'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' మేనియా.. రూ.3,700 టికెట్‌కైనా వెనక్కి తగ్గని ఫ్యాన్స్!

'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' మేనియా.. రూ.3,700 టికెట్‌కైనా వెనక్కి తగ్గని ఫ్యాన్స్!

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ( Spider-Man: Brand New Day ) విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 31న విడుదల కానున్న ఈ చిత్రం.. భారతీయ ప్రేక్షకుల కోసం ఒక రోజు ముందుగానే జూలై 30న థియేటర్లలోకి రానుంది. టామ్ హాలెండ్ మరోసారి పీటర్ పార్కర్‌గా కనిపిస్తుండగా.. జెండాయా, సేడీ సింక్, జాకబ్ బాటలాన్ కీలక పాత్రల్లో నటించారు.

అంచాలను మించిన క్రేజ్..

ఇప్పటికే సెన్సార్ ప్రక్రియ పూర్తిచేసుకున్న ఈ సినిమా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో 38వ చిత్రంగా, స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో నాలుగో భాగంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమాపై నెలకొన్న క్రేజ్ అంచనాలను మించి ఉంది. దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్‌కు అభిమానులు పోటెత్తుతుండగా.. ఇప్పటికే సుమారు రూ.60 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

టికెట్ ధర రూ.3,700

సాధారణ థియేటర్లలో టికెట్ ధరలు రూ.200 నుంచి ప్రారంభమైనప్పటికీ.. IMAX, 4DX, SCREEN X, Dolby Cinema, ICE 3D, MX4D, P[XL], BIGPIX వంటి ప్రీమియం ఫార్మాట్లలో లగ్జరీ సీట్ల ధరలు రూ.3,700 దాటడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఓపెనింగ్ డే షోల కోసం టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ALSO READ : నా మాజీ భార్యకు చాలా మందితో సంబంధాలు.. 

 గ్లోబల్ ఓపెనింగ్ ఎంతంటే?

ఇక బాక్సాఫీస్ అంచనాలు కూడా సంచలనంగా ఉన్నాయి. మొదటి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా 465 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని ట్రేడ్ రిపోర్టులు అయితే ఈ సంఖ్య 800 మిలియన్ డాలర్ల వరకు చేరొచ్చని చెబుతున్నాయి. అదే జరిగితే 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' తర్వాత అత్యధిక గ్లోబల్ ఓపెనింగ్ సాధించిన చిత్రాల్లో 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' నిలిచే అవకాశం ఉంది.

144 నిమిషాల 52 సెకన్ల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొనగా.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి మొదలైంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.