ఉబెర్కు కలిసొస్తున్న శనివారం .. ఈ ఏడాదంతా ఆ రోజునే భారీగా బుకింగ్స్

ఉబెర్కు కలిసొస్తున్న శనివారం .. ఈ ఏడాదంతా ఆ రోజునే భారీగా బుకింగ్స్

క్యాబ్ సర్వీసుల సంస్థ ‘ఉబెర్’ కీలక గణాంకాలను వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారతీయులు తమ క్యాబ్ లలో దాదాపు 11 బిలియన్ల నిమిషాల పాటు ప్రయాణించారని ఉబెర్ తెలిపింది. 11 బిలియన్ నిమిషాల  సమయం మొత్తాన్ని లెక్కేస్తే 7,638 రోజులకు లేదా 251 నెలలకు లేదా 21 ఏళ్లకు సమానం. ఈ గణాంకాలను బట్టి 2022 సంవత్సరంలో ఉబెర్ క్యాబ్స్ ను భారతీయులు ఎంతగా వాడుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ‘హౌ ఇండియా ఉబెర్డ్ ఇన్ 2022’ శీర్షికతో తాజాగా ఉబెర్  కంపెనీ విడుదలచేసిన వార్షిక విశ్లేషణ నివేదికలో ఈ అంశాన్ని వెల్లడించింది.

భూమి– నెప్ట్యూన్ మధ్యనున్న దూరంతో సమానంగా తిరిగిండ్రు..

ఇక ఈ ఏడాది భారతీయులు ఉబెర్ లో  4.5 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించారని నివేదిక తెలిపింది. ఈ దూరాన్ని కొలత వేస్తే.. భూమి, నెప్ట్యూన్ గ్రహాల మధ్యనున్న దూరంతో సమానంగా ఉంటుందని పేర్కొంది. సౌర గ్రహంలో అత్యంత దూరంగా ఉన్న గ్రహం నెప్ట్యూనే అని తెలిసిందే. చాలావరకు ఉబెర్ క్యాబ్స్ సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యే బుక్ అయ్యాయని తెలిపింది. ఇక వారంలో ప్రత్యేకించి శనివారం రోజే అత్యధికంగా ఉబెర్ క్యాబ్స్ బుకింగ్స్ జరిగాయని వివరించింది. అత్యధిక ప్రజాదరణ పొందిన తమ క్యాబ్ సర్వీసుల్లో ఉబెర్ గో మొదటి స్థానంలో ఉండగా, ఉబెర్ ఆటో రెండో స్థానంలో ఉందని పేర్కొంది. 

హైదరాబాద్ మూడోప్లేస్ లో..

అత్యధిక ఉబెర్ ట్రిప్స్ నడిచిన నగరాల జాబితాలో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోల్ కతా తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక ఉబెర్ క్యాబ్స్ బాగా బుక్ అయిన ఇంటర్ సిటీ రూట్లలో ముంబై టు పుణె, ముంబై టు నాసిక్, ఢిల్లీ టు ఆగ్రా, జైపూర్ టు చండీగఢ్, లక్నో టు కాన్పూర్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 123 నగరాల్లో ప్రస్తుతం తమ సేవలు అందుబాటులో ఉన్నట్లు ఉబెర్ తెలిపింది.