
ప్రత్యేక ఓటర్ల సమగ్ర జాబితా సవరణ సర్వే సాధారణంగా చేపట్టే ప్రక్రియనే అయినప్పటికీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు చేస్తుండడంతో ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేనా? అని ప్రశ్నిస్తూ.. ఎన్నికల సంఘంచర్యలను ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. బిహార్ ఓటర్ల జాబితాసవరణలో పారదర్శకత పాటించడంలేదని లక్షల సంఖ్యలోఓటర్లను ఇష్టానుసారంగా తొలగిస్తోందని ధ్వజమెత్తుతున్నాయి.
కేంద్రంలోని పాలకుల ఆదేశాలకు తలొగ్గే ఇలాంటి చర్యలుతీసుకుంటోందని మండిపడ్డాయి. మరోవైపు ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం ఖండిస్తూ స్పష్టతను ఇస్తోంది. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితా సవరణ సర్వే చేస్తున్నామని చెబుతోంది.
గత నెల 25న ఓటర్ల సమగ్ర జాబితా సర్వేను ప్రారంభించగా.. ఈనెల 26తో ముగుస్తుంది. వచ్చే నెల 1న ముసాయిదా జాబితా ప్రకటించనుంది. ఇక బిహార్‌లో ఓటరు జాబితా సవరణ సర్వేకు ముందు మొత్తం 7.89 కోట్ల ఓటర్లుంటే.. ఇప్పటివరకు 7.59 కోట్ల మందికిపైగా వివరాలను ముసాయిదా జాబితాలో చేర్చింది. ఇంకో 43 లక్షలమందికి పైగా వివరాలు లేవని గుర్తించింది. మరోవైపు చూస్తే.. బిహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ సర్వే ప్రక్రియ ప్రతిపక్షాలు తప్పుబడుతున్న నేపథ్యంలో అది చర్చనీయాంశమైంది.
శక్తిమంతమైన ఆయుధం ఓటు
దేశంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిబద్ధతతో, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో భారత ఎన్నికల సంఘానిది కీలకపాత్ర. ఇది రాజ్యాంగంలోని 324 ఆర్టికల్ ద్వారా ఏర్పాటైన స్వయం ప్రతిపత్తి సంస్థ. రాజ్యాంగ మూలసూత్రాలకు కట్టుబడి ఎన్నికలను నిక్కచ్చిగా, నిర్భయంగా నిర్వహించే న్యాయాధికారాలను కలిగి ఉంటుంది.
పార్లమెంటుకు, కేంద్రపాలిత, రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు.. ఇలా ఏ ఎన్నికల్లోనైనా షెడ్యూల్ విడుదల నుంచి ఫలితాల వెల్లడిదాకా అన్నీ తానై నిర్వహిస్తోంది. అయితే.. కొన్నేండ్లుగా ఎన్నికల సంఘంపై ఆరోపణలు లేకపోలేదు. స్వతంత్రత, నిబద్ధత కలిగిన రాజ్యాంగబద్ధమైన సంస్థ అయినప్పటికీ.. పారదర్శకతతో, నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదంటూ రాజకీయ పార్టీలు వేలెత్తి చూపే పరిస్థితులు ఉంటున్నాయి.
ఎన్నికల సంస్కరణలకు టీఎన్ శేషన్ ఆద్యుడు
1990–96 మధ్య కాలంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా టీఎన్ శేషన్ పనిచేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయనకు ముందు, ఆ తర్వాతగా చూడాల్సి ఉంటుంది. తన హయాంలో శేషన్ ఎన్నికల సంస్కరణల్లో, నిర్వహణలో చారిత్రక, విప్లవాత్మక మార్పులు చేసిన కమిషనర్లలో ఆద్యుడిగా నిలిచారు. సంస్థ ప్రతిష్టను, గౌరవాన్ని సమున్నతస్థాయిలో నిలబెట్టారు. ఇందుకు ఉదాహరణగా చూస్తే.. ఓటరు జాబితాలో సమూల మార్పులు, ఎన్నికల నిబంధనలు కఠినం చేశారు.
ఓటర్ ఐడీ కార్డులను తప్పనిసరి చేస్తూ.. బోగస్ ఓట్లను నియంత్రించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేలా తొలిసారిగా.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి తెచ్చారు.
అభ్యర్థుల ఖర్చులపై ఆడిటింగ్ పద్ధతిని తీసుకొచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో గోడలపై రాతలు, మతపరమైన ప్రదేశాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవడం వంటివి నిషేధించారు. ఇలా ఎన్నికల నిర్వహణలో ఎన్నో మార్పులు చేశారు. శేషన్ కాలం నాటి ఎన్నికల కమిషన్ తీరులో పారదర్శకత కనిపించేది. ఇవాళ అలాంటి పారదర్శకత కనిపించడంలేదనే అనుమానాలు ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.
తార్కుండే నివేదికను అమలు చేయాలి
కేంద్ర ఎన్నికల సంఘం తన స్వతంత్రత, నిబద్ధత,పారదర్శకత చుట్టూ ఆరోపణలు ఎదుర్కొంటోంది. కొన్ని దేశాలకు ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో సహకారం అందిస్తూ.. ప్రశంసలు అందుకుంటూ పల్లకీల మోత మోగుతుంటే.. ఇంట్లోనేమో వివాదాలు, ఆరోపణలు, విమర్శలతో ఈగల మోత ఎదుర్కొంటున్నట్టుగా తయారైంది. ఎన్నికల సంఘంపై ఏ పార్టీ అధికారంలో ఉన్నా విపక్ష నేతలు పక్షపాత ఆరోపణలు చేస్తుంటే.. అధికార పక్ష నేతలు సమర్థిస్తుంటారు.
ఎన్నికల సంఘంపై వచ్చే ఆరోపణలు, విమర్శలు, వివాదాల వంటివి నానాటికి హెచ్చు మీరొద్దనుకుంటే ఎన్నికల కమిషనర్ల ఎంపిక విధానాన్ని, ఎన్నికల నిర్వహణలో, ఓటర్ల జాబితాల సవరణలో పటిష్టమైన సంస్కరణలు రావాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల సంఘం విశ్వసనీయతపై దేశ ప్రజల్లో విశ్వాసం బలపడాలంటే ప్రత్యేక ఎంపిక ద్వారా కమిషనర్ల నియామకం ఉండాలి. ఇందుకు 1970 దశకంలోని తార్కుండే కమిషన్ నివేదికను అమలుపరచాలి.
ప్రజాభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వాలి
ఓటర్ల జాబితాల సవరణకు ఎప్పటికప్పుడు టెక్నాలజీతోపాటు బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఆధార్ లింకేజీని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఇందుకు కఠినమైన చట్టాలను రూపొందించి అమలు చేయాలి. అమెరికాలోనైతే.. పోలింగ్ రోజున కూడా ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ఉంది. ఇలాంటి విధానాన్ని మనదేశంలోనూ అనుసరించాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అవగాహనకు విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలి.
ప్రధానంగా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యం పటిష్టతకు కృషి చేయాలి. అంతర్జాతీయంగా మెరుగైన ఎన్నికల సంస్కరణలను అనుసరించడం, చట్టాలుగా రూపొందించుకోవడం ద్వారా కూడా ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా మారే అవకాశం ఉంది. తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సంఘం మరింత బలోపేతమవుతుందని ఆశించవచ్చు.
- వేల్పుల సురేశ్, సీనియర్ జర్నలిస్ట్–