- లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పండుగలో పాల్గొనాలె
- వివిధ దశల్లో మరో 1.90 లక్షల గృహాలు
- నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండలో ఇందిరమ్మ టవర్లు
- మేడ్చల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, మేడ్చల్, వెలుగు: ఈ దీపావళికి రాష్ట్రవ్యాప్తంగా 2.21 లక్షల ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశాలు పూర్తవుతున్నాయని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పేదల సొంతింటి కల నెరవేరుతున్న వేళ వారి ఇండ్లలోనే దీపావళి పండుగ జరగాలని ఆకాంక్షించారు. గృహప్రవేశాలు చేసుకున్న లబ్ధిదారుల ఇండ్లకు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, హౌసింగ్ అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు వెళ్లి పండుగ సంబురాల్లో పాల్గొనాలని కోరారు.
బుధవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన మాట్లాడారు. దీపావళి రోజున పేదల ఇండ్లలో వెలిగే ప్రతి దీపం ప్రజా ప్రభుత్వ సంకల్పానికి ప్రతీక కావాలని అన్నారు. ఈ సందర్భంగా 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు' పోస్టర్‌ను మంత్రులు ఆవిష్కరించారు.
మరో 1.90 లక్షల ఇండ్లు నిర్మాణ దశల్లో..
పేదల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని పొంగులేటి తెలిపారు. ఇప్పటివరకు 2,21,500 ఇండ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయని, మరో 1.90 లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.40 వేల కోట్లతో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోమని స్పష్టం చేశారు.
లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రతి సోమవారం గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా నిధులు జమ చేస్తున్నామని వివరించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాలతో పాటు మారుమూల ప్రాంతాలు, తండాల్లోనూ ఇండ్ల నిర్మాణం కొనసాగుతుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
నాలుగు కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్లు..
హైదరాబాద్ తరహాలోనే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్లు నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. జీ+5 విధానంలో చేపట్టనున్న ఈ నిర్మాణాలకు సంబంధించి దీపావళిలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. ఈ టవర్ల నిర్మాణంతో ఆయా నగరాల్లో పేదలకు మరిన్ని గృహాలు అందుబాటులోకి రానున్నాయి.
