లు నింపి ట్రయల్​రన్​నిర్వహించే అవకాశం ఉంది. మిడ్​మానేర్​బ్యాక్​వాటర్ ను గ్రావిటీ ద్వారా ఓబుటపూర్​ నుంచి తిప్పాపూర్​ సర్జిపూల్ కు మళ్లించి అక్కడి నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్​కు లిఫ్టింగ్​చేయనున్నారు. ఇక్కడి నుంచి సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్, కొండ పోచమ్మ, మల్లన్న సాగర్​కు కాళేశ్వరం జలాలు చేరుకుంటాయి.

బలవంతంగా ఖాళీ చేయిస్తున్నరు

తమకు పూర్తిస్థాయి పరిహారం ఇచ్చేంతవరకు ఊరు ఖాళీ చేయబోమని భీష్మించుకు కూర్చున్న నిర్వాసితులను సర్కారు  బలవంతంగా ఖాళీ చేయిస్తోంది. నెల రోజులు సమయం ఇవ్వాలన్నా వినడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్ లోకి నీరు వదులుతున్నట్లు అధికారులు ప్రకటించారు. విద్యుత్​ కనెక్షన్లు తొలగిస్తున్నారు. మూడు రోజుల క్రితం పోలీసులు, అధికారులు గ్రామానికి వచ్చి ఊరు ఖాళీ చేయాలని  కచ్చితంగా చెప్పడంతో ముంపు భయంతో  గ్రామాన్ని వదులుతున్నారు. అధికారులు దగ్గరుండి మరి నిర్వాసితులను ఖాళీ చేయిస్తున్నారు. అత్యవసరంగా ఖాళీ చేయిస్తున్నందుకు ఖర్చుల కింద రూ. 50 వేలు అదనంగా ఇస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

పునాదుల్లోనే పునరావాస కాలనీ

పునరావాస కాలనీ ఇంకా పునాది దశలోనే ఉంది. అన్నపూర్ణ ప్రాజెక్ట్​​ను ఆనుకుని పోచమ్మ దేవాలయం సమీపంలో 76 ఎకరాల్లో పునరావాస ఏర్పాట్లు ప్రారంభించిన సర్కారు ఇంకా పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించలేదు. ఇక్కడ భూ యజమాని భూమి ఇవ్వనని కోర్టు మెట్లు ఎక్కడంతో 100 ఇండ్ల నిర్మాణం నిలిచిపోయింది. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్​ గ్రామ శివారులో కూడా 60 ఎకరాల్లో పునరావాస కాలనీ ఏర్పాటు చేస్తుండగా ఇక్కడా పనులు పునాదుల్లోనే ఉన్నాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్లి కిరాయికి ఇండ్లు వెతుక్కుంటున్నారు. కిరాయి ఇండ్లు దొరకకపోవడంతో గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు 18 ఏళ్లు నిండిన అర్హులైన వారందరికి ఇంకా పరిహారం అందలేదు. దరఖాస్తు చేస్తే టెక్నికల్​ ప్రాబ్లమ్​తో అధికారులు తిరస్కరిస్తున్నారు.

బిడ్డల లగ్గం ఎట్ల చేసేది

నాకు ఇద్దరు కూతుళ్లు. ఒక కొడుకు. కూతుళ్లు విద్య ఇంటర్​ సెకండియర్, అశ్విని ​ఫస్టియర్ ​చదువుతున్నారు. కొడుకు దిలీప్​తో పాటు ఇద్దరు కూతుళ్లకు 18 ఏళ్లు నిండాయి. 2019 కటాఫ్ ​తేదీని పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వం ప్రకటించిన పరిహారానికి వీళ్లు ముగ్గురూ అర్హులవుతారు. కానీ ప్రభుత్వం 2017 వరకే కటాఫ్​ తేదీని తీసుకోవడంతో నా పిల్లలతోపాటు గ్రామంలో ఎంతోమంది యువత నష్టపోతున్నారు. భూమి, ఇల్లు ప్రాజెక్ట్​లో పోయింది. సామానంతా సర్దుకుని ఊరు ఖాళీ చేయాల్సి వస్తోంది. 20 లక్షల పరిహారం ఇస్తే అప్పులు తీర్చగా మిగిలిన డబ్బుతో ఇల్లు ఎలా కట్టాలి. ఇద్దరు కూతుళ్ల లగ్గం ఎట్లా చేయాలి. ప్రభుత్వం 2019 కటాఫ్​తేదీగా నిర్ణయించి యువతకు పరిహారం ఇవ్వాలి.
– కొలపురి లచ్చయ్య, నిర్వాసితుడు

పునరావాసం కల్పిస్తాం

అన్నపూర్ణ ప్రాజెక్ట్​ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తాం. ప్రభుత్వపరంగా వచ్చే ప్రయోజనాలు అన్ని అందజేశాం. పునరావాస పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అప్పటివరకు అద్దె ఇండ్లలో ఉండాలని సూచించాం. ఇందుకోసం రూ.50 వేలు అదనంగా అందిస్తున్నాం. నిర్వాసితులు స్వచ్ఛందంగానే ఊరు విడిచిపోతున్నారు. కోర్టుకు వెళ్లిన 102 కుటుంబాలకు సంబంధించిన పరిహారం కోర్టులో డిపాజిట్​ చేశాం. చట్టపరంగా వారికి రావాల్సిన అన్నిరకాల పరిహారం ప్రభుత్వం చెల్లించింది. 2019 వరకు 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు అడుగుతున్నారు. అది ప్రభుత్వ పరిధిలో ఉంది. నిర్వాసితులందరికి న్యాయం చేస్తాం.

– ఆర్డీవో శ్రీనివాస్​ రావ్

For More News..

20 వేల ఏండ్ల కిందటి అలుగు.. చెక్కుచెదరని దేహం

వాషింగ్టన్‌లో ల్యాండవ్వగానే భారత టూర్‌పై ట్రంప్ ట్వీట్

మంగమ్మా.. ఏందమ్మా మీ సమస్య? కలెక్టర్‌నంటూ పరిచయం చేసుకొని..

సరోగసి బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. 16 వారాల ఇన్సూరెన్స్ 36 వారాలకు పెంపు