చదివించి .. లెఫ్టినెంట్‌‌ కొలువిస్తారు

చదివించి .. లెఫ్టినెంట్‌‌ కొలువిస్తారు

బీటెక్‌‌ చదువుకొని, లెఫ్టినెంట్‌‌ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం ఇండియన్‌‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌‌ ఎంట్రీ స్కీమ్‌‌ ద్వారా సొంతం కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్​ ఇటీవలే విడుదలైంది. జేఈఈ మెయిన్‌‌ స్కోరుతో నియామకాలుంటాయి. రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు. ఈ అవకాశం వచ్చినవారికి బీటెక్‌‌ కోర్సు, లెఫ్టినెంట్‌‌ కొలువులకు సంబంధించిన ఉచిత శిక్షణ నాలుగేళ్లు కొనసాగుతుంది. 

అర్హత: మొత్తం 90 పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌‌ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్‌‌ ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ మెయిన్స్‌‌-2023 స్కోరు తప్పనిసరి. పురుషులు మాత్రమే అర్హులు. 16– 1/2 ఏళ్ల నుంచి 19 –1/2 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. 

సెలెక్షన్​: జేఈఈ మెయిన్‌‌ స్కోరుతో విద్యార్థులను కుదిస్తారు. ఇందులో నిలిచినవారికి సర్వీస్‌‌ సెలక్షన్‌‌ బోర్డు (ఎస్‌‌ఎస్‌‌బీ) ఆధ్వర్యంలో బెంగళూరులో ఐదు రోజులపాటు రెండు దశల్లో సైకలాజికల్‌‌ పరీక్షలు, గ్రూప్‌‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. తొలిరోజు స్టేజ్‌‌-1 స్క్రీనింగ్‌‌ (ఇంటెలిజెన్స్‌‌) పరీక్షల్లో అర్హత సాధించినవారిని స్టేజ్‌‌-2కి ఎంపిక చేస్తారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే వివిధ పరీక్షల్లో అన్ని విభాగాల్లోనూ రాణించినవారిని శిక్షణకు తీసుకుంటారు. 

ట్రైనింగ్​:  శిక్షణ నాలుగేళ్లు కొనసాగుతుంది. ఇందులో రెండు దశలు...ఫేజ్‌‌-1 మూడేళ్ల ప్రీ కమిషన్‌‌ ట్రైనింగ్‌‌. ఫేజ్‌‌-2 ఏడాది పోస్ట్‌‌ కమిషన్‌‌ ట్రైనింగ్‌‌ ఉంటాయి. 

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో నవంబర్​ 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.