చాలామంది తాము లేకపోయినా తమ కుటుంబం రోడ్డున పడకూడదని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని లక్షల రూపాయల ప్రీమియంలు కడుతూ భారీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. తాము చనిపోతే ఆ డబ్బులు ఆటోమేటిక్‌గా భార్యాపిల్లలకే చేరుతాయని నమ్ముతారు. కానీ ఇది పూర్తి నిజం కాదు. చనిపోయిన వ్యక్తికి గనక అప్పులు, వ్యాపార బాధ్యతలు, పర్సనల్ గ్యారెంటీలు ఉన్నట్లయితే.. ఆ ఇన్సూరెన్స్ సొమ్ము ఫ్యామిలీకి కాకుండా.. నేరుగా అప్పిచ్చిన వాళ్ల జేబుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
దీనికి సంబంధించిన షాకింగ్ నిజాలను చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. చాలామంది డెత్ బెనిఫిట్ అనేది కుటుంబానికి దక్కే ప్రైవేట్ ఆస్తి అనుకుంటారు. కానీ అది తప్పు. అప్పులతో చనిపోతే.. మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని కూడా క్రెడిటర్స్ లాగేసుకునే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు.
అప్పులిచ్చినోళ్లు ఇన్సూరెన్స్ డబ్బును ఎలా క్లెయిమ్ చేస్తారు?
మనం చనిపోయినంత మాత్రాన మనం చేసిన అప్పులు మాయం కావు. చట్టప్రకారం ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని పేరిట ఉన్న ఆస్తుల నుంచి అప్పులను రికవరీ చేసుకునే హక్కు రుణదాతలకు అంటే అప్పు ఇచ్చిన వాళ్లకు ఉంటుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సాధారణ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది సదరు వ్యక్తి వ్యక్తిగత ఆస్తి కిందకే వస్తుంది.
ఉదాహరణకు: ఒక వ్యాపారవేత్త రూ.2 కోట్ల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. కానీ అతను చనిపోయే సమయానికి రూ.3 కోట్ల బిజినెస్ లోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు రాగానే.. బ్యాంకులు, అప్పిచ్చిన వారు కోర్టు ద్వారా ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫలితంగా ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే రూ.2 కోట్లు అప్పులకే సరిపోతాయి. కుటుంబానికి పైసా దక్కకపోగా.. ఇంకా కోటి రూపాయలు అప్పు మిగిలే ఉంటుంది.
ఫ్యామిలీని కాపాడే ‘MWPA’ అస్త్రం..
మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? అంటే... ఖచ్చితంగా ఉంది. అదే మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్(MWPA), 1874. ఈ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం, ఒక పెళ్లైన పురుషుడు తన భార్యాపిల్లల ప్రయోజనం కోసం ప్రత్యేకంగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవచ్చు.
ఒక్కసారి పాలసీని MWPA కింద రిజిస్టర్ చేస్తే.. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు సదరు వ్యక్తి సొంత ఆస్తిగా పరిగణించబడవు. అదొక 'ట్రస్ట్' లాగా మారిపోతుంది. దీని కారణంగా పాలసీదారుడు చనిపోతే.. ఆ డబ్బు నేరుగా భార్యాపిల్లలకే చెందుతుంది. ఎలాంటి అప్పుల రికవరీ కోసం బ్యాంకులు, కోర్టులు ఆ డబ్బును తాకలేవు. దీని కోసం అదనంగా ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టక్కర్లేదు. పాలసీ తీసుకునేటప్పుడే దీనికి సంబంధించిన ఫామ్ పూర్తి చేస్తే సరిపోతుంది. ఒకసారి MWPA కింద పాలసీ తీసుకున్నాక, భవిష్యత్తులో లబ్ధిదారులను మార్చడం లేదా ట్రస్టీల అనుమతి లేకుండా పాలసీ ప్రయోజనాలను పొందడం సాధ్యం కాదు.
హోమ్ లోన్లు, బిజినెస్ అప్పులు, పర్సనల్ గ్యారెంటీలు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఇన్సూరెన్స్ బ్యాంకుల పాలవకుండా, నిజంగా ఫ్యామిలీకే చేరాలంటే MWPAని ఉపయోగించుకోవడం బెస్ట్ అని సీఏ సూచిస్తున్నారు.
