V6 News

హార్మూజ్‌‌పై మార్కెట్ ఫోకస్‌.. ఆయిల్ ధరలు పెరిగితే మార్కెట్‌‌కు నష్టమే

హార్మూజ్‌‌పై మార్కెట్ ఫోకస్‌.. ఆయిల్ ధరలు పెరిగితే మార్కెట్‌‌కు నష్టమే

ముంబై: ఈ వారం స్టాక్‌‌ మార్కెట్‌‌ డైరెక్షన్‌‌ను ప్రధానంగా మూడు అంశాలు ప్రభావితం చేయనున్నాయని ఎనలిస్టులు తెలిపారు. ‘‘మొదటిది పశ్చిమాసియాలోని జియోపొలిటికల్‌‌ పరిస్థితులు, ముఖ్యంగా హార్మూజ్‌‌ జలసంధి చుట్టూ జరుగుతున్న పరిణామాలు. రెండవది కంపెనీల మార్చి క్వార్టర్‌‌‌‌ ఫలితాలు. మూడవది ముడి చమురు ధరల్లో  మార్పులు”అని వివరించారు.

‘‘అమెరికా–ఇరాన్‌‌ చర్చలు, చమురు ధరల్లో మార్పులు,  గ్లోబల్‌‌ సంకేతాలు ఈ వారం  మార్కెట్‌‌ డైరెక్షన్‌‌ను నిర్ణయిస్తాయి. చమురు ధరలు స్థిరంగా ఉంటే  లేదా తగ్గితే ఇన్వెస్టర్ల నమ్మకం పెరుగుతుంది. కానీ హార్మూజ్‌‌ జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగితే మార్కెట్ నష్టాలు కొనసాగొచ్చు. ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌‌ బుకింగ్‌‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది” అని  ఆన్‌‌లైన్ ట్రేడింగ్‌‌ కంపెనీ ఎన్రిచ్‌‌ మనీ సీఈఓ పొన్మూడి ఆర్‌‌‌‌ వివరించారు.

‘‘ప్రస్తుతం బ్రెంట్‌‌ క్రూడ్‌‌ ధర బ్యారెల్‌‌కు 107  డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  ఇండియా ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఆయిల్ ధరల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చమురు ధరలు గరిష్టాల్లో కొనసాగితే  ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఫలితంగా  రూపాయి  బలహీనపడుతుంది.

కంపెనీల లాభాలు కూడా పడిపోతాయి”అని లివ్‌‌లాంగ్‌‌ వెల్త్‌‌ ఎనలిస్ట్‌‌ హరిప్రసాద్ కే తెలిపారు. దేశీయంగా చూస్తే,  ఈ నెల 28న ఇండస్ట్రియల్ ప్రొడక్షన్  (ఐఐపీ) డేటా, మే 1న విదేశీ మారక నిల్వలు డేటా విడుదల కానున్నాయి. అంతర్జాతీయంగా ఏప్రిల్‌‌ 29న అమెరికా ఫెడరల్‌‌ రిజర్వ్‌‌ వడ్డీ రేటు నిర్ణయం, అమెరికా జీడీపీ అంచనా, తయారీ పీఎంఐ డేటా విడుదలవుతాయి. శుక్రవారం మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్లకు సెలవు.