- రూ.500 కోట్ల రెవెన్యూ వస్తుందని అంచనా
- కన్సల్టెన్సీకి వేలం నిర్వహణ బాధ్యత
హైదరాబాద్, వెలుగు: భూముల వేలానికి హౌసింగ్ బోర్డు రెడీ అయింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కోట్ల విలువైన ల్యాండ్ ను వచ్చే నెలల్లో వేలం వేయనుంది. ఈ రెండు జిల్లాల్లో మొత్తం 11.80 ఎకరాల భూములకు వేలం నిర్వహించనుంది.
దీంతో రూ.500 కోట్ల రెవెన్యూ వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేలం నిర్వహణ బాధ్యతలను కన్సల్టెన్సీకి అప్పగించనున్నారు. దాని ఎంపిక కోసం అధికారులు టెండర్లను పిలిచారు. వచ్చే నెల 2 వరకు గడువు విధించగా 4వ తేదీ ఫైనాన్సియల్ బిడ్ ఓపెన్ చేసి కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు.
వచ్చే నెలాఖరులోగా భూముల వేలాన్ని పూర్తి చేయనున్నారు. టెండర్ దక్కించుకున్న కన్సల్టెన్సీ.. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలను సంప్రదించి ఖాళీ భూముల వివరాలు, వాటి ప్రాధాన్యం, ఏ ఏరియాలో ఉన్నయి వంటి అంశాలపై వివరించనుంది.
ఈ ప్రాంతాల్లో ల్యాండ్ పార్సిల్స్
హైదరాబాద్ లో కీలక ప్రాంతం అయిన కూకట్ పల్లి కేపీహెచ్ బీ కాలనీలో మూడు ప్రాంతాల్లో 2.5 ఎకరాల ల్యాండ్ ఉంది. ఫేస్ 1, 2 లో 6,549 గజాలు, మరోచోట 2,420 గజాలు, ఫేస్ 3 లో 2397.80 గజాలను వేలం వేయనున్నారు. వీటికి గజం రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఖరారు చేశారు. ఎకరం కనీసం రూ.66 కోట్లుగా నిర్ణయించారు. ఈ ధర వేలంలో రూ.80 కోట్ల వరకు వెళుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది ఆగస్టులో కూకట్ పల్లిలో హౌసింగ్ బోర్డు ల్యాండ్ ను వేలం వేయగా ఎకరం రూ.70 కోట్ల చొప్పున టాప్ రియాల్టీ కంపెనీ గోద్రెజ్ ప్రాపర్టీస్ 7.8 ఎకరాలను రూ.547 కోట్లకు కొనుగోలు చేసింది. మేడ్చల్ జిల్లా చింతల్ లో రెండు చోట్ల కలిపి 3.24 ఎకరాలు ఉన్నాయి.
వీటికి గజం ధర రూ. 60 వేల నుంచి రూ.72 వేల వరకు నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల లో 4 చోట్ల మొత్తం 5.49 ఎకరాల ల్యాండ్ ఉంది. దీనికి గజం ధర రూ.40 వేల నుంచి రూ. 60 వేల వరకు నిర్ణయించారు.
ఇందిరమ్మ స్కీమ్‌కు ఫండ్స్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ భూములను, ప్లాట్లను వేలం వేస్తోంది. దీంతో సర్కారుకు భారీగా రెవెన్యూ వస్తోంది. ఈ ఫండ్స్ తో గత 6 నెలల్లోనే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను శరవేగంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వానికి నిధుల కొరత ఉన్నా ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు.
నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను మంజూరు చేయగా ప్రస్తుతం 2 లక్షలకు పైగా ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటిని వచ్చే ఏడాది జూన్ లోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు భూముల వేలంతో ఇందిరమ్మ స్కీమ్ కు నిధులు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
రెండో దశలో భారీగా వేలం
ఈ నెలలో చందానగర్ లో 7,118 గజాల భూమిని వేలం వేసేందుకు వారంలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. దీని కనీస ధరను రూ.29 కోట్లుగా ఖరారు చేశారు. అలాగే కరీంనగర్, ఘటకేసర్ శివారులోని సింగపూర్ టౌన్ షిప్ లో 13 ఎకరాలతో పాటు వివిధ జిల్లాల్లోని 6 కమ్యూనిటీ హాల్స్, 1200 ప్లాట్లు, 110 ఇండ్లకు వేలం నిర్వహించనున్నా మని హౌసింగ్ బోర్డు అధికారులు చెబుతున్నారు. వీటి ద్వారా రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
